47 రోజులపాటు సుదీర్ఘంగా సాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎట్టకేలకు ముగిసింది. సమ్మె విరమణకు సిద్ధంగా ఉన్నట్టు కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఈ మేరకు ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. గత అక్టోబర్ 4వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన సమ్మెలో దాదాపు 50 వేలమంది కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వం విధుల్లో చేరాలని రెండుసార్లు గడువు విధించినా.. కార్మికులు పెద్దగా చలించలేదు. కొంతమంది కార్మికులు మాత్రమే విధుల్లో చేరారు.
అయితే సుదీర్ఘ సమ్మె అనంతరం ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లోకి చేరేందు సిద్ధమవుతుండటంతో వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా వ్యవహరించనుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఆర్టీసీ సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఒకింత చురుగ్గా వ్యవహరించారు. పలుమార్లు సుదీర్ఘ సమీక్షా సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కాపాడేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవంటూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను నిర్ద్వందంగా తోసిపుచ్చారు. ఈ క్రమంలో ఏకంగా రాష్ట్రంలోని 5,100 రూట్ల ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో హైకోర్టులో ఆశించిన ఫలితం దక్కపోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడులకు లోనయ్యారు. తదనంతర పరిణామాల్లో సమ్మె విరమించాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.