Idream media
Idream media
తెలంగాణ జన సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండ రాం గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ నాయకుడిగా తెరపైకి వచ్చారు. తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులుగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం గత ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అయినప్పటికీ ప్రజా ఉద్యమంలో తన వంత పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టభద్రుల కోటాలో జరిగే రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. టీఆర్ఎస్ ప్రస్తుత సిట్టింగ్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని మరోసారి బరిలో నిలిపే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కోదండరాం విపక్షాల అందరి మద్దతు తో నిలబడాలని భావించారు. అందుకు అందరినీ కలిసి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
విద్యావంతుడిగా ఉన్న పేరుతో..
ఖమ్మం-వరంగల్-నల్గొండతో పాటు హైదరాబాద్-రంగారెడ్డి-ఉమ్మడి మహబూబ్‌నగర్ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన సభ్యుల పదవీకాలం 2021 మార్చి 29 నాటికి పూర్తి కానుంది. గడువు ముగిసేలోపే ఎన్నిక నిర్వహించాల్సి ఉన్నందున రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు నమోదు కార్యక్రమానికి ఇప్పటికే నోటిఫికేషన్ జారీచేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి అర్హులైన వారు నమోదు చేసుకోవాలని పేర్కొంది. 2015 ఎన్నికల్లో ఓటర్ల జాబితాను పూర్తిగా రద్దు చేశారు. కనుక 2017 నాటికి పట్టభద్రులైన వారు అక్టోబర్ 1వ తేదీనుంచి దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. దీంతో అన్ని పార్టీలూ దానిపై దృష్టి సారించాయి. విద్యావంతుడు, మేధావిగా పేరొందిన కోదండరాం పట్టభద్రుల కోటాలో జరిగే ఎన్నికలు కాబట్టి ప్రభావం చూపగలరని టీజేఎస్ భావిస్తోంది. దీనికి విపక్షాల అందరి మద్దతు కూడా లభిస్తే విజయం సులవవుతుందని భావించింది.
తేల్చేసిన కాంగ్రెస్
ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో విపక్ష పార్టీల అందరితో పాటు కాంగ్రెస్ తో కలిసి కోదండ రాం పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతు ఉంటుందని కోదండరాం ఆశించారు. పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ నేతలు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్ అధ్యక్షతన గాంధీభవన్‌లో ఆదివారం ఈ సమావేశం జరిగింది. వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీపడుతున్న కోదండరాంకు మద్దతుపై సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఇతర పార్టీలకు మద్దతు ఇస్తే పార్టీ క్యాడర్ దెబ్బతుంటుందని కొందరు భావించారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారికే టికెట్ ఇవ్వాలని, బలమైన అభ్యర్థిని మనమే నిలబెడదామని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ లెక్కన కోదండరాం కు కాంగ్రెస్ మద్దతు లేనట్లే. ఈ నేపథ్యం లో ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తారా.. లేదో వేచి చూడాల్సిందే.