తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. స్వస్తిక్ గుర్తుతోపాటు ఏ గుర్తుతోనైనా ఓటు వేసినా పరిగణలోకి తీసుకోవాలంటూ నిన్న రాత్రి ఎన్నికల సంఘం సర్కులర్ జారీ చేసింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీ.. హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. ఆన్‌లైన్‌లో విచారించిన హైకోర్టు.. ఈసీ నిర్ణయాన్ని తప్పుబడుతూ జారీ చేసిన సర్కులర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సాధారణంగా పోలింగ్ సమయంలో స్వస్తిక్ గుర్తునే ఉపయోగిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం స్వస్తిక్ గుర్తునే ఉపయోగించాలని నిబంధనను పొందుపరిచింది. ఇప్పటి వరకు బ్యాలెట్ పత్రాలతో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ స్వస్తిక్ గుర్తునే ఉపయోగించారు. ఓటర్లు తమకు ఇచ్చిన బ్యాలెట్‌లో ఎంపిక చేసుకున్న అభ్యర్థి సింబల్‌పై స్వస్తిక్ గుర్తుతో ఓటు వేయాల్సి ఉంటుంది. అభ్యర్థి సింబల్ ముద్రించిన బాక్సు దాటినా దాన్ని చెల్లని ఓటుగా పరిగణిస్తారు. అలాంటిది రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ గుర్తుతో ఓటు వేసినా.. చెల్లుతుందంటూ అర్థరాత్రి సర్కులర్ జారీ చేసింది. పెన్నుతో గీచినా, వేలి ముద్రతో ఓటు వేసినా.. చెల్లుతుందంటూ వివాదాస్పద సర్కులర్ జారీ చేయడంపై రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఈ రోజు ఉదయం బీజేపీ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఆన్‌లైన్‌లోనే వాదనలు విన్నది. ఈసీ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన హైకోర్టు.. ఏ గుర్తునైనా ఎలా అనుమతిస్తారని ప్రశ్నించింది. అలా అయితే స్వస్తిక్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు ఎంపిక చేసిందని ప్రశ్నించింది. ఈసీ నిర్ణయం హాస్యాస్పదంగా ఉందంటూ వ్యాఖ్యానించింది. అయితే నిబంధనల ప్రకారమే తాము నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.
Also Read:గ్రేటర్ కౌటింగ్‌పై వివాదం.. కోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్..