ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అనేది సమాజంలో జరిగే సంఘటనల మీద చాలా వేగంగా స్పందిస్తుంది అనే మాట వాస్తవం. రాజకీయం అయినా, హత్యలు అయినా రేప్ ఘటనలు అయినా సరే వేగంగా స్పందిస్తూ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తుంది. అయితే ఈ సోషల్ మీడియా చేసే ఓవర్ యాక్షన్ కొన్ని సందర్భాల్లో చికాకు పెడుతుంది. ఉన్నదీ లేనట్టు లేని విషయాన్ని ఉన్నట్టు చూపించడం, ప్రజలను తప్పుదోవ పట్టించడంలో సోషల్ మీడియా అనేది మరింత దిగజారుతుందనే మాట వినిపిస్తోంది.
ఇక ఇప్పుడు సోషల్ మీడియా తెలంగాణా ప్రభుత్వానికి చికాకుగా మారింది. ఇటీవల సైదాబాద్ లో చిన్నారి రేప్ ఘటన సంచలనం అయింది. ఈ రేప్ ఘటనకు సంబంధించి తెలంగాణా పోలీసులు ఎంత కష్టపడ్డారో తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా కొంత కష్టపడ్డారు. సోషల్ మీడియాలో కొందరు విస్తృతంగా అతని గురించి ప్రచారం చేసారు. ఇక అతనికి పది లక్షల రివార్డ్ ప్రకటించడం, ఫోటోలను వైరల్ చేయడం అన్నీ కూడా ఒక రేంజ్ లో ప్రచారం చేసారు. అక్కడి వరకు సోషల్ మీడియా బాగా విజయవంతం అయింది అనే చెప్పాలి.
ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకోవడాన్ని సోషల్ మీడియా ప్రపంచం ఆనందించింది. సోషల్ మీడియాలో అతని చావుతో దేవుడు న్యాయం చేసాడని కామెంట్స్ చేసారు. అయితే కొందరు అత్యుత్సాహం తో చేస్తున్న వ్యాఖ్యలే ఇప్పుడు చికాకు పెడుతున్నాయి. అతను చనిపోలేదని చంపేశారు అని చెప్తూ… కేటిఆర్ పొరపాటు పడి ట్వీట్ చేయడం ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకోవడాన్ని లింక్ చేస్తూ… ఒక పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిందని అభినందించడం మొదలుపెట్టారు. కొన్ని కొన్ని విషయాల్లో కేసీఆర్ గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఒక పక్కన ప్రభుత్వం దీన్ని ఆత్మహత్య అని చెప్తుంది, పోలీసులు కూడా దీన్ని ఆత్మహత్యగా అక్కడ రైల్వే సిబ్బంది చెప్తున్న మాటలను, రైతులు చెప్తున్న మాటలను వీడియోలతో సహా ప్రజల ముందు పెడుతున్నారు. కాని సోషల్ మీడియాలో మాత్రం దిశా ఘటనకు దీనికి పోలుస్తూ న్యాయం చేయాలంటే తుపాకీ తోనే కాదు ట్రైన్ తో కూడా చేయొచ్చు అంటూ కామెంట్స్ చేయడం ఇబ్బందిగా మారింది. ఇక దీని మీద హైకోర్ట్ లో పిల్ కూడా దాఖలు అయింది. ఇప్పటికే దిశా కేసు వ్యవహారం తో ఇబ్బంది పడుతున్న పోలీసులు ఈ ఘటనలో సోషల్ మీడియా హడావుడి తో చికాకు పడుతున్నారు.