iDreamPost
android-app
ios-app

స‌చివాల‌య భ‌వ‌నాల కూల్చివేత‌కు మ‌రికొన్నాళ్లు బ్రేక్‌

స‌చివాల‌య భ‌వ‌నాల కూల్చివేత‌కు మ‌రికొన్నాళ్లు బ్రేక్‌

ఈ నెల 13 వ‌ర‌కు తెలంగాణ స‌చివాల‌యం కూల్చివేత పనులు నిలిపివేయాలని ఆదేశించిన హైకోర్టు తాజాగా మ‌రికొన్ని ఆదేశాలు జారీ చేసింది. నగరానికి చెందిన సామాజికవేత్త పీఎల్ విశ్వేశ్వర రావు వేసిన పిల్‌పై కోర్టులో విచారణ సాగుతున్న విష‌యం తెలిసిందే. పూర్తి వివ‌రాల‌తో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల్సిందిగా ప్ర‌భుత్వాన్నికొద్ది రోజుల క్రితం ఆదేశించింది. ఈ మేర‌కు సచివాలయంలోని భవనాల కూల్చివేతపై ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. మునిసిపల్ సాలిడ్ యాక్ట్ ప్రకారం భవనాల కూల్చివేత చేపట్టామని ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని నిబంధనలు పాటించి కూల్చివేత పనులు చేపడుతున్నామని అఫిడవిట్‌లో ప్రభుత్వం పేర్కొంది. రాజకీయ దురుద్దేశంతోనే కూల్చివేత పనులకు ఆటంకం కలిగిస్తున్నారని పేర్కొంది. వాటిని ప‌రిశీలించిన హైకోర్టు సచివాలయ భవనాల కూల్చివేత ఈ నెల 15 వరకు ఆపాలని తెలంగాణ ప్రభుత్వాన్నిఆదేశించింది.

సచివాలయ భవనాల కూల్చివేత పిటిషన్ పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. భవనాల కూల్చివేత అనుమతులపై ప్రభుత్వం కౌంటర్ పిటిషన్‌ దాఖలు చేసింది. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం షీల్డ్ కవర్‌లో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈరోజు సాయంత్రం సమర్పిస్తామని అటార్ని జనరల్‌ హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌ పిటిషన్‌పై రిప్లై కౌంటర్ దాఖలు చేస్తామని పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ పేర్కొన్నారు. తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 15కు వాయిదా వేసింది.

కాగా.. ప‌ది రోజుల క్రితమే కూల్చివేతలకు హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వ‌డంతో నాలుగు రోజుల పాటు కూల్చివేత పనులు కొన‌సాగాయి. అప్ప‌టికే దాదాపు 50 శాతానికిపైగా కూల్చివేత‌లు పూర్త‌యిన‌ట్లు తెలుస్తోంది. భారీ బ్లాస్టింగ్ ల‌తో కాకుండా సాధార‌ణ ప‌ద్ధ‌తుల్లో కూల్చివేత ప‌నులు చేప‌డుతున్నారు. ఇంప్లోజ‌న్, బ్లాసింగ్ ప‌ద్ధ‌తుల వ‌ల్ల హుస్సేన్ సాగ‌ర్ క‌ట్ట‌పై ప్ర‌భావం ఉండే అవ‌కాశాలు ఉన్నాయ‌న్న నిపుణుల సూచ‌న‌ల‌తో ఈ విధంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

అలాగే… ఆన్‌లైన్‌ క్లాసులకు సంబంధించిన అంశంపై కూడా సోమ‌వారం హైకోర్టులో విచార‌ణ కొన‌సాగింది. ఆన్‌లైన్‌ క్లాసులకు అనుమతి ఇవ్వకుండా ప్రైవేటు పాఠశాలలు ఎలా నిర్వహిస్తున్నాయి. వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని హైకోర్టు ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం సీబీఎస్‌ఈ నిబంధనలు ప్రకారం కొన్ని పాఠశాలలు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నాయని ప్రభుత్వం తరపున ఏజీ హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం వాదనలు విన్న ధర్మాసనం.. వచ్చే సోమవారం ఆన్‌లైన్‌ క్లాసులపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.