Idream media
Idream media
కథ పాతదే. నీతి కొత్తది. ఏడు చేపలు తెస్తే ఒకటి ఎండలేదు. ఎందుకంటే ఎండలేదు కాబట్టి.
ఈ కథలో ఏడు చేపలు కాదు. 80 కోట్ల చేప పిల్లలు. తెలంగాణా ప్రభుత్వం అట్టహాసంగా పంపిణీ చేసింది. మత్స్యకారుల బతుకులు బాగుపడతాయని పేపర్లలో ప్రకటనలు కూడా ఇచ్చింది. చేప పిల్లల్ని చెరువులో వేశారు. 8 నెలలైంది. అవి అరకిలో కూడా పెరగలేదు. ఎందుకంటే అధికారులు మోసం చేశారని మత్స్యకారులు, వాళ్లకి చేపలు పెంచడం తెలియదని అధికారులు అంటున్నారు.
చేపాచేపా ఎందుకు పెరగలేదు అని అడిగితే
మమ్మల్ని తయారు చేసిన వాళ్లని అడగండి అని చేప పిల్ల చెప్పింది. చేపపిల్ల ఉత్పత్తిదారుల్ని అడిగితే ప్రభుత్వానికి సప్లయి చేసే వాటిలో క్వాలిటీ అడుగుతారా? ఇవ్వాల్సిన వాళ్లందరికీ ఇచ్చి మేము కూడా మిగిలించుకోవాలి కదా అన్నారు. అధికారుల్ని అడిగితే చేపల్ని పంపిణీ చేయడం వరకే మా బాధ్యత. చేపలు తిండిలేక డైటింగ్ చేస్తే మాకేం సంబంధం అంటున్నారు. మత్స్యకారులకి చేపలు పెంచడం తెలియదని కూడా అంటున్నారు. అవసరమైతే విచారణ జరిపిస్తామంటున్నారు. విచారణ పూర్తయ్యేలోగా చెరువులన్నీ అపార్ట్‌మెంట్లుగా మారినా మారిపోతాయి.
ప్రభుత్వం కొన్ని కోట్లు ఖర్చు పెట్టింది. మత్స్యకారులు దాణా కోసం కొన్ని కోట్లు పెట్టారు. చేపలు పట్టే కూలీలకి కిలోకి పది రూపాయలు, లారీ బాడుగ, ఐస్‌బాక్స్ ఖర్చులు కలిపితే కిలోకి రూ.60 అవుతుంది. మార్కెట్‌లో ఈ చేపల్ని కిలో రూ.60కే అడుగుతున్నారు. చెరువు ఉంది, చేపలు ఉన్నాయి. మత్స్యకారులకి నోట్లో ముల్లు గుచ్చుకుంది. ప్రభుత్వ పథకాలు కాగితాలపై బావుంటాయి. చేతల్లోకి వస్తే నోట్లకి బదులు చిత్తు కాగితాలు మిగులుతాయి.