గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మేయర్ పీఠాన్ని టీఆర్‌ఎస్ పార్టీ గెలుచుకుంది. మేయర్ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కుమార్తె, బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మిని టీఆర్‌ఎస్ ప్రకటించింది. డిప్యూటీ మేయర్‌గా తార్నాక డివిజన్ కార్పొరేటర్ మోతె శ్రీలత రెడ్డిని నిలబెట్టింది. బీజేపీ కూడా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది.
ఏ పార్టీకి పూర్తి బలం లేకపోవడం, టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు మేయర్ ఎన్నికలో పోటీ చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నిక ఎలా జరగబోతోంది..? ఎవరు గెలవబోతున్నారనే అంశంపై జోరుగా చర్చ జరిగింది. అత్యంత నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఎంఐఎం పార్టీ టీఆర్‌ఎస్‌కు మద్ధతు తెలిపింది. టీఆర్‌ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులకు మద్ధతుగా ఆ పార్టీ కార్పొరేటర్లతోపాటు ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు కూడా చేతులు పైకెత్తారు. దీంతో టీఆర్‌ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులు విజయం సాధించినట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు.
ఎంఐఎం మద్ధతును టీఆర్‌ఎస్ తీసుకోవడంపై బీజేపీ సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో పరస్పర ఆరోపణలు చేసుకున్న ఆ రెండు పార్టీ.. నిన్న మొన్నటి వరకూ కూడా తమ మధ్య పొత్తు ఉండబోదని చెప్పాయని బీజేపీ కార్పొరేటర్లు గుర్తు చేశారు. కానీ ఈ రోజు వారి మధ్య ఉన్న అపవిత్ర పొత్తు వెల్లడైందని కమలం పార్టీ నేతలు మండిపడ్డారు. టీఆర్‌ఎస్ తీరును ప్రజల్లో ఎండగడతామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.