iDreamPost
android-app
ios-app

మేయర్ టీఆర్ఎస్‌కేనా.. ఎలా సాధ్యం !

మేయర్ టీఆర్ఎస్‌కేనా.. ఎలా సాధ్యం !

గ్రేటర్ ఎన్నికల రాజకీయ వేడి రగులుకుంటోంది. ఇప్పటివరకూ మేయర్ స్థానంలో టీఆర్ఎస్ ఉండగా.. ఎలాగైనా ఆ సీటును దక్కించుకోవాలని బీజేపీ హోరాహోరీ పోరాడుతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ముందెన్నడులేని విధంగా.. ఎవరూ ఊహించని పద్ధతిలో రోజుకో జాతీయ నాయకుడు బీజేపీ ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర నాయకులతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఇతర రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు కూడా బల్దియా ప్రచారంలో పాల్గొంటుండటం గమనిస్తే జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఆ పార్టీ ఎంత సీరియస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రేటర్ డివిజన్ కార్పొరేటర్లలో 2/3 వ వంతు టీఆర్ఎస్ కార్పొరేటర్లే ఉన్నారు. మొత్తం 150 స్థానాల్లో 100 కార్పొరేటర్లు టీఆర్ఎస్ సిట్టింగ్‌లే.. వీరితో పాటు ఇతర 50 స్థానాల్లోనూ టీఆర్ఎస్ నుంచి అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాధారణంగా మేయర్ పీఠం దక్కాలంటే 76 మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. బీజేపీ జాతీయ నాయకత్వంతో కలిసి శక్తి మేరకు పోరాటం చేసినా ఆ పార్టీ ఏ మేరకు ఎంత కలిసొస్తుందో చూడాలి. ప్రస్తుతం నలుగురు బీజేపీ కార్పొరేటర్లు ఉండగా.. వీరి సంఖ్య 30 నుంచి 50 మధ్య ఉంటుండొచ్చని ప్రచారం సాగుతోంది. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ కార్పొరేటర్ల పనితీరు, ప్రచారం చూస్తే ఇది నమ్మసాధ్యంగా లేదు. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా.. ఓటరు చేతిలోనే తుది నిర్ణయం ఉంటుంది. ఒక వేళ అలా చూసినా బీజేపీకి 30 సీట్లు దక్కినా టీఆర్ఎస్‌ మేయర్ పీఠానికి ఢోకా లేదు. 150 వార్డుల్లో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ సగం గెలుచుకున్నా మేయర్ పీఠం దక్కించుకోవడం ఖాయమని తేలిపోతుంది. కార్పొరేటర్ల సంఖ్యతో పాటు మేయర్ పీఠాన్ని అందించడంలో మరో కీలకమైన అంశం ఎక్స్ అఫీషీయో.. పార్టీల బలాలను చూసుకున్నా టీఆర్ఎస్ చేతిలో నుంచి మేయర్ పీఠం చేజారే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది.

గ్రేటర్ ఎన్నికల ఫలితాల వరకూ ఒక భాగమైతే.. మేయర్ ఎంపిక కోసం జరిగే ఓటింగ్ కీలకమైన అంశం.. ఇప్పుడు బయటకు కనబడకపోయినా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎక్స్ అఫిషీయో సభ్యులు ప్రవేశిస్తారు. మేయర్‌గా ఎవరిని ఎన్నుకోవాలి అనే విషయంలో వీరి ఓటింగ్ కూడా కీలకంగా మారుతుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 49 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. ఇటీవల కొత్తగా నియమితులైన ముగ్గురు ఎమ్మెల్సీలను కూడా ఈ పరిధిలో చేరితే మొత్తం ఎక్స్ అఫిషియో ఓట్ల సంఖ్య 52 కు చేరుకుంటుంది. బల్దియా సాధారణ ఎన్నికల అనంతరం మేయర్ పదవి కోసం ఎన్నిక కోసం 150 కార్పొరేటర్లు, 52 ఎక్స్ అఫిషీయో సభ్యులు ఓటు వేయాల్సి ఉంటుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ 102 అవుతుంది. ఎక్స్ అఫిషియో సభ్యుల బలాబలాలు చూస్తే.. కొత్తగా వచ్చిన ముగ్గురు ఎమ్మెల్సీలతో కలిపి టీఆర్‌ఎస్‌కు 38, ఎంఐఎంకు 10 మంది, బీజేపీకి ముగ్గురు, కాంగ్రెస్‌కు ఒక ఎక్స్ అఫిషీయో సభ్యుడు ఉన్నారు. మొత్తం డివిజన్లలో సగం టీఆర్ఎస్ గెలుచుకున్నా.. ఎక్స్ అఫిషీయోలతో కలిపి ఆ పార్టీ సంఖ్య బలం 81 కి చేరుకుంటుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్‌కు సంఖ్య బలానికి కొదవలేకపోయినప్పటికీ, ఒప్పందంలో భాగంగా డిప్యూటీ మేయర్‌ను ఎంఐఎం చేతిలో ఉంది. ఆ రకంగా చూసుకున్న ఎంఐఎంకు 44 మంది కార్పొరేటర్లు, పది మంది ఎక్స్ అఫిషీయో సభ్యులు ఉన్నారు. రాజకీయ ఒప్పందంలో భాగంగా రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరిన ఎంఐఎం మద్దతు కూడా టీఆర్ఎస్‌కు లభించే సంకేతాలు ఉన్నాయి. టీఆర్ఎస్ ఎక్స్ అఫిషీయో సభ్యుల్లో పది మంది ఇప్పటికే తమ ఓటును వేరే సందర్బాల్లో ఉపయోగించుకున్నారు. వీరు మళ్లీ ఓటు వేయొచ్చా.. లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ వారు ఓటేసే అవకాశం లేకపోయినా టీఆర్ఎస్ బలం 71కి చేరుకుంటుంది. ఎంఐఎంకు సిట్టింగ్ 44 స్థానాలకు ఢోకా లేదన్న విశ్లేషణలను పరిగణలోకి తీసుకుంటే అన్ని స్థానాలను బీజీపీ గెలిచినా ఆ పార్టీ కార్పొరేటర్ల సంఖ్య 35 మాత్రమే.. ఎక్స్ అఫిషీయోలను కలుపుకున్నా 38 అవుతుంది. గ్రేటర్ పరిధిలో అత్యధిక సంఖ్య బలం ఉన్న పార్టీగా టీఆర్ఎస్ నిలవడం ఖాయం.. ఎక్స్ అఫిషీయో సభ్యులతో ఆ పార్టీ మేయర్ సీటును సునాయసంగా దక్కించుకోగలుగుతోంది.