Idream media
Idream media
ఇటీవల ముగిసిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో రేపటితో నామినేషన్ల గడువు ముగియనుండగా, ఆ ముందు రోజు సాయంత్రమే అభ్యర్థిని ప్రకటించింది అధికార పార్టీ టీఆర్ఎస్. టికెట్ కోసం పోటీ ఎక్కువ ఉండడంతో ఆచితూచి వ్యవహరించి.. టికెట్ రాకపోతే అసంతృప్తి వెళ్లగక్కే వారిని గుర్తించి సమాధాన పరిచేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుని ప్రకటన విడుదల చేసింది. దీని వల్ల పెద్దగా అసంతృప్తులు బయట పడలేదు. టికెట్ రాలేదని ఆశావాహులు ఎవరూ అధికార పార్టీపై అసహనం వ్యక్తం చేసిన దాఖలాలు లేవు. పార్టీ మారిన వారు కూడా లేరు. పైగా, పార్టీ ఇచ్చిన హామీలతో ప్రచారంలో కూడా కలిసి వచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో అచ్చంపేట, సిద్ధిపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాల్టీలతో పాటు తెలంగాణలో ఖమ్మం, వరంగల్ మహా నగర పాలక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికలకు సంబంధించి ఆదివారం నామినేషన్ల ప్రక్రియ ముగియగా, సోమవారం పరిశీలన కూడా పూర్తయింది. అయితే సిద్దిపేట మున్సిపాలిటీ మినహా ఎన్నికలు జరుగుతున్న రెండు కార్పొరేషన్లు, 4 మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్ పార్టీ అధికారికంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేయలేదు. కానీ డివిజన్లు, వార్డుల్లో టికెట్లు ఆశిస్తూ పెద్ద సంఖ్యలో ఆశావహులు పార్టీ పక్షాన నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తున్న టీఆర్‌ఎస్.. అభ్యర్థుల ప్రకటనలో ఆచి తూచి వ్యవహరించాలని భావిస్తోంది. ఈ నెల 22న ఉపసంహరణ ప్రక్రియ ముగియనుండగా, డివిజన్లు, వార్డులవారీగా ఏకాభిప్రాయ సాధన తర్వాతే చివరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటించి, బీ ఫామ్‌లు అందజేయాలని నిర్ణయించింది. ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటల వరకు బీ ఫారాలు సమర్పించేందుకు అవకాశం ఉంది. కొన్నిచోట్ల అభ్యర్థులు ఎవరనే అంశంపై ఇప్పటికే స్పష్టత ఉన్నా, పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ నామినేషన్లు వేసిన ఇతరులు ఉపసంహరించుకున్న తర్వాతే బీ ఫామ్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈలోపు అంతర్గత ప్రచారం నిర్వహించుకోవాల్సిందిగా సూచించింది.
ఓ పక్క ప్రచారం నిర్వహిస్తూనే, మరో పక్క బీ ఫామ్ ల కోసం తమ గాడ్ ఫాదర్ల చుట్టూ ఆశావాహులు తిరుగుతున్నారు. దీంతో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద జాతర వాతావరణం కనిపిస్తోంది. గ్రేటర్ వరంగల్ పరిధిలో 66 డివిజన్లు ఉండగా, ఖమ్మంలో 60 డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్ ఆశావాహులు ఇద్దరు, ముగ్గురు ఉన్నారు. దీంతో అభ్యర్థుల ఎంపికలో అధికార పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. టికెట్ ల ప్రకటించిన వెంటనే అసంతృప్తి వ్యక్తం చేసే వారిని సమాధాన పరిచేందుకు ఓ టీమ్ ను ముందుగానే సిద్ధం చేసింది. వారిని ఎలా దారికి తెచ్చుకోవాలో, ఎటువంటి హామీలు ఇవ్వాలో ప్లాన్ చేసుకోవాలని పార్టీ అధిష్ఠానం ఆ టీమ్ కు చెప్పినట్లు తెలుస్తోంది. టికెట్ల కేటాయింపులో నాగార్జునసాగర్ లో అవలంబించిన విధానం ప్రకారమే చివరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటించనుంది.
కానీ, ఆర్థిక మంత్రి హరీష్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గ కేంద్రంలో 43 వార్డులు ఉండగా, నామినేషన్ల దాఖలు గడువులోగా 18 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. సోమవారం మరో ఆరుగురు అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించారు. మిగతా వార్డుల్లోనూ ఏకాభిప్రాయం సాధించి విడతల వారీగా జాబితా విడుదల చేస్తామని ప్రకటించారు. ఖరారైన అభ్యర్థులకు గురువారం బీ ఫామ్‌లు జారీ చేస్తామని ప్రకటించారు. ఇలా ప్రతీ డివిజన్ , వార్డులోనూ ఏకాభిప్రాయం తెచ్చేందుకు ప్రత్యేక టీమ్ సన్నాహాలు చేస్తోంది. ప్రచారంలో అందరినీ కలుపుకుని వెళ్లేలా పూర్తి అభ్యర్థుల ప్రకటనకు ముందే ప్రణాళిక సిద్ధం చేసింది.