iDreamPost
android-app
ios-app

గ్రేటర్ ఫలితాల్లో కారు జోరు

గ్రేటర్ ఫలితాల్లో కారు జోరు

బల్దియా పీఠంపై ఎవరి జెండా ఎగురుతుందనే ఉంత్కంఠ సర్వత్రా నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ లో ఆధిక్యాన్ని ప్రదర్శించిన బీజేపీ అధికార టీఆర్ఎస్ కు చెక్ పెడుతుందా? అనే ఆకస్తికి కారణమైంది. కానీ… తొలిరౌండ్ ఫలితాలు వెలువడే సరికి అంచనాలు పూర్తిగా తారుమారయ్యాయి. తొలిరౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తరువాత స్థానాల్లో బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది.

గ్రేటర్ లోని 150 వార్డుల్లో 1,122 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలోని 74,67,256 ఓటర్లలో 34,50,331 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. శుక్రవారం ఉదయం 8గంటల నుంచి మొదలైన కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ఒక్కో రౌండ్ లో 14,000 ఓట్లను లెక్కిస్తున్నారు. కౌంటింగ్ లో భాగంగా తొలుత లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ మెజార్టీ ఓట్లను సొంతం చేసుకుంది. 50 డివిజన్లలో పోలైన 1926 పోస్టల్‌ ఓట్లలో 46 డివిజన్లలో బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది.

మజ్లిస్ తో మొదలైన తొలి విజయం

గ్రేటర్ ఫలితాల్లో మజ్లిస్ పార్టీ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. మెహిదీపట్నం డివిజన్‌ నుంచి ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ గెలుపును సొంతం చేసుకున్నారు. గతంలో జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని అధిరోహించిన మాజిద్ ఎంఐఎం విజయానికి బొణికొట్టారు. డబీర్ పురా, అహ్మద్ నగర్ స్థానాల్లోనూ ఎంఐఎం అభ్యర్థులు విజయాన్ని సాధించారు.

గత ఎన్నికల్లో 60 స్థానాల్లో పోటీ చేసి 44 స్థానాలు గెలుచుకున్న మజ్లిస్ ఈసారి 51 స్థానాల్లో పోటీ చేసింది. ఈ సారి కూడా 40పైగా స్థానాలు గెలుచుకుంటామన్న ధీమా ఆ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. యూసుఫ్ గూడ డివిజన్ విజయాన్ని సాధించింది తొలి ఖాతా తెరిచింది టీఆర్ఎస్. ఆ పార్టీ అభ్యర్థి రాజ్ కుమార్ పటేల్ జయకేతనం ఎగరేయగా, మెట్టుగూడలో రాసూరి సునీత విజయాన్ని దక్కించుకుంది. మరోవైపు ఏఎస్ రావు నగర్ లో కాంగ్రెస్ పార్టీ బోణికొట్టింది.

మెజార్టీ డివిజన్లలో 28వేలకు తక్కువే ఓట్లు నమోదవ్వడం వల్ల రెండో రౌండ్ ఫలితాలు వెలువడే సమయానికి గ్రేటర్ ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అత్యధికంగా ఓట్లు పోలైన ఉప్పల్, అంబర్‌పేట, కంచన్‌బాగ్, కొండాపూర్, తార్నాక, మైలార్ దేవరపల్లి, సుభాష్‌నగర్, గాజుల రామారం తదితర స్థానాల ఫలితాలు మూడో రౌండ్ లో వెలువడే అవకాశం ఉంది.

బలం పుంజుకుంటున్న బీజేపీ

గ్రేటర్ ఫలితాల్లో ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కేవలం 10 శాతం ఓట్లతో నాలుగు స్థానాలకే పరిమితమైన బీజేపీ ఈసారి అనూహ్యమైన పురోగతి సాధించినట్లు ట్రెండ్ కనిపిస్తోంది. టీఆర్ఎస్ 57 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 28 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎంఐఎం పార్టీ 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇప్పటి వరకూ గ్రేటర్ లో నామమాత్రంగా ఉన్న బీజేపీ ఈ సారి బలమైన శక్తిగా పరిణామం చెందే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా కౌంటింగ్ ట్రెండ్ మాత్రం టీఆర్ఎస్ కే అనుకూలంగా కనిపిస్తోంది. మరోమారు బల్దియాపై గులాబీ జెండా ఎగరడం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి.