టిఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పునరేకీకరణ పేరుతో అన్ని పార్టీల నేతలను టిఆర్ఎస్లో చేర్చుకోవడంతో కారు ఫుల్ అయిపోయింది. దీంతో టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది. కొత్తగా వచ్చిన నేతలకు, ముందు నుంచి పార్టీని నమ్ముకున్న నేతలకు పదవులలో సముచిత స్థానం కల్పించలేక టిఆర్ఎస్ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పటిదాకా అడ్జస్ట్ అయిన నేతలు ఎన్నికల సమయం దగ్గర పడటంతో తమ రాజకీయ భవిష్యత్తు కోసం సీట్ అయినా పదవి ఖాయం చేసుకోవాలని మెల్లిగా నిరసన రాగం ఎత్తుకుంటున్నారు. ఇప్పటిదాకా బహిరంగంగా నిరసన వ్యక్తం చేయని నేతలు ఇప్పుడు తమ బలం చూపించుకోవడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు. దీంతో టిఆర్ఎస్ పార్టీలో ఎక్కడోచోట రోజు అసమ్మతి నిరసన సెగలు బయటకి వస్తూనే ఉన్నాయి. ఒకే నియోజకవర్గంలో ఇద్దరు,ముగ్గురు నేతలు ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ పడటం లేదా జిల్లాలో పార్టీపై ఆధిపత్యం పట్టు కోసం ప్రయత్నించడంతో టిఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బయటపడుతున్నాయి.
వరంగల్ జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా తను మాట్లాడడం ఇవ్వడంలేదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పై విమర్శలు చేస్తున్నారు. స్టేషన్గన్పూర్ నియోజకవర్గం లో ఆధిపత్య పోరు కోసం కడియం శ్రీహరి వర్సెస్ రాజయ్య అన్నట్లుగా నడుస్తోంది. ఖమ్మం జిల్లాలో కందాల ఉపేందర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ తుమ్మల అనుచరులు వేదిస్తున్నాడని పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టుకోవడం వరకు వెళ్ళింది. వర్సెస్ తుమ్మల నాగేశ్వరరావు, ఇటీవల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం తన పేరు పిలవలేదని ఫ్లెక్సీలో కనీసం తన ఫోటో పెట్టలేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముందే అధికారులను నిలదీశారు పినపాక ఎమ్మెల్యే కాంతారావు. మహబూబ్ నగర్లో జూపల్లి కృష్ణారావు , మహబూబాద్ లో సీతారాం నాయక్ ,భూపాలపల్లిలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఇలా చాలామంది నాయకులు పార్టీపై అసంతృప్తితో ఉన్న సరైన సందర్భం కోసం వేచి చూస్తున్నారు. రాష్ట్రంలో బిజెపి కాంగ్రెస్ కూడా బలపడుతుండడంతో ఏ క్షణమైన పార్టీ మారేందుకు టిఆర్ఎస్ అసంతృప్త నేతలు వివిధ పార్టీల నాయకులతో చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.పార్టీలో గుర్తింపు లేని సీనియర్ నాయకులు కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : బడికి బ్రేక్.. ఏం చేయాలి..?
తుమ్మల పార్టీ మీద అసంతృప్తితో కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారని ఇందుకోసం ఇప్పటికే రేవంత్ రెడ్డితో చర్చలు కూడా జరపాలని జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. ఖమ్మం జిల్లాలో అత్యంత సీనియర్ నాయకుడు అయిన తుమ్మల నాగేశ్వరరావుకు పార్టీలో ఎటువంటి ప్రాధాన్యం లేకపోవడంతో పార్టీ మారేందుకు సిద్ధం అవుతున్నాడని టిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చర్చించుకుంటున్నారు.
వరంగల్ జిల్లాలో సీనియర్ నేత కడియం శ్రీహరికి కూడా పార్టీలో ప్రాధాన్యం లేకపోవడంతో పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు హైకమాండ్కు సంకేతాలిచ్చారు. అయితే ఇటీవల దళిత బంధు రివ్యూ కోసం కడియం శ్రీహరిని పిలవడంతో కొంత మెత్తబడ్డట్టు తెలుస్తోంది. కానీ స్టేషన్గన్పూర్ నియోజకవర్గం లో ఎమ్మెల్యే విభేదాలు తారా స్థాయికి చేరి ఫ్లెక్సీలు తగల పెట్టుకునే వరకు వచ్చాయి.
కెసిఆర్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండడంతో పాటు పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో ఇక్కడే ఉంటే రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అసంతృప్త నేతలు. అయితే ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన టిఆర్ఎస్ పార్టీ అసంతృప్తికి చెక్ పెట్టేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు నియోజకవర్గంలో అన్నిటికీ ఎమ్మెల్యే సుప్రీం అని చెప్పిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఎమ్మెల్యేను పార్టీ బాధ్యతల నుంచి తప్పించి జిల్లా పార్టీ అధ్యక్షులు నియమించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా కొంత వరకు అసంతృప్తులను బుజ్జగించడంతో పాటు పార్టీ క్యాడర్ ను బలోపేతం చేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఏదేమైనా అన్ని పార్టీల నాయకులతో నిండిపోయిన టిఆర్ఎస్ లో అందరికీ పదవులు దక్కడం కష్టమే. ఎన్నికల ముందు పార్టీలో రాజకీయ నాయకులు పార్టీలు మారడం కూడా కామనే. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉండడంతో కాంగ్రెస్ బిజెపి కూడా బలపడుతుండడంతో కేసీఆర్ అసంతృప్తులను ఎలా బుజ్జగిస్తున్నారో చూడాలి.
Also Read : చంద్రబాబుపై కామెంట్స్ : రేవంత్ రెడ్డిపై ఆ ముద్ర పోయేనా?