Idream media
Idream media
పరిస్థితులకు అనుగుణంగా ఎత్తులు వేయడం.. పదునైన వ్యాఖ్యలతో ఆకట్టుకోవడం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. రెండు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికలలోనూ, రాష్ట్రం ఆవిర్భావం అనంతరం జరిగిన మొట్టమొదటి గ్రేటర్ ఎన్నికల్లోనూ అది రుజువైంది. తన రాజకీయాల ద్వారా అంచనాలను మించి సీట్లు గెలుచుకోవడమే అందుకు నిదర్శనం. దుబ్బాక ఉప ఎన్నికలో మాత్రం ఆ పార్టీ అంచనాలు తప్పాయి. దీంతో టీఆర్ఎస్ అప్రమత్తమైంది. ప్రస్తుతం జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటి తెలంగాణలో టీఆర్ఎస్ కు ఎప్పటికీ తిరుగు ఉండదనే సంకేతాలను ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వాలనే లక్ష్యంతో వ్యూహాలు రచిస్తోంది. గెలుపే కాకుండా అంతకుమించిన లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. వంద సీట్లలో విజయం సాధించాలని యోచిస్తోంది. టికెట్ల కేటాయింపు కూడా ఆ దిశగానే ఆలోచించి గెలిచే అవకాశాలు లేని 27 మందిని పక్కన పెట్టి కొత్త వారికి చాన్స్ ఇచ్చింది.
తనయుడికి బాధ్యతలు.. తెరవెనుక సూచనలు
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు గ్రేటర్ ఎన్నికల బాధ్యతను అప్పగించిన కేసీఆర్ గెలుపు కోసం ఏం చేయాలో ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. దుబ్బాక ప్రభావం గ్రేటర్ పై పడకుండా చేపట్టాల్సిన కార్యాచరణపై ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ శ్రేణులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నేతల వ్యాఖ్యలకు ఆవేశపడకుండా ఆలోచనా ధోరణితో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కేటీఆర్ నగరంలో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ప్రతి చోటా సెంచరీ సీట్లు సాధించాలనే లక్ష్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. మరోవైపు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా తన వంతు పాత్రను పోషిస్తున్నారు. ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేకూ తమ డివిజన్ లోని అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతను కేసీఆర్ అప్పగించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకూ విశ్రమించొద్దని సూచించారు. దీంతో ఎమ్మెల్యేలందరూ అభ్యర్థుల వెంటే తిరుగుతున్నారు.
దుబ్బాక ప్రభావం గ్రేటర్‌పై పడొద్దని…
ఇటీవల జీహెచ్ఎంసి ఎన్నికలపై సీఎం కేసిఆర్ ప్రగతి భవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దుబ్బాక లో ఓటమి గురించి కూడా చర్చించినట్లు తెలిసింది. ఆ ప్రభావం గ్రేటర్‌పై పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నింటిపైనా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దుబ్బాక టీఆర్ఎస్ శ్రేణులతో కూడా కేసీఆర్ మాట్లాడారు. అందరి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకుని గ్రేటర్ లో ఆ ప్రభావం పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్ తగు సూచనలు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే తాను నిర్వహించిన సర్వే లో 104 సీట్లు సాధిస్తామని తెలిసిందని చెప్పి శ్రేణులకు భరోసా కల్పించారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 సీట్లు సాధించింది. ఈ సారి లెక్క ఎక్కువే ఉండాలి కానీ.. తక్కువ కాకూడదని సమావేశంలో తీర్మానించారు. ఈ మేరకు కేసీఆర్ కూడా త్వరలో రంగంలోకి దిగనున్నారు.