iDreamPost
android-app
ios-app

కారును ముంచేసిన వరదలు..!

కారును ముంచేసిన వరదలు..!

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఫలితాలు గతంతో పోల్చుకుంటే కారు జోరుకు కాస్త బ్రేక్‌ వేశాయి. 2016 ఎన్నికల్లో టాప్‌గేర్‌లో దూసుకెళ్లిన కారు.. 2020 ఎన్నికల ఫలితాలను చూస్తే కాస్త నెమ్మదించినట్లుగానే కనిపిస్తోంది. సెంచరీ కొడతామన్న ఆ పార్టీ నేతలు సుమారుగా అర్ధ సెంచరీతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్లుగానే ఉంది. 6.45 వరకూ వెలువడిన ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించగా.. మరో 6 స్థానాల్లో ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. వరదల ముందు కేసీఆర్‌ నిర్వహించిన సర్వేలో 94 స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలుచుకుంటుందని తేలినట్లు ఆయన ప్రకటించారు. బీజేపీకి కాస్తో కూస్తో సీట్లు పెరుగుతాయని చెప్పారు. తీరా చూస్తే కాస్తో కూస్తో కాదు.. టీఆర్‌ఎస్‌ తో సరిసమానంగా బీజేపీ సీట్లు సాధించుకుంటోంది. వరద ప్రభావిత ప్రాంతాలన్నీ దాదాపుగా బీజేపీకే జై కొట్టాయి.

పంపిణీలో పొరపాట్లే కొంపముంచాయి..

ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ సాధించుకున్న ఫలితాలను చూస్తే వరద ప్రభావిత ప్రాంతాల్లో దాదాపుగా గల్లంతైనట్లు కనిపిస్తోంది. ఎల్బీనగర్‌, మహేశ్వరం, ఉప్పల్‌ నియోజకవర్గాల్లో కారు వరదల్లో కొట్టుకుపోయిందని చెప్పొచ్చు. బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ. 10 వేలు ఆర్థిక సహాయం ప్రకటించినా పంపిణీలో పొరపాట్లు, కొందరు నేతల అవినీతి వల్లే టీఆర్‌ఎస్‌కు నష్టం వాటిల్లినట్లుగా భావించవచ్చు. ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో 11 నియోజకవర్గాలు ఉండగా.. మొత్తం అన్ని డివిజన్లలోనూ బీజేపీ అభ్యర్థులే గెలవడమే ఇందుకు నిదర్శనం. అలాగే గ్రేటర్‌ పరిధిలోకి మహేశ్వరం నియోజకవర్గంలోని 2 డివిజన్లు కూడా బీజేపీయే సొంతం చేసుకుంది. అలాగే ఉప్పల్‌ నియోజకవర్గంలోని 4 డివిజన్లలో కేవలం చిల్కానగర్‌లో మాత్రమే టీఆర్‌ఎస్‌ గెలిచింది. ఉప్పల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలవగా.. రామంతాపూర్‌, హబ్సిగూడ డివిజన్లను కూడా భారతీయ జనతా పార్టీయే సొంతం చేసుకుంది. ఇవన్నీ వరదల కారణంగా ఎక్కువగా ప్రభావంతమైన ప్రాంతాలే. ప్రభుత్వం చేసిన సహాయం అందరికీ అందకపోవడం, దాన్ని బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకోవడం కారణంగా ఆ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌కు నష్టం వాటిల్లడానికి కారణాలు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కూడా బీజేపీ సత్తా చాటింది.

టీఆర్‌ఎస్‌కు జై కొట్టిన సెటిలర్లు

సెటిలర్లు అధికంగా ఉన్న కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ అధిక స్థానాలను సాధించుకుంది. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని 8 డివిజన్లలో 7 టీఆర్‌ఎస్‌ గెలిచింది. జీడిమెట్ల డివిజన్‌లో మాత్రం బీజేపీ అభ్యర్థి చంద్రారెడ్డి గెలిచారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 10 డివిజన్లు ఉండగా.. 9 స్థానాల్లో కారు జోరు ప్రదర్శించింది. కేవలం గచ్చిబౌలిలో మాత్రం బీజేపీ అభ్యర్థి గెలిచారు. అలాగే కూకట్‌పల్లి నియోజకవర్గంలోని 8 డివిజన్లలో 7 టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. మొత్తమ్మీద గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా సెటిలర్లు టీఆర్‌ఎస్‌కే మొగ్గుచూపినట్లు కనిపిస్తోంది.