Idream media
Idream media
తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకుడిగా రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న స్వామిగౌడ్ తదనంతర పరిణామాలతో రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఉద్యమ సమయంలో తనకు అండగా నిలిచిన స్వామిగౌడ్ ను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించడమే కాకుండా ఎమ్మెల్సీ పదవి అప్పగించి శాసనమండలి చైర్మన్ చాన్స్ కూడా కేసీఆర్ ఆయనకు ఇచ్చారు. కొన్నాళ్లుగా రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్న స్వామిగౌడ్ ఇటీవల కొన్ని సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఆసక్తికర చర్చలకు తెరలేపాయి. కొద్ది రోజుల క్రితం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జరిగిన నారాయణ గురు జయంతి వేడుకల్లో పాల్గొన్న స్వామిగౌడ్ మాట్లాడుతూ కొన్ని కులాలే రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆదివారం బోయినపల్లిలో జరిగిన సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
రేవంత్ బీసీ నాయకుడా..?
విగ్రహావిష్కరణ అనంతరం స్వామిగౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన పుట్టింది రెడ్డి కులంలోనైనా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారని, బలహీన వర్గాల చేతికర్రగా మారారని స్వామి గౌడ్ అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచే వ్యక్తులకు మనం అండగా నిలవాలని, గుర్తుంచుకోవాలని సూచించారు. దీనిపై ఆయా వర్గాల్లోనే ఆసక్తి కర చర్చ కొనసాగుతోంది. ఎప్పుడూ తన రాజకీయ ప్రాబల్యం కోసమే పాటుపడే రేవంత్ రెడ్డి బీసీలకు అండగా ఏ ఉద్యమం నడిపారని వారికే తెలియాలని, బీసీ నాయకుడిగా ఎట్లా అయ్యారని అంటున్నారు. ఆయనపై బీసీ నాయకుడి ముద్ర వేయడం స్వామిగౌడ్ రాజకీయ ప్రయోజనాలున్నాయా..అనే చర్చలు కొనసాగుతున్నాయి.
స్వామిగౌడ్ కు ఏమైంది..?
ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో హాట్ టాపిక్ గామారేందుకు స్వామిగౌడ్ ప్రయత్నిస్తుండడంతో ఎందుకిలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శాసనమండలి చైర్మన్ పదవీకాలం ముగిసినప్పటి నుంచీ ఆయన రాజకీయాల్లో కానీ, టీఆర్ఎస్ పార్టీలో కానీ చురుగ్గా ఉన్నట్లు లేరు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. అనూహ్య కారణాలతో ఆయనకు టికెట్ లభించలేదు. చేవెళ్ల నుంచి లోక్ సభకు అయినా పోటీ చేయాలని భావించారు. అది కూడా కుదరలేదు. ఆ తర్వాత కార్పొరేషన్, ఎమ్మెల్సీ స్థానాలపై ఆశలు పెట్టుకున్నారు. వాటిపై కూడా ఆశలు సన్నగిల్లాయి. టీఆర్ఎస్ లో ఇక రాజకీయ భవిష్యత్ లేదని ఆయన నమ్మకానికి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన టీఆర్ఎస్ వ్యతిరేక వ్యాఖ్యలు ఎత్తుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే కేసీఆర్ కు వ్యతిరేకంగా నిలబడ్డ రేవంత్ రెడ్డికి పైకి ఎత్తి రాజకీయంగా హాట్ టాపిక్ కావాలని భావిస్తున్నట్లుగా కొందరు భావిస్తున్నారు. ఇలాగైనా కేసీఆర్ పిలిచి మాట్లాడతారేమోనన్న ఆశతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆయన వ్యూహం ఫలిస్తుందా..? రాజకీయ భవిష్యత్ ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.