గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణం చేసిన తర్వాత.. టీఆర్‌ఎస్ కార్పొరేటర్, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి కౌన్సిల్ నుంచి వెళ్లిపోయారు. మేయర్ అభ్యర్థిత్వాన్ని విజయా రెడ్డి ఆశించారు. అయితే టీఆర్‌ఎస్ అధిష్టానం తనను ఎంపిక చేయలేదనే సంకేతాల నేపథ్యంలో విజయా రెడ్డి తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. కార్పొరేటర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పాల్గొనాల్సి ఉండగా ఆమె కౌన్సిల్ నుంచి అర్థంతరంగా వెళ్లిపోవడంతో టీఆర్‌ఎస్ నేతలు ఖంగుతిన్నారు.
టీఆర్‌ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కుమార్తె, బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మీని మేయర్‌గా, మోతె శ్రీలత రెడ్డిని డిప్యూటీ మేయర్‌గా ఖరారు చేసినట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. దీంతో మేయర్ పీఠంపై ఆశలు పెట్టుకున్న ఆశానువాహులు నిరుత్సాహానికి గురయ్యారు. విజయారెడ్డితోపాటు టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు విజయశాంతి, కవితా రెడ్డి, సింధు రెడ్డి, పూజిత గౌడ్, బొంతు శ్రీలతలు మేయర్ అభ్యర్థిత్వాన్ని ఆశించారు. మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను టీఆర్‌ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఖరారు చేసి.. సీల్డ్ కవర్‌లో పంపారు.
అంతకు ముందు నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ల చేత ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. భాష ప్రతిపాదికగా ప్రమాణ స్వీకారం చేయించారు. మొదట తెలుగులో ప్రమాణం చేసే వారు తమ సీట్ల నుంచి లేచి నిలబడి ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఉర్దూ, హిందీ, చివరగా ఇంగ్లీష్‌లో ప్రమాణం చేసే వారికి అవకాశం ఇచ్చారు. ఆయా పార్టీల కార్పొరేటర్లు.. తాము ఎంపిక చేసుకున్న భాషలో అందరితో కలసి ప్రమాణ స్వీకారం చేశారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఇద్దరు కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఇరువురు కార్పొరేటర్లు వెళ్లిపోయారు.