Idream media
Idream media
తెలంగాణలో జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు, బీజేపీకి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఖమ్మం – వరంగల్ – నల్గొండ జిల్లాల స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఆయన తర్వాత రెండో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన కొనసాగుతున్నారు.
బుధవారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. నిన్న రాత్రి 8 గంటల వరకు ఓట్లను వేరు చేసిన సిబ్బంది అనంతరం కట్టలు కట్టారు. ఇప్పటి వరకు హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ జిల్లాల స్థానంలో మూడు రౌండ్ల లెక్కింపు పూర్తయింది. ఈ ఎన్నికల్లో 3, 57, 354 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడో రౌండ్ పూర్తయ్యే సరికి టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణి 35,171 ఓట్లు పొందారు. బిజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు 32,558 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 16,951 ఓట్లు లభించగా.. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నా రెడ్డికి 10,062 ఓట్లు దక్కాయి. ప్రస్తుతం నాలుగో రౌండ్ లెక్కింపు కొనసాగుతోంది.
Also Read : గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ నిలబెట్టుకున్న పిడిఎఫ్, కృష్ణా తీరంలో రెండో ప్రాధాన్యత ఓట్ల.లెక్కింపు
ఖమ్మం – వరంగల్ – నల్గొండ జిల్లాల స్థానంలో 3,86,320 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటి వరకు నాలుగు రౌండ్ల లెక్కింపు పూర్తయింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి 15,438 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పల్లా రాజేశ్వర రెడ్డికి 63,442 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 48,004 ఓట్లు వచ్చాయి. తెలంగాణ జనసమితి అభ్యర్థి ప్రొ కోదండరామ్‌కు 39,615 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 23,703 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్‌కు 15,934 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం ఐదో రౌండ్ లెక్కింపు కొనసాగుతోంది.
రెండు స్థానాల్లోనూ ఫలితాల ట్రెండ్ చూస్తుంటే మొదటి ప్రాధాన్యత ఓట్ల ద్వారా ఫలితం తేలే అవకాశం కనిపించడం లేదు. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. అదే జరిగితే ఫలితాల వెల్లడికి మరో రెండు రోజుల సమయం పట్టనుంది. మొత్తం పోలైన ఓట్లలో ఒక అభ్యర్థికి 50 శాతం కన్నా ఒక ఓటు అధికంగా వస్తే గెలిచినట్లు ప్రకటిస్తారు. లేదంటే రెండో ప్రాధాన్యతా ఓట్లు లెక్కిస్తారు. అక్కడ కూడా ఫలితం తేలకపోతే మూడో ప్రాధాన్యతా ఓట్లు లెక్కిస్తారు. ఇలా.. ఒక అభ్యర్థికి ఏదైనా ఒక ప్రాధాన్యతా ఓట్లు సగం కన్నా ఒకటి అధికంగా వచ్చే వరకూ లెక్కింపు కొనసాగుతుంది.
Also Read : హోరాహోరీ పోరులో ఎమ్మెల్సీగా కల్పలతారెడ్డి విజయం, రెండు చోట్లా టీడీపీ ఘోరపరాజయం