iDreamPost
iDreamPost
లాక్ డౌన్ టైంలో ఓటిటిలో నేరుగా విడుదలైన మలయాళం డబ్బింగ్ మూవీ ట్రాన్స్ ఒక వర్గం జనాన్ని బాగానే ఆకట్టుకుంది. దేవుడి పేరు చెప్పి పాస్టర్లు చేసే మోసాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన తీరు మెప్పించింది. ఇందులో నటించిన ఫహద్ ఫాసిల్ కు చాలా పేరు వచ్చింది. ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య ఒరిజినల్ వెర్షన్ లో నటించింది ఇతనే. చాలా విలక్షణమైన నటుడిగా గొప్ప పేరుంది. ట్రాన్స్ తర్వాత పనిగట్టుకుని ఇతని బ్లాక్ బస్టర్స్ కుంబలాంగి నైట్స్ లాంటివి చూసిన మూవీ లవర్స్ ఎందరో ఉన్నారు. ఇప్పుడితను సౌత్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే అవకాశం వచ్చినట్టు చెన్నై టాక్.
ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ కమల్ హాసన్ హీరోగా రూపొందిస్తున్న విక్రమ్ సినిమాలో ఫహాద్ నే విలన్ గా తీసుకోబోతున్నారని సమాచారం. ఇదే తరహాలో విజయ్ మాస్టర్ లో విజయ్ సేతుపతిని నెగటివ్ రోల్ కు తీసుకుని సంచలనం సృష్టించిన లోకేష్ దీనికి కూడా అదే ఫార్ములా అప్లై చేయబోతున్నట్టు కనిపిస్తోంది. విక్రమ్ కు సంబంధించి ఇంకా ఫైనల్ క్యాస్టింగ్ జరగాల్సి ఉంది. హీరోయిన్ కూడా ఫిక్స్ కాలేదు.ఒక డిఫరెంట్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందబోతున్న విక్రమ్ టీజర్ ఆ మధ్య విడుదలై మంచి స్పందన దక్కించుకుంది. క్రేజ్ కూడా భారీగా ఉంది.
ఈ ఫాహద్ ఫాసిల్ ఒకప్పటి అగ్ర దర్శకుడు ఫాజిల్ కొడుకన్న విషయం కొందరికే తెలుసు. తెలుగులోనూ ఫాజిల్ స్ట్రెయిట్ సినిమా చేశారు. నాగార్జున హీరోగా రూపొందిన కిల్లర్ కు డైరెక్టర్ ఈయనే. ఇది 1992లో విడుదలైంది. మ్యూజికల్ హిట్ గా రూపొందిన కిల్లర్ లో నాగ్ అతడు స్టైల్ లో మంచి కాంట్రాక్టు హంతకుడిగా నటించాడు. ఆ టైంలో చంటి ప్రభంజనం వల్ల ఆశించిన విజయం సాధించలేకపోయినా అభిమానులకు మాత్రం బాగా కనెక్ట్ అయ్యింది. నాన్న లాగా దర్శకుడు కాకుండా ఫహద్ నటనలో ప్రూవ్ చేసుకోవడం గమనార్హం. త్వరలోనే విక్రమ్ కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.