Idream media
Idream media
తీవ్రమైన పోటీలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని దక్కించుకున్న మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి ఐదు నెలల లోపు హుజురాబాద్ ఉప ఎన్నిక రూపంలో తొలి పరీక్ష ఎదురుకాబోతోంది. సాధారణ ఎన్నికలకు ఇంకా రెండన్నర ఏళ్లు సమయం ఉన్న నేపథ్యంలో.. ఆ ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు తగినంత సమయం ఉంది. ఈ లోపు పార్టీలో తాను బలపడడం, పార్టీ నేతలను ఏకతాటిపై నడిపించడం, టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని చాటడడం రేవంత్ రెడ్డి చేయాల్సి ఉంటుంది. ఈ పనులన్నీ సాఫీగా, విజయవంతంగా సాగాలంటే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాల్సి ఉంటుంది.
చరిత్ర నిరాశాజనం..
2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వివిధ కారణాలతో తెలంగాణలో మూడు ఉప ఎన్నికలు జరిగాయి. అన్నింటిలోనూ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. 2018లో హుజూర్‌నగర్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి 2019 లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసి గెలవడంతో శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఫలితంగా జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఉత్తమ్ సతీమణ పద్మావతి రెడ్డి పోటీ చేశారు. అయితే ఈ సీటును టీఆర్‌ఎస్ గెలుచుకుంది. సిట్టింగ్ సీటును కాంగ్రెస్ కోల్పోవాల్సి వచ్చింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మట్టికరిచింది. టీఆర్‌ఎస్ సిట్టింగ్ సీటును బీజేపీ ఎగరేసుకుపోయింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ సీటును టీఆర్‌ఎస్ నిలబెట్టుకుంది. కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది.
ఇద్దరినీ కాదని కాంగ్రెస్ మేలని ఒప్పించాలి..
మూడు ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు రాలేదు. పైగా ఒక సిట్టింగ్ సీటును కోల్పోయింది. త్వరలో జరగబోయే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీలు సర్వశక్తులు ఒడ్డుతాయి. టీఆర్‌ఎస్ మాజీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఈ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు టీఆర్‌ఎస్ తన బలాన్ని అంతా ఉపయోగిస్తుంది. బీజేపీలో చేరిన రాజేందర్.. తిరిగి హుజురాబాద్‌లో గెలిస్తేనే ఆయనకు రాజకీయ భవిష్యత్ ఉంటుంది. కాబట్టి బీజేపీ గుర్తుతో పోటీ చేసే ఈటల రాజేందర్ చావో రేవో మాదిరిగా పోరాడతారు. వీరిద్దరినీ కాదని హుజూర్‌నగర్ ప్రజలు కాంగ్రెస్‌ను ఎన్నుకునేలా రేవంత్ రెడ్డి వారిని మెప్పించాల్సి ఉంటుంది.
గెలిస్తే తిరుగులేదు.. రెండో స్థానమైనా ఎదురులేదు..
కాంగ్రెస్ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కౌషిక్ రెడ్డి బరిలో నిలిచే అవకాశం ఉంది. గత నెలలో కౌషిక్ రెడ్డి ఓ ప్రైవేటు కార్యక్రమంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలవడంతో సంచలనమైంది. ఆయన టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారనే ఊహాగానాలు వెలువడ్డాయి. వాటిని కౌషిక్ రెడ్డి తోసిపుచ్చారు. అయితే రాజేందర్ వెళ్లిపోవంతో.. ఆయన స్థానంలో బలమైన అభ్యర్థి కోసం టీఆర్‌ఎస్ వెతుకులాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కౌషిక్ రెడ్డినే కాంగ్రెస్ అభ్యర్థి అని చివరి నిమిషం వరకూ నిర్థారించుకోలేని పరిస్థితి. కౌషిక్ రెడ్డి టీఆర్‌ఎస్ కండువా కప్పుకుంటే.. అభ్యర్థి కోసం కాంగ్రెస్ వెతుకులాడాల్సి వస్తుంది. ఇన్ని సవాళ్ల మధ్య జరగబోయే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చితే రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్‌లో తిరుగే ఉండదు. గెలుపు కాకపోయినా కనీసం రెండో స్థానంలో నిలిచినా.. సాధారణ ఎన్నికల వరకు రేవంత్ పనికి ఎలాంటి ఆటంకాలు ఎదురుకాబోవు.
Also Read : ఎప్పుడు చెప్పాల్సింది.. ఎప్పుడు చెబుతున్నారు అచ్చెం నాయుడు..?