iDreamPost
android-app
ios-app

తూఫాన్ సినిమా రిపోర్ట్

  • Published Jul 16, 2021 | 5:25 AM Updated Updated Jul 16, 2021 | 5:25 AM
తూఫాన్ సినిమా రిపోర్ట్

జూలైలో డైరెక్ట్ ఓటిటి రిలీజులు అన్ని భాషల్లో గట్టిగానే ఉన్నాయి. అందులోనూ ప్రైమ్ దూకుడు మరీ జోరుగా ఉంది. ఫెస్టివల్ పేరుతో క్రేజీ మూవీస్ ని లైన్ లో పెడుతోంది. మన నారప్ప కూడా మంగళవారమే రాబోతున్న సంగతి తెలిసిందే. ఇవాళ బాలీవుడ్ మూవీ తూఫాన్ స్ట్రీమింగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా సెలెక్టివ్ గా కథలను ఎంచుకునే ఫర్హాన్ అక్తర్ హీరోగా రంగ్ దే బసంతి, భాగ్ మిల్కా భాగ్ లాంటి క్రియేటివ్ చిత్రాలు రూపొందించిన దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహరా రూపొందించిన సినిమా కావడంతో దీని మీద అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఇది మెప్పించేలా సాగిందో లేదో రిపోర్ట్ లో చూద్దాం

ముంబై డోంగ్రీ ప్రాంతంలో దందాలు చేస్తూ రౌడీగా చెలామణి అయ్యే అజీజ్ అలీ ఉరఫ్ అజ్జు భాయ్(ఫర్హాన్ అక్తర్)కు ఒక సందర్భంలో బాక్సింగ్ లో అడుగు పెట్టాల్సి వస్తుంది. ఉన్న చెడ్డ పేరును పోగొట్టుకుని గౌరవంగా బ్రతకాలంటే ఈ క్రీడ కంటే మంచి మార్గం వేరేది లేదని నిర్ణయించుకుంటాడు. ఇతని జీవితంలో ప్రవేశించిన అనన్య(మృణాల్ ఠాగూర్)ప్రోద్బలంతో మార్పు మొదలుపెడతాడు. అండగా ఆమె తండ్రి కం కోచ్ నానా ప్రభు(పరేష్ రావల్)ఉంటాడు. అయితే అనుకున్నంత సాఫీగా అజీజ్ ప్రయాణం సాగదు. ఎన్నో ఒడిదుడుకులు. ఊహించని విషాదాలు. మరి చివరికి ఇతని లక్ష్యం ఎటు వైపు వెళ్లిందో సినిమాలో చూడాలి.

స్టోరీ పరంగా ఎలాంటి కొత్తదనం లేకపోవడమే తూఫాన్ లోని ప్రధానమైన మైనస్. రొటీన్ గా మారిపోయిన బయోపిక్కుల ఫార్ములాను రాకేష్ మెహరా అరిగిపోయిన మేకింగ్ స్టైల్ లో చూపడంతో అటు డ్రామా కానీ ఇటు ఎమోషన్లు కానీ రెండూ పండక ఫైనల్ గా ఇది నిరాశపరుస్తుంది. భాగ్ మిల్కా భాగ్ లో అద్భుతంగా పండిన భావోద్వేగాలు ఇందులో కనీస స్థాయిలో లేవు. ఏదో పాతికేళ్ల క్రితం నాటి టేకింగ్ తో ప్రేక్షకులను మభ్యపెట్టాలని చూసిన ప్రయత్నం వృధా అయ్యింది. ఫర్హాన్ పడిన కష్టానికి తగిన ఫలితం దక్కేలా లేదు. దానికి తోడు 2 గంటల 40 నిమిషాల నిడివి సహనాన్ని పరీక్షించడానికి తప్ప ఎందుకూ ఉపయోగపడలేదు