iDreamPost
iDreamPost
మూవీ లవర్స్ కి కష్టమనిపించినా రాబోయేవి మాత్రం నిజంగానే బ్యాడ్ ఫ్రైడేసే. తొమ్మిది నెలల లాక్ డౌన్ తర్వాత గత ఏడాది డిసెంబర్ 25 నుంచి థియేటర్లను తెరిచాక ఇప్పటిదాకా నాన్ స్టాప్ గా ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఒక్కోసారి అయిదు నుంచి పది వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందులో ఎన్ని బాగా ఆడాయి అనేది పక్కనపెడితే దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే హాళ్ల వద్ద జనం సందడి, కలెక్షన్లు కనిపించాయి. క్రాక్ తో మొదలుపెడితే వకీల్ సాబ్ దాకా ఇది కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ భయం దానికి బ్రేకులు వేసింది.
ఈ నెల 16న విడుదల కావాల్సిన లవ్ స్టోరీ ఆల్రెడీ పోస్ట్ పోన్ చేశారు. నిన్న ఫ్రెష్ గా నాని టక్ జగదీశ్ కూడా వాయిదా వేసినట్టు నాని స్వయంగా ఓ వీడియో చేసి మరీ చెప్పేశాడు. దెబ్బకు ట్రైలర్ కూడా ఆగిపోయింది. ఆపై విరాట పర్వం, పాగల్ లు రావడం కూడా అనుమానమే అంటున్నారు. అప్పటిదాకా ఒక్క వకీల్ సాబ్ తో మాత్రమే ఫీడింగ్ జరగడం కష్టం. ఇప్పటికే అధిక శాతం సినిమా ప్రేమికులు దీన్ని చూసేశారు. మరోవైపు టికెట్ ధరల కట్టడి వల్ల కొన్ని ప్రాంతాల్లో థియేటర్ల తాత్కాలిక మూసివేతతో పాటు షోల రద్దు కూడా జరుగుతోంది. దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో అంతు చిక్కడం లేదు.
ఇవే కాదు మే కోసం ఆల్రెడీ షెడ్యూల్ చేసిన ఆచార్య, నారప్పలు కూడా తేదీలు మార్చుకోబోతున్నాయి. ఇండస్ట్రీ పెద్దలు సైతం భవిష్యత్తు మీద ఒక అంచనాకు రాలేకపోతున్నారు. వైరస్ కేసులు అంతకంతా పెరుగుతూ పోతున్నాయి. విపరీతమైన తీవ్రత లేనప్పటికీ బయట హాస్పిటల్స్ లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కు మరోసారి కొంత కాలం గడ్డు పరిస్థితి ఎదురు కాబోతోందనేది స్పష్టం. ఇప్పుడిప్పుడే చక్కగా కోలుకుంటున్న పరిశ్రమకు ఈ పరిణామాలు శరాఘాతం లాంటివి. మళ్ళీ ఓటిటి రంగం ఊపందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. చూద్దాం రాబోయే రోజుల్లో ఏమేం జరగబోతోంది