iDreamPost
android-app
ios-app

ఆనందం గుప్పెడు నిరాశ గంపెడు

  • Published Apr 01, 2021 | 8:46 AM Updated Updated Apr 01, 2021 | 8:46 AM
ఆనందం గుప్పెడు నిరాశ గంపెడు

కొత్త ఏడాదిలో మూడు నెలలు గడిచిపోయాయి. అంటే స్టూడెంట్స్ కి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చినట్టు టాలీవుడ్ కు సైతం ఒక రివ్యూలాంటిది చూసుకుంటే ఇప్పటిదాకా వచ్చిన సుమారు డెబ్బై దాకా సినిమాల్లో విజయాల శాతం చాలా తక్కువగా ఉండటం ఆందోళన కలిగించే విషయమే అయినా మిగిలిన బాషా పరిశ్రమలతో పోలిస్తే టాలీవుడ్ చాలా మెరుగ్గా ఉందన్న మాట కూడా వాస్తవం. ఎక్కడ లేనన్ని సినిమాలు ఒక్క తెలుగులోనే వచ్చాయి. లాక్ డౌన్ నిబంధనలు పూర్తిగా తీసేశాక ముందుగా కోలుకునే ప్రయత్నం చేసింది మనవాళ్లే. సగం సీటింగ్ లాంటి కండీషన్లను లెక్క చేయకుండా మరీ రిలీజులకు సిద్ధపడి జనాన్ని థియేటర్ల దాకా రప్పించారు.

ముందుగా జనవరి సంగతి చూస్తే రవితేజ క్రాక్ ఎక్కడ లేని ఎనర్జీని తీసుకొచ్చింది. సగం టికెట్లతోనూ భారీ షేర్లు కొల్లగొట్టి మాస్ మహారాజా ఈజ్ బ్యాక్ అనిపించేసింది. మాస్టర్ పెట్టుబడి లెక్కల్లో ప్రాఫిట్ వెంచర్ గా నిలవగా రెడ్ చావు తప్పి కన్నులొట్టపోయి బ్రతికిపోయింది. అల్లుడు అదుర్స్ దెబ్బకు విలవిలలాడిన బయ్యర్లు ఎందరో. అల్లరి నరేష్ బంగారు బుల్లోడుకి పరాభవం తప్పలేదు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా పాట పుణ్యమాని ఓపెనింగ్స్ తో సేఫ్ అయ్యింది. చిన్న సినిమాలు చాలా వచ్చాయి ఏవీ కనీసం వారం కూడా నిలవలేనంత దారుణంగా టపా కట్టేసి ఓటిటి బాట పట్టాయి.

ఫిబ్రవరిలో వచ్చిన వాటిలో ఉప్పెన అగ్ర సింహాసనం కొట్టేసింది. ఊహించని స్థాయిలో కలెక్షన్లు రాబట్టి ఏకంగా యాభై కోట్ల షేర్ తో రికార్డులు రాసి పెట్టింది. దీనికి ముందు వచ్చిన జాంబీరెడ్డి పర్వాలేదు అనిపించుకోగా నాందికి ప్రశంసలతో పాటు డీసెంట్ వసూళ్లు దక్కాయి. చెక్ డిజాస్టర్ అందుకుంది, ఇక మార్చి మొత్తం జాతిరత్నాలు డామినేషన్ తో బాక్సాఫీస్ ఊగిపోయింది. దెబ్బకు శ్రీకారం లాంటి డీసెంట్ టాక్ వచ్చిన సినిమా కూడా ఫ్లాప్ అవ్వాల్సి వచ్చింది. చివర్లో వచ్చిన రంగ్ దే సైతం బిజినెస్ కు తగ్గ షేర్ రాబట్టలేక యుద్ధం చేస్తోంది. చావు కబురు చల్లగా, తెల్లవారితే గురువారం. అరణ్య, మోసగాళ్లు పీడకలయ్యాయి. ఏది ఏమైనా రాబోయే నెలల్లో సక్సెస్ పర్సెంటేజ్ పెరగాల్సిన అవసరం చాలా ఉంది.