ఉద్యోగులను ఎలాగైనా కాపాడుకోవాలి. టాలెంట్‌ను పోగొట్టుకూడదు. ఇదీ కంపెనీల కొత్త మంత్రం. అందుకే ప్రోత్సహకాలిస్తారు. ఇంటి దగ్గరా? ఆఫీసుకొస్తారా? మీ ఇష్టమంటారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కోసం ట్రై చేస్తున్నారు. మధురైలోని ఐటీ కంపెనీ కాస్త ఎక్కువ ఆఫర్ చేసింది. పెళ్లికాని ఉద్యోగుల కోసం, పెళ్లి సంబంధాలు చూస్తామని ప్రకటించింది.
ఒకవేళ మంచి పెళ్లి సంబంధం కుదిరితే? కొత్త కాపురం కోసం గిఫ్ట్ గా శాలరీ హైక్ కూడా ఉంటుందంట. వినడానికి వెటకారంగా ఉన్నా, ఈ ఆఫర్ ఇచ్చింది మూకాంబికా ఇన్ఫో సొల్యూషన్స్( Mookambika Infosolutions). ఈ సంస్థలో 750 మంది ఉద్యోగులున్నారు. వస్తున్నారు, రెండుమూడేళ్లు పనిచేస్తున్నారు, అనుభవం వచ్చిన తర్వాత బైటకు చెక్కేస్తున్నారు. ఐదేళ్లు దాటి పనిచేస్తున్నవాళ్లు నలభైశాతం మంది. అందుకే కంపెనీ కొత్తగా ఆలోచించింది.
ఆరునెలలలో ఇంక్రిమెంట్. అంతేనా? పెళ్లిచేసుకొంటే మరో ఇంక్రిమెంట్.
ఉద్యోగులను నిలబెట్టుకోవడానికి ఇన్ని పాట్లా? కంపెనీ ఫౌండర్ దగ్గర సమాధానముంది. ఆయన పేరు ఎంపి సెల్వగణేష్( MP Selvaganesh). ఉద్యోగులంతా నన్ను బ్రదర్ లా చూస్తున్నారు. ఊళ్ల నుంచి వచ్చినవాళ్లు ఎక్కువ. ఇంటిదగ్గర పెద్దవాళ్లయిన తల్లితండ్రులున్నారు. వాళ్లకు మంచి పెళ్లిసంబంధం చూసేవాళ్లు లేరు. అందుకే నేనే సంబంధాలు చూస్తున్నానని అంటున్నారు.
ఇది అటు ఉద్యోగులకు, ఇటు కంపెనీకికూడా మంచిదే. కొలిగ్స్ ను పెళ్లిచేసుకొంటే ఇద్దరూ హ్యాపీ, అక్కడే చాలాకాలం పనిచేస్తారు కాబట్టి, కంపెనీకూడా హ్యాపీ. ఐడియా బాగానే ఉంది.
73963