పరుగుల తీస్తున్న ఆధునిక యుగంలో మనం ఉన్నాం..శాస్త్ర సాంకేతిక పురోభివృద్ధి పుణ్యమా అంటూ కొన్ని జీవ జాతుల మనుగడ ప్రమాదంలో పడింది. ఇప్పటికే పలు రకాల పక్షులు జంతువుల ఉనికి మనిషి పోకడల మూలంగా ప్రమాదంలో పడింది. తాజాగా పిచ్చుకల జాతి కూడా అంతరించి పోయే జాతిగా మారిపోయింది. ఇంతకుముందు ఏ పల్లెలో చూసిన పిచ్చుకలు కనబడేవి. కానీ నేడు అవి ఎక్కడో తప్ప కనిపించడం లేదు. అలా అంతరించిపోతున్న అరుదైన పిచ్చుక జాతిని రక్షించేందుకు కోసం ఒక గ్రామం మొత్తం దాదాపు 35 రోజులపాటు చీకటిలో ఉండి పోయిందంటే ఆశ్చర్యం కలగక మానదు.
వివరాల్లోకి వెళితే తమిళనాడు రాష్ట్రంలోని శివగంగై జిల్లాలో పోతకుడి గ్రామం 35 రోజులపాటు వీధి దీపాలు వేయకుండా చీకటిలో ఉన్న విషయం బయటపడింది. దానికి కారణం ఏమిటా అని ఆరా తీస్తే ఆశ్చర్యపోయే విషయం బయటకు వచ్చింది. వీధి దీపాలు ఆన్ చేసే స్విచ్ బోర్డ్ లో అరుదైన ఇండియన్ రాబిన్’’ జాతికి చెందిన పిచ్చుక గూడు ఏర్పాటు చేసుకుని గుడ్లు పెట్టింది. వీధి దీపాలు ఆన్ చేయాలి అంటే పిచ్చుక గూడు తొలగించాలి.
కాగా ఈ విషయాన్ని గమనించిన కరుపు రాజా అనే విద్యార్థి గ్రామ సర్పంచ్ కలీశ్వరికి విషయాన్ని చెప్పి అరుదైన పిచ్చుకలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పడంతో పిచ్చుక గుడ్లను పొదిగి పిల్లలు ఎగిరెవరకూ వీధి దీపాలను వెలిగించవద్దని కలీశ్వరి నిర్ణయించి గ్రామస్తులకు కూడా ఈ విషయం చెప్పడంతో వాళ్ళు కూడా వీధి దీపాలను పిచ్చుక పిల్లలు ఎగిరేవరకూ ఆన్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. పిచ్చుక పిల్లలు తయారై ఎగిరిపోయిన తర్వాత వీధి దీపాలు వెలిగించారు.
ఈ విషయాన్ని సదరు విద్యార్థి వాట్సాప్ ద్వారా వెల్లడించడంతో విషయం బయటకు వచ్చింది. పోతకుడి గ్రామస్తుల చర్యను తెలుసుకున్న పక్షి ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అరుదైన పిచ్చుక జాతి కోసం చీకటిలో ఉండడానికి సిద్ధపడిన గ్రామస్తులపై అన్ని వర్గాల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి.