వ్యవస్థల మధ్య ఘర్షణతోనే ఆ వ్యవస్థలు బలపడతాయి.వ్యవస్థల మధ్య ఘర్షణతోనే మంచి చట్టాలు రూపొందుతాయి. Yes Boss సంస్కృతి మొదటి నుంచి ఉన్న అప్పుడప్పుడు కొందరు అధికారులు వారు “నిర్వహిస్తున్న బాధ్యతల” హక్కులకోసం ప్రభుత్వాలతో మరియు కోర్టులతో చేసిన పోరాటాలలో కొన్ని సత్ఫలితాలను ఇచ్చాయి. ఈ కోవలో అగ్రగణ్యుడు T. N .శేషన్. శేషన్ వలన వ్యవస్థల్లో వొచ్చిన మార్పులు ముఖ్యంగా ఎన్నికల సంస్కరణల గురించి తెలుకోవాలి
శేషన్ కఠినమైన జోక్స్ కు ,వాఖ్యానాలకు ప్రసిద్ధి. మీ గురించి చెప్పండి అంటే పాలక్కాడ్ బ్రాహ్మణ జాతికి చెందినవాడిని. పాలక్కడ్ crooks, cooks ,civil servants and musicians కు ప్రసిద్ధి అని స్వీయ పరిచయం చేసుకునేవారు. Crooks విషయాన్ని పక్కన పెడితే పాలక్కడ్ సంబంధించి మిగిలిన మూడు విషయాలు నిజమే.మెట్రో మ్యాన్ గా ప్రసిద్ధి చెందిన శ్రీధరన్ ,శేషన్ స్కూల్లో క్లాసుమేట్స్. శేషన్ సోదరుడు కూడా ఐఏఎస్ అధికారే.
90వ దశాబ్దం మొదటి వరకు ఎన్నికలంటే గోడల నిండా పెద్ద అక్షరాలతో రాతలు,విచ్చలవిడిగా సారా, మద్యం పంపిణీ,కులం,మతం పేరుతో ఓట్ల అడగటం,ఓటర్లను వాహనాలలో తరలించటం,పోలింగ్ బూత్, ఆక్రమణలు, రిగ్గింగ్,బాంబుదాడులు…విపరీతమైన హింస జరిగేది.
ఈ పరిస్థితిని మార్చటానికి 1990లో ఎన్నికలసంఘ ప్రధాన అధికారిగా T.N .శేషన్ నడుంకట్టారు. నిబంధనావళిని తయారు చేశారు. దాన్ని విధిగా అమలు చెయ్యటానికి పరిశీలకులను నియమించారు. ఏ శాఖ ఉద్యోగి అయినా ఎన్నికల విధులలో ఎలక్షన్ కమీషన్ నిబంధనల మేర నడుచుకోవాలి,లేదంటే పనిష్మెంట్ ఇచ్చే అధికారం ఎన్నికల సంఘానికి ఉన్నదని కోర్టుద్వారా చెప్పించారు.
అభ్యర్థుల ఖర్చుకు, ప్రచార కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య మీద పరిమితి విధించారు. ప్రచారానికి వాడే మైక్,లౌడ్ స్పీకర్ లకు ముందస్తు అనుమతులు తీసుకునేలా చట్టం తెచ్చారు. రాత్రి 10 తరువాత ప్రచారం చెయ్యకుండ అభ్యర్థులను నిరోధించారు. ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించని అభ్యర్థులను కొంతకాలం పాటు ఏ ఎన్నికల్లో పోటీచేయకుండ అనర్హులుగా ప్రకటించారు. తప్పుడు ఖర్చు చూపిన వారి మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టారు.
ఈమార్పులకు మూలం శేషన్ .మరి ఇప్పుడు పరిస్థితి మెరుగుపడిందా అంటే, సమాధానము అవును. ఈ చట్టాలు,మార్పులు లేకుంటే ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఒక ఇంటర్వ్యూలో శేషన్ “నాకన్నా ముందు ఎన్నికల సంఘం -100లో ఉంటే ఇప్పుడు -25″కు వచ్చింది,
ఈ మాత్రం మార్పే నేను తీసుకురాగలిగాను అని చెప్పారు. నిజాయితీతో కూడిన సమాధానం ఎన్నికల పరిస్థితి ఇంకా మెరుగుపడటానికి గల అవకాశాన్ని సూచిస్తుంది.
శేషన్ 1955 సంవత్సరం బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి. తమిళనాడులో వివిధ హోదాల్లో పనిచేశారు. 1964-65 రోజుల్లో శేషన్ తమిళనాడు ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీగా పనిచేసేవారు. ఒక రాజకీయనాయకుడు అడిగిన పని తరువాత చేస్తాను అన్నందుకు ఉదయం 10:15కు ఆర్ధిక శాఖ డిప్యూటీ సెక్రటరీగా,10:45 కి చిన్నమొత్తాల పొదుపు సంస్థ డిప్యూటీ సెక్రటరీగా, సాయంత్రం 5 గంటలకు సంక్షేమ శాఖ డైరెక్టురుగా స్తూ ఉత్తర్వులు ఇచ్చారు.శేషన్ ఇంటికి వెళ్లిన తరువాత చీఫ్ సెక్రటరీ ఫోన్ చేసి కొత్తగా ఏర్పడిన ,అప్పటికి కలెక్టర్ ఉండటానికి బంగ్లా కూడా లేని ధర్మపురి జిల్లాకు కలెక్టర్ గా వెళ్ళమని ఆదేశాలు ఇచ్చారు.
పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుందామని ఉదయం ఆఫీసుకు వెళ్లిన శేషన్ ను చీఫ్ సెక్రటరీ నీకు (అప్పటి)రవాణ మంత్రి “ఆర్.వెంకట్రామన్” ఎలా తెలుసు? ఆయన నిన్ను రవాణా శాఖలో వెయ్యమని ఎందుకు అడుగుతున్నాడని ప్రశ్నల వర్షం కురిపించాడు. మొత్తానికి శేషన్ రవాణాశాఖలో నియమించబడ్డాడు .ఈ సంఘటన బ్యూరోక్రసి స్వభావాన్ని అర్ధం చేసుకోవటానికి ఉపయోగపడినట్లుంది. స్వయంగా బ్యూరోక్రోట్ అయ్యుండి బ్యూరోక్రసి మీద శేషన్ జోక్స్ వేస్తుంటారు.
1987 జూలై నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లిన అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ మీద శ్రీలంక నేవీకి చెందిన సైనికుడు దాడిచేసే ప్రయత్నం చేశాడు . ఈ సంఘటన తరువాత ప్రధాని భద్రత మీద ఒక సంఘం ఏర్పాటు చేసి దాని బాధ్యతను పర్యావరణ మంత్రిత్వశాఖ సెక్రెటరీగా ఉన్న శేషన్ కు అప్పగించారు. శేషన్ ఇచ్చిన రిపోర్ట్ నచ్చటంతో రాజీవ్ ఆయన్ను అంతర్గత భద్రతా సెక్రెటరీగా నియమించారు. మరి కొద్ది నెలలోనే 1988లో రక్షణ శాఖ కార్యదర్శిగా శేషన్ నియమించబడ్డాడు.
శేషన్ డిఫెన్స్ సెక్రటరీగా వ్యవహరించిన రోజుల్లో బోఫోర్స్ ఆయుధ కొనుగోలు ఆరోపణలు వచ్చాయి. వి.పి.సింగ్ కాంగ్రెసుకు రాజీనామా చేసి జనతాదళ్ ను ఏర్పాటుచేసి బోఫోర్స్ కుంభకోణం మీద పోరాటం చేశాడు. రక్షణ శాఖ కార్యదర్శి హోదాలో శేషన్ ఆయుధ కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రభుత్వ వాదనను వినిపించారు. శేషన్ మరో పది నెలలోనే కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా నియమించబడాడ్డు. రాజీవ్ ఆశీస్సులతోనే శేషన్ తక్కువ సమయంలో కీలకపదవులు పొందారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి.
1989 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయి వి.పి.సింగ్ ప్రధానమంత్రి కావటంతో శేషన్‌ను డిమోట్ చేస్తూ ఐఏఎస్ లకు దక్కే అత్యున్నత పదవి క్యాబినెట్ సెక్రెటరీ నుంచి తప్పించి ప్లానింగ్ కమీషన్ సభ్యుడిగా పంపించారు. వి.పి.సింగ్ ప్రభుత్వం కూలి చంద్రశేఖర్ ప్రధాని అయిన తరువాత అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ పేరిశాస్త్రి చనిపోవటంతో ఐఏఎస్ కాని వి.ఎస్.రమాదేవిని తాత్కాలిక ఎన్నికల కమిషనరుగా నియమించారు. చంద్రశేఖర్ ప్రభుత్వంలో సుబ్రమణ్యస్వామి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. శేషన్ కు సుబ్రమణ్యస్వామితో మంచి సంబంధాలు ఉండేవి. స్వామి సలహామేరకు చంద్రశేఖర్ శేషన్‌ను 1990లో ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించారు.
శేషన్ 1992 డిసెంబర్ నుంచి 1996 డిసెంబర్ వరకు ప్రధాన ఎన్నికల కమీషనర్ గా పనిచేశారు. అప్పటివరకు రాజకీయనాయకుల ఒత్తిళ్ల మధ్య స్వేచ్చగా పనిచేయలేక పోయిన శేషన్ స్వతంత్ర సంస్థ అయిన ఎన్నికల కమీషన్ అధికారిగా సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు.
1991 సార్వత్రిక ఎన్నికలతోపాటు పంజాబ్‌లో కూడా ఎన్నికలు నిర్వహించటానికి షెడ్యూల్ విడుదల చేశారు.ఖలిస్థాన్ పోరాటం వలన 1987 నుంచి దాదాపు ఐదు సంవత్సరాలు ఎన్నికలు జరగలేదు.చంద్రశేఖర్ పంజాబులో ఎన్నికలు జరిపితే ఖలిస్థాన్ ఉద్యమ ప్రభావం తగ్గుతుందన్న నమ్మకంతో అక్కడ ఎన్నికలు జరపాలని గట్టి ప్రయత్నాలు చేశాడు.1991 జూన్ 21 న పోలింగ్ జరగవలసి ఉండగా పదిరోజుల ముందు రైలుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 70 మందికి పైగా ప్రయాణికులు చనిపోయారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు ప్రశాంతంగా,ప్రజాసామ్యయుతంగా జరగవని పోలింగ్ మొదలు కావటానికి కొన్ని గంటల ముందు శేషన్ ఎన్నికలను వాయిదావేశారు. దానికి నిరసనగా గవర్నర్ ఓం ప్రకాశ్ మల్హోత్రా రాజీనామా చేశాడు. మల్హోత్రా మాజీ సైనిక అధికారి,ఎలాగైనా ఎన్నికలు జరపి పంజాబులో శాంతిని నెలకొల్పాలని చాలా ప్రయత్నం చేశాడు
1993లో తమిళనాడులోని రాణిపేట అనే నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత కాంగ్రెస్ నాయకులను ప్రచారానికి వెళ్లనీయటం లేదని ఎంపీలు,ఎమ్మెల్యేలు శేషన్ కు ఫిర్యాదు చేశారు. తమిళనాడు ఎన్నికల్లో కేంద్రబలగాలను ఉపయోగించాలని శేషన్ భారత హోంమంత్రికి ఆదేశాలు ఇచ్చాడు. దాని అప్పటి హోమ్ మంత్రి ఎస్.బి.చవాన్ రాష్ట్రాల మీద కేంద్ర బలగాలను రుద్దలేమని బలగాలను పంపలేదు. ప్రధాని పీవీ కూడా ఏమి తేల్చలేదు. దీనితో శేషన్ బలగాలను పంపేవరకు ఎన్నికలు నిర్వహించను అని చెప్పి సుప్రీం కోర్టుకు వెళ్ళాడు.”అధికారులు తమ పరిధి దాటొద్దు” అని పీవీ హెచ్చరించారు. చివరికి కేంద్రబలగాలను పంపటంతో ఆ వివాదం కోర్టు బయట పరిష్కారమయ్యింది.
ఓటర్ ఫోటో ఐడెంటిటీ కార్డు
1992లో ప్రతి ఓటరుకు ఫోటో ఐడెంటిటీ కార్డు ఇవ్వాలని ప్రభుత్వానికి శేషన్ చెప్పారు(ఆయన దేన్నీ కోరరు,ఆదేశాలు ఇచ్చినట్లే చెప్పేవారు). ఫోటో ఐడెంటిటీ కార్డు అవసరం లేదని,ఖర్చు వృధా అని రాజకీయపార్టీలు వాదించాయి. మీరు ఫోటో ఐడెంటిటీ కార్డు ఇవ్వకుంటే 1995 జనవరి 1 తరువాత ఎలాంటి ఎన్నికలు నిర్వహించనని శేషన్ ప్రకటించాడు,కొన్ని ఎన్నికలు వాయిదా పడ్డాయి కూడా. చివరికి సుప్రీం కోర్టు కలగ చేసుకొని ఓటు వెయ్యటం పౌరులుహక్కు అని,ఫోటో ఐడెంటిటీ కార్డు లేదని ఎన్నికలు నిరవధికంగా వాయిద వెయ్యటం సమంజసం కాదని చెప్పటంతో శేషన్ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించారు. ఆయన కృషి,పట్టుదలవలనే ప్రభుత్వం 1996లో ఫోటో ఐడెంటిటీ కార్డు ఇవ్వటం మొదలు పెట్టింది.
1994 బీహార్‌లో జరిగిన ఒక ఎన్నికలో కేంద్రమంత్రులుగా ఉన్న సీతారాం కేసరి(సోనియా గాంధీ కన్నా ముందు కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు ),కల్పనాధ్ రాయ్ లు ఓటర్లను ప్రభావితం చేశారని ,వారిని మంత్రివర్గం నుంచి తొలగించమని శేషన్ పీవీకి లేఖ రాశారు. ఆ ఉత్తరానికి పీవీ ఏమి స్పందించలేదు.1996 ఎన్నికల తరువాత సీతారాం కేసరి ఏఐసీసీ అధ్యక్షుడయ్యాడు. సోనియా రాజకీయ ప్రవేశంతో కేసరి వైభవం తగ్గింది,ఒకదశలో తానూ ప్రధానిని అవుతానని మీడియాకు చెప్పాడు.
శేషన్ దూకుడికి కళ్లెం వేయాలన్న ఉద్దేశ్యంతో అక్టోబర్ 1993లో పీవీ ఎన్నికల సంఘంలో మరో ఇద్దరు కమీషనర్లు M.S.గిల్,కృష్ణమూర్తిలను నియమించారు. శేషన్‌తో కలిపి ముగ్గురు కమీషనర్ల మెజారిటీ నిర్ణయం ప్రకారం ఎన్నికల సంఘం పనిచేయాలని చట్టం చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ శేషన్ సుప్రీం కోర్టుకు వెళ్లారు కానీ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు.
1996లో శేషన్ పదవీవిరమణ చేశారు. రిటైర్ అయిన తరువాత కూడా ఆయన అనేక ఎన్నికలలో గ్రామాలలో పర్యటించి ఓటింగ్ శాతం పెంపే లక్ష్యంగా పనిచేశారు. 1997లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో శివసేన మద్దతుతో K.R.నారాయణ్ మీద పోటీచేసి 5% ఓట్లు మాత్రమే సాధించారు. శేషన్ లాంటి వాడు రాష్ట్రపతి అయ్యుంటే రబ్బర్ స్టాంప్ ముద్ర తొలిగి రాష్ట్రపతిభవన్ క్రియాశీలకంగా పనిచేసేది.
1999 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున అద్వానీ మీద గాంధీనగర్‌లో పోటీచేసి ఓడిపోయారు. కాంగ్రెస్ శేషన్ ని రాజ్యసభకు పంపివుంటే బాగుండేది. ప్రభుత్వానికి మిగుడుపడని శేషన్ లాంటి అధికారులకు పద్మ అవార్డ్ రాకపోవటంలో ఆశ్చర్యం ఏమి లేదు.
1995లో ఏర్పాటు చేసిన “అత్యంత నిజాయితీపరుడు” అవార్డు తొలిసంవత్సరం శేషన్ కు దక్కింది. ఈ అవార్డు 1996లో మన్మోహన్ సింగ్ 1997లో వాజ్ పాయ్, 1998లో కుష్వంత్ సింగ్ కు దక్కింది. శేషన్ కు 1996లో ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసే పురస్కారం దక్కింది. గత రాత్రి శేషన్ మరణించారు. ఎన్నికల సంస్కర్తగా దేశం శేషన్‌ను గుర్తుపెట్టుకుంటుంది. రాజు కన్నా మొండివాడు బలవంతుడన్న నానుడి శేషన్ విషయంలో నూరుపాళ్లు నిజం.