iDreamPost
android-app
ios-app

బెంగాల్‌ వలసల్లో విచిత్రాలు

బెంగాల్‌ వలసల్లో విచిత్రాలు

బెంగాల్‌ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ఎంత ప్రయత్నిస్తున్నా బీజేపీ నేతలు, కార్యకర్తల వలసలను అడ్డుకోలేకపోతున్నారు. బీజేపీ నుంచి అధికార పార్టీ టీఎంసీలోకి నేతలు, అనుచరులు క్యూ కడుతూనే ఉంటున్నారు. అయితే, ఎన్నడూ లేని కొత్త సంస్కృతి, విచిత్ర పరిస్థితి ప్రస్తుతం బెంగాల్‌లో కనిపిస్తోంది. పార్టీ మారుతున్న సందర్భంగా వేస్తున్న వేషాలు, చేస్తున్న చేష్టలు విచిత్రంగా కనిపిస్తున్నాయి.

ఎవరైనా పార్టీ మారితే కండువా మారుస్తారు. మహా అయితే కొత్త పార్టీ రంగుతో కూడిన చొక్కా ధరిస్తారు. రంగులు జల్లుకుని, ర్యాలీలు తీసి, సభలు పెట్టి హడావిడి చేస్తారు. కానీ, సీఎం మమతా బెనర్జీ ఇలాకాలో ఆమె పార్టీ నేతలు కొత్త పద్ధతులకు తెరతీశారు. ఇటీవల ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన పలువురు నాయకులు, కార్యకర్తలు తిరిగి తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి ఉత్సామం చూపుతున్నారు. ముకుల్‌ రాయ్‌ లాంటి బడా నేతలు సులువుగా, గౌరవప్రదంగా పార్టీ మారుతున్నా, అనేకమంది దిగువస్థాయి నాయకులు, కార్యకర్తలు మాత్రం పలు అవమానాలను ఎదుర్కొంటున్నారు.

అధికార పార్టీ నాయకులకు తమ విధేయతను చాటుకోవడానికి నానా అగచాట్లు పడుతున్నారు.. ఇటీవల హుగ్లీలో తృణమూల్‌లో చేరడానికి సిద్ధపడిన ఆరుగురు బీజేపీ కార్యకర్తలకు గుండు గీయించారు. ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండించాల్సి వుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు స్వపన్‌ దాస్‌ గుప్తా అన్నారు. అలాగే బిర్హుం జిల్లాలో తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరుతున్న 150మంది కార్యకర్తలను శానిటైజర్‌తో పూర్తిగా శుద్ధి చేసి, చేతిలో తృణమూల్‌ జెండా పెట్టారు. వీళ్లలోంచి బీజేపీ వైరస్‌ను తొలగించడానికే అలా చేశానని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన స్థానిక తృణమూల్‌ నాయకుడు సెలవిచ్చారు.

కొద్ది రోజుల క్రితం భారీ సంఖ్యలో టీఎంసీలోకి వచ్చిన బీజేపీ కార్యకర్తలు తీసిన ర్యాలీ కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ రిక్షాలు, ఆటోల ద్వారా వారు వీధుల్లో తిరుగుతూ ‘బీజేపీలో చేరి తప్పు చేశాం.. మమ్మల్ని క్షమించండి’ అంటూ ప్రచారం చేయడం రాష్ట్రంలో కలకలం రేపింది. ఇది టీఎంసీ బెదిరింపుల వల్లేనని బీజేపీ ఆరోపిస్తే, తమకు ఆ అవసరం లేదని టీఎంసీ నేతలు సమాధానాలు ఇచ్చారు. ఇలా బెంగాల్‌ రాజకీయాలు చిత్ర, విచిత్ర పంథాలో కొనసాగుతున్నాయి.