iDreamPost
iDreamPost
ఇటీవలే జీ ప్లెక్స్ లో రాధే ద్వారా ప్రేక్షకులను నేరుగా ఇళ్లలోనే పలకరించిన కండల వీరుడు సల్మాన్ ఖాన్ దాని వల్ల ఎంత లాభ పడ్డాడనేది పక్కనపెడితే మరో డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్న మాట వాస్తవం. రేస్ 3తో పోటీ పడేలా దీనికి వచ్చిన నెగటివ్ రివ్యూస్, బ్యాడ్ రిపోర్ట్స్ ఆఖరికి ఐఎండిబిలోనూ దారుణమైన రేటింగ్ వచ్చేలా చేశాయి. తమ సినిమాకు అన్ని కోట్లు వచ్చాయి ఇన్ని మిలియన్లు వచ్చాయని ప్రొడక్షన్ హౌస్ చెప్పుకోవచ్చు కాక ఫైనల్ గా రాధే మాత్రం సల్మాన్ కెరీర్ లో అత్యంత చెత్త సినిమాల్లో ఒకటనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒకరకంగా చెప్పాలంటే ఓటిటిలో రాధేని తెచ్చి మంచి పని చేశారు. లేదంటే ట్రోలింగ్ ఇంకో లెవెల్ లో ఉండేది.
ఇక విషయాని వస్తే సల్మాన్ కొత్త సినిమా కభీ ఈద్ కభీ దీవాలిని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. టైగర్ 3 తో పాటు దీని షూటింగ్ ని కూడా సమాంతరంగా ప్లాన్ చేసుకున్నారు. అయితే లేటెస్ట్ ముంబై అప్ డేట్ ప్రకారం ఇప్పుడు ఈ పేరు కాస్తా భాయ్ జాన్ గా మారిందని సమాచారం. ఎందుకంటే వచ్చే ఏడాది రంజాన్ పండగ సందర్భంగా దీన్ని విడుదలచేయాలనుకున్నారు . అయితే ఈద్ పండక్కు దివాలి అనే పదాన్ని మిక్స్ చేస్తే లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయని భావించి మార్చుకోబోతున్నట్టు వినికిడి. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆల్మోస్ట్ లాక్ అయినట్టేనని చెప్పొచ్చు.
ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తోంది. ఈ మూవీ బాలీవుడ్ లో తనకో పెద్ద బ్రేక్ గా నిలుస్తుందన్న నమ్మకంతో ఉంది. భాయ్ జాన్ అంటే గతంలో సల్మాన్ నటించిన బ్లాక్ బస్టర్ భజరంగీ భాయ్ జాన్ లో సగం పేరు. ఇలా కూడా సెంటిమెంట్ చూస్తున్నట్టు ఉన్నారు. ఇవి కాకుండా అంతిమ్, కిక్ 2 ప్రాజెక్టులు కూడా లైన్ లో పెట్టిన సల్మాన్ ఖాన్ తన రేంజ్ కు తగ్గ సినిమా చేసి చాలా కాలం అయ్యింది. ఏదో అభిమానులు మాస్ ప్రేక్షకుల అండతో గట్టెక్కుతున్నాడు కానీ ఇది మా హీరో సినిమా అని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకునేది రావడం లేదు. అమీర్ ఖాన్ తరహాలో కథల పరంగా రిస్క్ చేయకపోవడమే దీనికి కారణం