iDreamPost
android-app
ios-app

ప్రతి కొత్త సినిమాకు మోత తప్పదు

  • Published Mar 08, 2021 | 5:16 AM Updated Updated Mar 08, 2021 | 5:16 AM
ప్రతి కొత్త సినిమాకు మోత తప్పదు

ఇకపై తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు కొత్త సినిమాలు మొదటి వారం చూసే తీరాలన్న నిబంధన పెట్టుకుంటే మాత్రం ఫ్లెక్సి ప్రైసింగ్ కు అలవాటు పడక తప్పదు. అంటే కొద్దిరోజుల పాటు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లకు టికెట్ల ధరలను పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వాలే ఇవ్వడం. దీనికి భారీ బడ్జెట్ మీడియం రేంజ్ అనే తేడాలు ఉండవు. హైప్ ఉందనిపిస్తే చాలు పెంచుకోవచ్చు. కంపల్సరీ కాదు కానీ ఎవరైనా వాడుకునే వెసులుబాటు ఉంటుంది. గత నెల ఉప్పెనకు ప్లే చేసిన ఈ స్ట్రాటజీ బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యింది. భారీ వసూళ్లకు ఇదీ ఒక కారణంగా నిలిచింది. యాభై రూపాయల పెంపు ఓపెనింగ్ ఫిగర్స్ విషయంలో చాలా ఉపయుక్తంగా నిలిచింది.

తాజాగా మహా శివరాత్రి పండగ సందర్భంగా విడుదల కాబోతున్న శర్వానంద్ శ్రీకారం కూడా ఇదే బాట పట్టబోతున్నట్టు తెలిసింది. సింగల్ స్క్రీన్లలో 150 రూపాయలు మల్టీ ప్లెక్సుల్లో 200 రూపాయల దాకా టికెట్ ధర పెంచుకునే పర్మిషన్ ఇప్పటికే వచ్చినట్టు ట్రేడ్ టాక్. ప్రసాద్ లార్జ్ స్క్రీన్ లో మొన్నే 350 రూపాయల టికెట్ ధరను పెట్టేసి అడ్వాన్స్ బుకింగ్ కూడా షురూ చేశారు. మిగిలిన స్క్రీన్లు కూడా ఈ రోజు నుంచి అప్ డేట్ అవుతున్నాయి. శ్రీకారం రైతుల సమస్యలను తీసుకుని కమర్షియల్ టచ్ జోడించిన ఓ మీడియం బడ్జెట్ సినిమా. దీనికి ఎందుకు పెంపు అనే ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టం.

ఇక్కడ ఊరట కలిగించే విషయం ఏంటంటే అదే రోజు వస్తున్న మరో మూడు సినిమాలు జాతి రత్నాలు, గాలి సంపత్, రాబర్ట్ సాధారణ ధరలతోనే అందుబాటులో ఉంటాయి. వీటికి స్టార్ సపోర్ట్ లేదు కాబట్టి అనవసరమైన రిస్క్ చేస్తే అసలుకే మోసం వచ్చి ఓపెనింగ్స్ తగ్గిపోతాయి. ఒకప్పుడు వందల కోట్ల మార్కెట్ బడ్జెట్ పెట్టే స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే అప్లై చేసిన ఈ టికెట్ ధరల పెంపు ధోరణి ఇప్పుడు శ్రీకారం లాంటి మీడియం బడ్జెట్ చిత్రాలకు కూడా వర్తింపజేయడం చూస్తే మధ్యతరగతి ఆడియన్స్ ని మొదటి వారం దూరం చేసేలాగా ఉంది. పెంచినా మిగిలిన వర్గం జనం వస్తున్నారు కదా అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేం కదా.