iDreamPost
iDreamPost
తెలుగు రాష్ట్రాల సంగతి కాసేపు పక్కనపెడితే మిగిలిన దేశమంతా థియేటర్లు తెరిచినా జనం వచ్చే పరిస్థితి అంతగా కనిపించడం లేదు. అందుకే ఎగ్జిబిటర్లు వాళ్ళను రప్పించేందుకు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. కొత్త కంటెంట్ విడుదల చేసేందుకు అధిక శాతం నిర్మాతలు ముందుకు రాకపోవడంతో పాతవాటితోనే కొంత కాలం సర్దుకోక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో సుప్రసిద్ధ యష్ రాజ్ ఫిలిమ్స్ తమ క్లాసిక్స్ ని ఎలాంటి చార్జీలు లేకుండా ఉచితంగా హాళ్లలో ప్రదర్శించేందుకు ముందుకు రావడంతో గత వారం రోజులుగా పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉందని మల్టీ ప్లెక్సుల యాజమాన్యాలు చెబుతున్నాయి.
తమ సంస్థ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సినీ ప్రేమికులకు కానుకగా కేవలం 50 రూపాయల నామ మాత్రపు మెయింటెనెన్స్ ఛార్జ్ తో టికెట్లు అమ్మే వెసులుబాటు కలిగేలా చేసింది. ఇందులో భాగంగా దిల్వాలే దుల్హనియా లేజాయేంగే, దిల్ తో పాగల్ హై, మోహబత్తె, ధూమ్ 3, మర్దానీ లాంటి ఇప్పటి జెనరేషన్ కు తెలుసున్న బ్లాక్ బస్టర్స్ తో పాటు ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ గా చెప్పుకోదగిన కబీ కభీ, సిల్సిలా, దాగ్, మషాల్ లాంటి సినిమాలు కూడా కేవలం 50 రూపాయలకే ప్రదర్శిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, కోచి, కోల్కతా తదితర నగరాల్లో వీటికి రెస్పాన్స్ బాగానే ఉంది.
ఇప్పుడీ స్ట్రాటజీని మనవాళ్ళూ అనుసరిస్తే మంచి ఫలితాలు అందుకోవచ్చు. గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్, వైజయంతి మూవీస్, ఎస్విసి లాంటి పెద్ద నిర్మాణ సంస్థలు తమ ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ ని ఇలా తక్కువ ధరతో మల్టీ ప్లెక్సుల్లో సింగల్ స్క్రీన్లలో చూసేలా చేస్తే ఖచ్చితంగా ఎంతో కొంత స్పందన ఉంటుంది. ఆడియన్స్ కూడా కొత్తగా ఫీలవుతారు. ఉదాహరణకు బొమ్మరిల్లు, ఒక్కడు, ఇంద్ర, ఆది, ఘరానా మొగుడు, బొబ్బిలిరాజా, శివలాంటి టైం లెస్ క్లాసిక్స్ ని చూసేందుకు ఆడియన్స్ వస్తారు.ఆ దిశగా ముందడుగు వేయాలి. ఎలాగూ మహా అయితే ఇంకో నెలన్నరలో కొత్త సినిమాలు వచ్చేస్తాయి కాబట్టి అప్పటిదాకా ఇది మంచి ఐడియానేగా