iDreamPost
iDreamPost
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్పష్టమైన ప్రకటనకు సన్నద్దమవుతోంది. అమరావతి భూముల విషయంలో అపోహలు తొలగించే ప్రయత్నానికి పూనుకుంటోంది. రైతుల్లో ఉన్న అనుమానాలు తీర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. ఇప్పటికే అమరావతి మెట్రోరీజియన్ డెవలప్ మెంట్ అథారిటీగా మారిన నేపథ్యంలో రాజధాని పరిధి నుంచి రెండు గ్రామాలను మినహాయించాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం ప్రారంభమయ్యింది. అందులో భాగంగా ఉండవల్లి , పెనమాక గ్రామాలను రాజధాని పరిధి నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టారు.
వాస్తవానికి రాజధాని భూముల విషయంలో ప్రధానమైన అభ్యంతరం ఉండవల్లి, పెనమాక వాసుల నుంచే ఎదురయ్యింది. పైగా ఇప్పుడా రెండు గ్రామాలు తాడేపల్లి మునిసిపాలిటీలో విలీనం అయ్యాయి. దాంతో ఇక వాటిని ఏపీఎంఆర్డీయే పరిధినుంచి తొలగించడం ఖాయమని అంతా భావిస్తున్నారు. దానిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయబోతోందని సమాచారం.
అంతేగాకుండా రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి తీసుకున్న భూములను అభివృద్ది చేసి మూడేళ్లలో అప్పగిస్తామని 2015లో చంద్రబాబు చెప్పారు. కానీ నాలుగేళ్లు పూర్తయిన తర్వాత కూడా చంద్రబాబు ప్రభుత్వం దానిని పూర్తి చేయడంలో విఫలమయ్యింది. ఇక ఏడాదిన్నరగా పాలనా వికేంద్రీకరణ అంశం తెరమీదకు రావడంతో రాజధాని భూముల అభివృద్ధి పడకేసింది. ప్రస్తుతం రైతుల ఆందోళనకు ఇదే ముఖ్య కారణం. ఈ నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం భరోసాగా ఉంటుందనే ప్రకటన చేయబోతున్నట్టు చెబుతున్నారు.
అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని, మూడేళ్ల గడువుతో మొత్తం భూములను అభివృద్ది చేసి, రైతుల వాటా ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించబోతున్నట్టు చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగా తాజా సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అందుకు తోడుగా టీడీపీ హయంలో కేటాయించిన భూములను కూడా సమీక్ష చేయబోతున్నారు. ప్రభుత్వ సంస్థలకు కేటాయింపులను మినహాయించి, ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు జరిపిన కేటాయింపులపై ఆరా తీస్తున్నారు. వాటిని పునస్సమీక్ష చేసి పలువురి కేటాయింపుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు. దాంతో ఓవైపు రైతులకు స్పష్టత, మరోవైపు భూ కేటాయింపుల విషయంలో పారదర్శకతకు ప్రభుత్తం అడుగులు వేస్తున్నట్టు చెప్పవచ్చు.