iDreamPost
android-app
ios-app

పావురాలగుట్టలో తొలిమాట… ఇడుపులపాయలో తొలిఅడుగు 

  • Published Nov 06, 2020 | 2:28 AM Updated Updated Nov 06, 2020 | 2:28 AM
పావురాలగుట్టలో తొలిమాట… ఇడుపులపాయలో తొలిఅడుగు 

సరిగ్గా మూడేళ్ళ క్రితం ఇదేరోజున ఇడుపులపాయలోని తన తండ్రి సమాధివద్ద వేసిన తొలి అడుగు వైయస్ జగన్ మోహన్ రెడ్డి జీవితాన్ని పరిపూర్ణంగా మార్చివేసింది. ఆయన జీవితంతో పాటే వేలు, లక్షలాదిమంది ప్రజల జీవితాలను కూడా మార్చివేసింది. 

తన తండ్రి తుదిశ్వాస విడిచిన చోట జగన్ చేసిన వాగ్దానం ఆయన దిశ మార్చింది. తన తండ్రి మృతితో గుండె ఆగి చనిపోయిన కుటుంబాలను పరామర్శిస్తా అని పావురాలగుట్టలో ఇచ్చిన హామీకి జగన్ కట్టుబడి నిలిచారు. రాజకీయ వత్తిళ్ళకు ఆయన తలొగ్గలేదు. ఆశచూపిన పదవులకు ఆయన లొంగలేదు. పదవుల్లో ఉన్నవారు వేసిన ఉచ్చులకు ఆయన వెనకడుగు వేయలేదు. కేసులు బనాయించి 16 నెలలు జైల్లో ఉంచినా ఆయన వెనకడుగు వేయలేదు. 

ఓ రకంగా పావురాలగుట్టలో ఇచ్చిన తొలి మాట ఆయన జీవన గమ్యాన్ని నిర్దేశిస్తే, ఇడుపులపాయలో ఆయన వేసిన తొలి అడుగు తన జీవితంతో పాటు వేలాదిమంది జీవితాలను కూడా మార్చింది. ఇడుపులపాయలో నవంబర్ 6, 2017న మొదలైన తొలిఅడుగు 341 రోజులు 3,648 కిలోమీటర్లు సాగింది. మొత్తం 175 నియోజకవర్గాల్లో 134 నియోజకవర్గాలను స్పర్శిస్తూ ఆ చారిత్రాత్మక పాదయాత్ర సాగింది. పాదయాత్రను నిర్విరామంగా కొనసాగించాలని ఆయన అనుకున్నా అదును చూసి దెబ్బవేస్తున్న ప్రత్యర్థి రాజకీయ శక్తులు అడ్డుపడి, కోర్టులకు హాజరయ్యేలా వ్యూహాలు పన్నినా ఆయన వెనుకడుగు వేయలేదు. వారంవారం కోర్టులకోసం తన పాదయాత్రలో విరామం ప్రకటిస్తూనే 341 రోజులు ప్రజలతో మమేకం అయ్యారు. 

ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకూ సాగిన చారిత్రాత్మక పాదయాత్రలో జగన్ అనేక వర్గాల ప్రజలను కలిశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, వృద్ధులు, వికలాంగులు, చేనేత కార్మికులు, కుమ్మరి, కమ్మరి, మత్స్యకారులు వంటి కులవృత్తుల వారు, రకరకాలవారు కలిశారు. తమ సమస్యలు విన్నవించుకున్నారు. ఈ సుదీర్ఘ నడకలో ఆయన అందర్నీ కలిశారు. అన్ని సమస్యలూ విన్నారు. 

విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసినప్పుడు ఫీజు రేయింబర్స్మెంట్ గురించి, వృద్ధులు, వికలాంగులు కలిసినప్పుడు పింఛన్ల గురించి, ఉపాధ్యాయులు కలిసినప్పుడు పాఠశాలల దుస్థితి గురించి, జూనియర్ వైద్యులు, నర్సులు కలిసినప్పుడు ఆస్పత్రుల స్థితిగతుల గురించి, మహిళలు కలిసినప్పుడు పొదుపు సంఘాల గురించి, మద్యం గురించి, ఆటో కార్మికులు కలిసినప్పుడు రోడ్లపై వేధింపుల గురించి, ఇలా ఒక్కరేమిటి… కలిసిన ప్రతివారూ ఓ సమస్యను చెప్పారు. చెప్పిన ప్రతి సమస్యకూ జగన్ పరిష్కారం వెతుక్కున్నారు. 

ప్రజాసంకల్ప యాత్ర ఇచ్చాపురంలో పూర్తయ్యేసరికి అన్ని వర్గాల ప్రజల సమస్యలూ జగన్ అర్ధం చేసుకున్నారు. అంతే కాదు ప్రతి సమస్య పరిష్కారానికి ఒక మార్గం అన్వేషించుకున్నారు. ప్రజలు కూడా జగన్ ను నమ్మారు. తమ సమస్యలకు తన తండ్రిలాగే స్పందించాడని అనుకున్నారు. తండ్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి లాగే మెరుగైన పాలన అందిస్తాడని ఆశించారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 151 స్థానాలు, 25 పార్లమెంటు స్థానాల్లో 22 స్థానాలు జగన్ కు ఇచ్చారు. తిరుగులేని అధికారం అది. ఎదురులేని ఆధిక్యం అది. 

జనం ఆశించినట్టే జగన్ పాలన మొదలయింది. ఫీజు రేయింబర్స్మెంట్ వచ్చింది, అంబులెన్సులు వచ్చాయి. నాడు-నేడు పథకంతో పాఠశాలలు, ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు వచ్చాయి. పింఛన్ గడప దగ్గరకే వచ్చింది. పరిపాలనా సంస్కరణలు వచ్చి అధికారులు గ్రామానికి, వార్డుకు వచ్చేశారు.

అయితే, దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండి, పరిపాలనలో పలు వ్యవస్థలపై మంచి పట్టు ఉన్న ప్రత్యర్ధులు అడుగడుగునా ప్రతివ్యూహాలతో అడ్డుపడుతున్నా చెక్కుచెదరని స్థిరచిత్తంతో ముందుకెళుతున్నారు జగన్. పావురాలగుట్ట ఆయనకొక దారి చూపించింది. ఇడుపులపాయ ఆయనకొక గమ్యం చూపించింది. ఈ యేడాదిన్నర అధికారం ప్రత్యర్థులను వదిలేసి తన ప్రజలతో ప్రజలకోసం తనపని తాను చేసుకుపోయే పద్దతి నేర్పించింది. 

మొత్తంగా పావురాలగుట్ట ధైర్యాన్ని, ఇచ్చిన మాటమీద నిలబడే తత్వాన్ని ఇచ్చింది. పాదయాత్ర ప్రజల బాగోగులు అర్ధం చేసుకుని వాటికి పరిష్కారం వెతికే వివేకం ఇచ్చింది. ఈ యేడాదిన్నర అధికారం విమర్శకులను వదిలేసి తాను అనుకున్నది చేసుకువెళ్ళే వివేకం ఇచ్చింది. ఈ యేడాదిన్నర కాలంలో ఒకటి రెండు సందర్భాల్లో మినహా రాజకీయాలు మాట్లాడకుండా, నిత్యం విమర్శించే ప్రత్యర్థుల గురించి ప్రస్తావించకుండా కేవలం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయడం అంటే అది పావురాలగుట్టలో ప్రారంభమై పాదయాత్రతో ముగిసిన ఒక ప్రస్థానం తెచ్చిన మార్పు.