ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ సంబంధిత పరిశ్రమలకోసం కాన్సెప్ట్ సిటీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఈ కాన్సెప్ట్ నగరాలుగా అనంతపురం,విశాఖపట్నం,తిరుపతిని ఎన్నుకున్నారు. తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఐటీ,ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖ పనితీరుపై జగన్ సమీక్ష నిర్వహించారు. అమెరికాలోని కొలంబియా నగరం తరహాలో ఈ మూడు కాన్సెప్ట్ నగరాలను ఐటీ ,హై ఎండ్ టెక్నాలజీకి చిరునామాగా తీర్చిదిద్దాలని అన్నారు. 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ నగరాలను ఏర్పాటు చేయాలని, కంపెనీ సామర్ధ్యం ఆధారంగా భూములు కేటాయిద్దామని అన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి వేగంగా అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని, అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శక విధానంలో కంపెనీల ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రోత్సాహక ధరల్లోనే భూములు, నీళ్లు ,విద్యుత్తును ఏర్పాటు చేస్తామని,నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా మానవ వనరులను సమకూరుస్తామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.
ఇకపై లబ్ధిదారులకు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, ఫించను, ఫీ రీయింబర్స్మెంట్ కార్డులను ముద్రించేలా బలమైన సమాచార సాంకేతిక వ్యవస్థను రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. బలమైన సమాచార సాంకేతిక వ్యవస్థతో గ్రామ వార్డు సచివాలయాలను నేరుగా కలెక్టర్ కు రాష్ట్ర సచివాలయాలకు అనుసంధానం చేయడం ద్వారా అవినీతిని నిర్మూలన చేయొచ్చని జగన్ అన్నారు. ఎవరైనా లబ్ధిదారుడు ఏదైనా పథకానికి దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తు సంబంధిత శాఖలకు వెళ్తుందా లేదా మధ్యలో ఏవైనా అభ్యంతరాలు ఉన్నాయా సంబంధిత అధికారులు ఆమోదించారా లేదా అనేది తెలిసే విధంగా కంప్యూటర్ లో చూసే విధంగా వ్యవస్థ తీసుకురావాలని
ఒకవేళ ఆ దరఖాస్తు అర్హత సాధిస్తే గ్రీన్ ఫ్లాగ్ రావాలని జగన్ తెలిపారు. దీనికి పటిష్టమైన ఐటీ సాంకేతిక వ్యవస్థ అవసరమని ముఖ్యమంత్రి జగన్ వివరించారు.
అమెరికాలోని కొలంబియా నగరం తరహాలో దేశంలో ఎక్కడా లేని విధంగా, హై ఎండ్ టెక్నాలజీకి చిరునామాగా తిరుపతి,అనంతపురం,విశాఖపట్నం దగ్గర 3 కాన్సెప్ట్ సిటీలు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఐటీ నైపుణ్య శిక్షణ నుండి అప్లికేషన్స్ తయారు చేసే కేంద్రాలతో పాటుగా, సర్వర్లు నిర్వహించే సంస్థల వరకు ఒకే చోటకు తీసుకురావడానికి ఈ కాన్సెప్ట్ సిటీల లక్ష్యం. అనేక మౌలిక వసతులు కల్పించిన కాన్సెప్ట్ సిటీల నిర్మాణం ద్వారా ఆయా కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించడం జరుగుతుంది.