iDreamPost
iDreamPost
ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఎప్పుడు పూర్తిగా సద్దుమణుగుతుందో అర్థం కావడం లేదు. కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ మొదలయ్యింది. ఇండియాలో జనజీవనం సర్వసాధారణం అయిపోయింది. ముంచుకొచ్చే ప్రమాదం పెద్దగా లేనట్టు కనిపిస్తోంది. ఆంక్షలు కొనసాగుతున్నా జనం మాత్రం పట్టించుకోకుండా ధీమాగా తిరుగుతున్నారు. ఇదిలా ఉండగా వచ్చే నెల 4 లేదా 11 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకోవడం దాదాపు ఖాయమే. 25వ తేదీ సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటరూ వస్తే కానీ పబ్లిక్ పల్స్ అర్థం కాదు. సగం కెపాసిటీతో హాళ్లు హౌస్ ఫుల్ అయితే చాలు ఎగ్జిబిటర్లు ఊపిరి పీల్చుకుంటారు. పైకి సగం సీట్లని చెప్పుకున్నా లోపల ఎక్కువ తక్కువ టికెట్లు ఇచ్చేసి మేనేజ్ చేసే అవకాశాలు లేకపోలేదు.
ఇక ఓవర్సీస్ లో మాత్రం అంతా కుదుటపడేందుకు టైం పట్టేలా ఉంది. ఒకవేళ సంక్రాంతికి పెద్ద సినిమాలను విడుదల చేసినా కొన్ని కీలక దేశాల్లో సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా యుఎస్ లో బాక్సాఫీస్ ఫలితాలు అంత అనుకూలంగా లేవు. టెనెట్ లాంటి క్రేజ్ ఉన్న మూవీనే అంతంతమాత్రంగా వసూళ్లు రాబట్టుకుంది. మరి తెలుగు సినిమాలకు అక్కడి ప్రేక్షకులు పోటెత్తుతారా అంటే అనుమానమే. ఈ నేపథ్యంలో ఇక్కడ థియేటర్లలో రిలీజ్ చేసి అక్కడ ఏటిటి(పే పర్ వ్యూ-డబ్బులు కట్టి చూడటం) మోడల్ లో వదిలితే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా మన నిర్మాతలు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఇక్కడే చాలా పెద్ద రిస్క్ ఉంది.
పైరసీ భూతం ఈ ఏటిటిని కూడా వదలదు. ఫస్ట్ ప్రీమియర్ పూర్తయిన నిమిషాలకే హెచ్డి ప్రింట్లు ఆన్ లైన్లో పెట్టేస్తున్నారు. అమెజాన్ అతి కష్టం మీద తమిళ రాకర్స్ సైట్ ని మూసేయించినా తమిళఎంవి, మూవీ రూల్జ్ లాంటివి యధాతథంగా కొనసాగుతున్నాయి. రెగ్యులర్ గా పైరసీని అందిస్తున్నాయి. ఒకవేళ క్రాక్, రెడ్, అరణ్య లాంటి క్రేజ్ ఉన్న సినిమాలను విదేశాల్లో పే పర్ వ్యూ మోడల్ లో వదిలినా ఎక్కడో ఉనికి దొరకని ప్రదేశంలో ఉండే పైరసీదారులు దాన్నిఇండియాలో కూడా డౌన్లోడ్ చేసేలా టెక్నాలజీ వాడతారు. కాబట్టి ఏ కోణంలో చూసుకున్నా ఇది రిస్క్ అవుతుంది. మరి ఈ అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది కాలమే.