iDreamPost
android-app
ios-app

వన్డే కెరీర్‌లో “సిక్స్” కొట్టని టాప్ ఫైవ్ బ్యాట్స్‌మెన్స్ వీరే

వన్డే కెరీర్‌లో “సిక్స్” కొట్టని టాప్ ఫైవ్ బ్యాట్స్‌మెన్స్ వీరే

అంతర్జాతీయ క్రికెట్‌లో నిర్ణీత ఓవర్ల వన్డేలతో పాటు,టీ-20 ప్రవేశంతో బ్యాట్స్‌మెన్‌లు ధనాధన్ షాట్‌లతో అదరగొట్టి బంతిని బౌండరీ లైన్ దాటించడమే లక్ష్యంగా విరుచుకుపడుతున్నారు. నేడు వేగవంతమైన పరుగుల వేటలో చాలా మంది బ్యాట్స్‌మెన్‌ వందకు పైగా స్ట్రైక్ రేట్‌తో తమ జట్టు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించడం ధేయ్యంగా సిక్సర్లు కొట్టడానికి ఇష్టపడతారు. కాని ఆనాటినుండి నేటి వరకు బ్యాటింగ్ టెక్నిక్‌కు ప్రాధాన్యతనిస్తూ గాలిలోకి బంతిని లేపకుండా చూడముచ్చటైన డ్రైవ్స్ ఆడడానికి ఇష్టపడే ఆటగాళ్ళు కొందరు ఉన్నారు. క్రిస్ గేల్, షాహిద్ అఫ్రిది,రోహిత్ శర్మ వంటి క్రికెటర్లు అవలీలగా సిక్సర్లు కొడతారు. కానీ లిమిటెడ్ ఓవర్ల వన్డే క్రికెట్‌లో కనీసం ఒక సిక్స్ కూడా కొట్టని బ్యాట్స్‌మెన్‌లు కొందరున్నారు. మొదటి ఐదు స్థానాలలో ఉన్న అగ్ర బ్యాట్స్‌మెన్‌లు ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ నుండి నిష్క్రమించిన మాజీ ఆటగాళ్లు కావడం విశేషం.

వన్డే కెరీర్‌లో ఒక్క సిక్స్ కూడా కొట్టని 5 మంది బ్యాట్స్‌మెన్‌ వివరాలు:

1) కల్లమ్ ఫెర్గూసన్ (2009-2016)
2009లో ఆస్ట్రేలియా తరఫున కల్లమ్ ఫెర్గూసన్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.అతను 30 వన్డే మ్యాచ్‌లు ఆడి 5 అర్ధ సెంచరీలతో 40 పైగా సగటుతో 663 పరుగులు చేశాడు.కాని.ఫెర్గూసన్ వన్డే ఇంటర్నేషనల్‌లో ఎప్పుడూ సిక్స్‌ కొట్టలేదు.తన కెరీర్‌లో కేవలం ఒకే ఒక టెస్టు ఆడిన ఫెర్గూసన్ రెండు ఇన్నింగ్స్‌లతో కలిపి నాలుగు పరుగులు మాత్రమే సాధించాడు. దీంతో అతను వన్డేలలోనే కాదు,టెస్టులలో కూడా సిక్సర్ సాధించని బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

2) జాఫ్రీ బాయ్ కాట్ (1964-1982)

ఇంగ్లీష్ మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ జాఫ్రీ బాయ్ కాట్ 36 వన్డేలు ఆడి 36.07 సగటుతో 1,082 పరుగులు చేశాడు.కాని అతని బ్యాటింగ్ స్ట్రోక్‌లు ఎప్పుడూ గాలిలో పయనించి బౌండరీ లైన్ బయట పడలేదు.తన వన్డే కెరీర్‌లో 9 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ చేశాడు. అయితే 108 టెస్ట్ మ్యాచ్‌లలో 193 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి 8 గరిష్ట స్ట్రోక్‌లు (సిక్స్) కొట్టాడు.ఇక తన టెస్ట్ కెరీర్‌లో డబుల్ సెంచరీతో కలిపి 22 శతకాలు సాధించిన జాఫ్రీ 8114 పరుగులు చేశాడు.1964లో ఆస్ట్రేలియాపై తొలి టెస్ట్ ఆడిన ఆరున్నర సంవత్సరాల తర్వాత తొలి వన్డే బరిలోకి బాయ్ కాట్ దిగడం గమనార్హం.1971 జనవరి 5న ఆసీస్‌పై తొలి వన్డే ఆడిన జాఫ్రీ 1981 డిసెంబర్ 20న తన అంతర్జాతీయ చివరి వన్డే మ్యాచ్ ఆడాడు.

3))తిలాన్ సమరవీర (1998-2011)

శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ తిలాన్ సమరవీర 53 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడి 862 పరుగులు చేశాడు.కాని అతని 42 వన్డే ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు చేసినప్పటికీ ఒక్క సిక్సర్ కూడా కొట్టలేదు.1998 నవంబర్ 6న ఇండియాపై తొలి వన్డే ఆడిన సమరవీర 2011 ఏప్రిల్ 2న తన చివరి వన్డే కూడా భారత్‌పై ఆడడం విశేషం.అయితే వన్డేలలో కనీసం ఒక సిక్స్ కూడా 4 కొట్టని సమరవీర టెస్టులలో మాత్రం 7 సిక్సర్లు బాదాడు.అతను 81 టెస్టులు ఆడి 132 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి 30 అర్థ శతకాలు,14 శతకాలతో 5462 పరుగులు సాధించాడు.

4) డియోన్ ఇబ్రహీం (2001-2005)

2001 ఏప్రిల్‌లో వన్డేలతో అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశించిన జింబాబ్వేకు చెందిన డియోన్ ఇబ్రహీం టెస్టులు,వన్డేలలో కనీసం ఒక సిక్సర్ కూడా కొట్టని మరో బ్యాట్స్‌మెన్‌. అతను 111 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడినప్పటికీ కనీసం ఒక సిక్స్ కూడా కొట్టలేదు.ఈ జింబాబ్వే మాజీ వన్డే ఓపెనర్ 29 టెస్టులు ఆడి 1,225 పరుగులు; 82 వన్డే మ్యాచ్‌లలో 1,443 పరుగులు సాధించాడు. టెస్టులలో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే ఇబ్రహీం 10అర్థసెంచరీలు, వన్డేలలో నాలుగు అర్థసెంచరీలు, ఒక సెంచరీ చేశాడు. 2005 సెప్టెంబర్‌లో భారత్‌పై తన చివరి టెస్ట్ ఆడి రిటైర్ అయ్యాడు.

5) మనోజ్ ప్రభాకర్ (1984-1996)

వందకు పైగా వన్డేలు ఆడి కూడా సిక్సర్లు సాధించని బ్యాట్స్‌మెన్‌ భారత్‌కు చెందిన మాజీ ఆల్ రౌండర్ మనోజ్ ప్రభాకర్.అతను వన్డే క్రికెట్‌లో 11 అర్ధ సెంచరీలు,రెండు సెంచరీలు సాధించినప్పటికీ సిక్స్‌ ఎప్పుడూ క్లియర్ చేయలేదు .130 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడి 98 ఇన్నింగ్స్‌లలో 1858 పరుగులు చేశాడు. అతను వన్డేలలో నేరుగా బంతిని బౌండరీ లైన్ అవతలకి పంపక పోయినప్పటికీ టెస్టులలో నాలుగు సిక్సర్లు బాదాడు. 39 టెస్టులలో 9అర్థ సెంచరీలు, ఒక సెంచరీతో 1600 పరుగులు చేశాడు.