iDreamPost
android-app
ios-app

అక్కడ జోసెఫ్ ఇక్కడ శేఖర్

  • Published Feb 04, 2021 | 5:48 AM Updated Updated Feb 04, 2021 | 5:48 AM
అక్కడ జోసెఫ్ ఇక్కడ శేఖర్

యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కల్కి తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మళ్ళీ శేఖర్ గా మేకప్ వేసుకుని రాబోతున్నారు. 2018లో మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన జోసెఫ్ రీమేక్ గా ఇది రూపొందుతోందని సమాచారం. మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లో హీరో పాత్ర రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. వయసు మీరి ఉంటుంది. ఇవాళ షూటింగ్ ప్రారంభం సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో కూడా రాజశేఖర్ అలాంటి టైపులోనే కనిపించారు కాబట్టి పెద్దగా అనుమానాలు అక్కర్లేదు. లలిత్ స్క్రీన్ ప్లే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమ్మారెడ్డి భరద్వాజ కాకుండా మరో ముగ్గురు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

గరుడవేగా సక్సెస్ అయినప్పటికీ రాజశేఖర్ గ్రాఫ్ అంత ఈజీగా సాగడం లేదు. భారీ బడ్జెట్, అంచనాలతో రూపొందిన కల్కి ఫ్లాప్ కావడం కొంచెం దెబ్బ తీసింది. అందుకే ఆ తర్వాత ఇంకే కథను ఓకే చేయలేదు. జోసెఫ్ గురించి విన్నాక అది తనకు సూటవుతుందని భావించి ఓకే చెప్పారు. ఇందులో క్యారెక్టర్ చాలా డిఫరెంట్ షేడ్స్ లో సాగుతుంది. అందులోనూ క్లైమాక్స్ ఊహించని విధంగా తీశారు. మలయాళంలో చేసిన జోజు జార్జ్ స్టార్ హీరో కాకపోవడంతో పాత్ర డిజైన్ లో రిస్క్ తీసుకున్నారు. కానీ ఇక్కడ రాజశేఖర్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి మార్పులు జరిగి ఉండే అవకాశం ఉంది.

టీమ్ ను బాగా సెట్ చేసుకున్నారు. ఈ మధ్య మంచి ఫామ్ లో ఉన్న అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తుండగా మిడిల్ రేంజ్ మూవీస్ కి మాత్రమే పరిమితమైన రైటర్ లక్ష్మి భూపాల చిరంజీవి లూసిఫర్ రీమేక్ తర్వాత పట్టేసిన పెద్ద సినిమా ఇదే. రెండూ మల్లువుడ్ రీమేక్ లే కావడం గమనార్హం. మల్లికార్జున్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఓ మర్డర్ కేసుతో మొదలై మెడికల్ కార్పొరేట్ ముసుగులో జరిగే దుర్మార్గాలను బయటికి తీసే బ్యాక్ డ్రాప్ లో ఈ శేఖర్ సాగుతుంది. మొత్తానికి గ్యాప్ ఎక్కువే తీసుకున్న రాజశేఖర్ దీంతోనైనా సాలిడ్ హిట్టు కొడతారేమో చూడాలి