Idream media
Idream media
ఈ వర్షాకాల సమావేశాలు పార్లమెంట్ చరిత్రలోనే చాలా విభిన్నంగా జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో తీవ్ర కసరత్తుల, చర్చల అనంతరం సభ నిర్వహణలో కేంద్రం పలు మార్పులు తెచ్చింది. 1951 – 52లో పార్లమెంట్ ఆమోదించిన ప్రజా ప్రాతినిధ్య చట్టాలను అనుసరించి లోక్ సభలో మార్పులు, చేర్పులు చేసే అధికారం పార్లమెంట్ కు ఉంది. కొవిడ్ విస్తరిస్తున్న వేళ ఆ అధికారంతో కీలక మార్పులు ఈసారి చోటు చేసుకున్నాయి. అందులో ప్రధానమైనది ప్రశ్నోత్తరాల సమయం లేకపోవడం. ఈసారి ప్రశ్నోత్తరాల సమయం ఉండదని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా ‘జీరో అవర్’ కూడా కేవలం అరగంట మాత్రమే ఉంటుందని పేర్కొంది. సమావేశాల్లోని ప్రతిరోజూ మొదటి గంటనే ప్రశ్నోత్తరాల సమయంగా పేర్కొంటారు. ఈ సమయంలో సభాధ్యక్షుడి పూర్వానుమతితో ప్రశ్నించే హక్కు సభ్యులకు ఉంటుంది. కానీ ఈసారి ఆ అవకాశం లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అతి ముఖ్యమైనది…
సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు మొత్తం 18 రోజులపాటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగనున్నాయి. సమావేశాలకు అతి ముఖ్యమైనది ప్రశ్నోత్తరాల సమయం. చట్టసభల సారమంతా అందులోనే కేంద్రీకృతమైవుంటుంది. దాని నిడివి రోజూ గంట మాత్రమే కావొచ్చు…కానీ అక్కడ ఈటెల్లా దూసుకొచ్చే ప్రశ్నలకు దీటుగా జవాబిచ్చినప్పుడే ప్రభుత్వం సత్తా తేలుతుంది. ఆ సమయాన్ని ఎంత చక్కగా సద్వినియోగపర్చుకున్నారన్నదే విపక్షాల పనితీరుకు గీటురాయి అవుతుంది. వివిధ మంత్రిత్వ శాఖల పనితీరుపై నిశితంగా ప్రశ్నించడం, అవసరమైన సమాచారం రాబట్టడం, సరైన జవాబులు రానిపక్షంలో నిలదీయడం…తగిన చర్యలు తీసుకునేలా వారిని ఒప్పించడం సభ్యులు చేసే పని. దానికి అనువైన జవాబులు ఇస్తూ ప్రభుత్వం తన పని తీరును చాటుకుంటూ విపక్షాలకు అడ్డుకట్ట వేస్తుంది. ప్రభుత్వం పనితీరు ఎలా వున్నదో, అందులో ఎన్ని లొసుగులు చోటుచేసుకుంటున్నాయో బట్టబయలు చేసేందుకు ఈ ప్రశ్నోత్తరాల సమయం విపక్షాలకు ఆయుధం. అందుకే దీన్ని రద్దు చేయడంతో ప్రజాస్వామ్య గొంతుకు నొక్కేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నాయి.
జీరో అవర్..
ప్రశ్నోత్తరాలు – భోజన సమయానికి మధ్య గల సమయమే.. శూన్య కాలం.. అదే జీరో అవర్. ఈ టైమ్‌లో సభాధ్యక్షుడి ఆమోదం తీసుకొని అప్పటికప్పుడు వివిధ సమస్యలపై సభ్యులు ప్రశ్నలు అడుగుతారు. మంత్రులు సమాధానం ఇస్తారు. ఇది పార్లమెంట్ ప్రక్రియలో పేర్కొనలేదు. ఈ పదాన్ని మీడియా ప్రవేశపెట్టింది. 1962 నుంచి పాటిస్తున్నారు. ఈ సమయాన్ని కూడా ప్రస్తుత సమావేశాల్లో కుదించారు. ఇక కొవిడ్ నిబంధనల మేరకు భౌతిక దూరం నిబంధనలకు అనుగుణంగా ఉభయసభల్లో సభ్యులకు సీట్లు కేటాయించనున్నారు. ఇక ఛాంబర్లు, గ్యాలరీలు సభ్యులకే సీట్లు కేటాయించనున్నారు. రాజ్యసభలో 60 మంది సభ్యులు ఛాంబర్లో, మరో 51 మంది గ్యాలరీల్లో, మిగితా 132 మంది సభ్యులు లోక్‌సభలో కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఇదే తరహాలో సీటింగ్ ఏర్పాట్లను లోక్‌సభలోనూ చేస్తున్నారు. పలు చోట్లలో భారీ తెరలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇలా మొత్తమ్మీద ఈ వర్షాకాల సమావేశాలు గతం కంటే భిన్నంగా సాగనున్నాయి. చరిత్రలో నిలిచిపోనున్నాయి. ఇదిలా ఉండగా.. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం యధావిధిగా ఉంటుందని పార్లమెంట్ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయు.