iDreamPost
android-app
ios-app

అటు సమంతా ఇటు ఆలీ

  • Published Dec 15, 2020 | 11:47 AM Updated Updated Dec 15, 2020 | 11:47 AM
అటు సమంతా ఇటు ఆలీ

ఇంటర్వ్యూ చేయడం ఒక కళ. ఇది అందరూ చేయలేరు. సెలబ్రిటీలను ప్రశ్నలు అడుగుతూ ప్రేక్షకులకు విసుగు రాకుండా షోని రన్ చేయడమంటే ఆషామాషీ కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా అంతే సంగతులు. అయితే ఇలాంటి ముఖాముఖీ కార్యక్రమాలు సక్సెస్ అవ్వడం చేసేవాళ్లతో పాటు వచ్చే వాళ్ళ పాపులారిటీ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే ఇక్కడ ఎంపిక చాలా ముఖ్యం. ఈ విషయంలో బుల్లితెరపై ఆలీ, ఓటిటిపై సమంతా తమ ప్రత్యేకతను నిలబెట్టుకునే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. ఈ కారణంగానే ఇతర ప్రోగ్రాములతో పోల్చుకుంటే వీటికి మంచి స్పందన వ్యూస్ వస్తున్నాయి.

ముందుగా ఆలీ సంగతి చూస్తే ఆలీతో సరదాగా పేరుతో జరుగుతున్న టాక్ షోకు ఇటీవలి కాలంలో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది. కారణం మాయమైపోయారకున్న సినిమా ప్రముఖులను వెతికి మరీ తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయడమే. నిరీక్షణ ఫేమ్ అర్చన, సప్తపది సినిమా జంట రవికాంత్-సబిత, ప్రాణ స్నేహితులైన సుమన్-భానుచందర్, కామెడీ జంట కోట-బాబు మోహన్ ఇలా ఒకటా రెండా ఆసాధ్యం అనుకున్న కాంబోలు ఆలీకి మాత్రమే సెట్ అవుతున్నాయి. ఎస్పి బాలసుబ్రమణ్యంతో చేసిన ఎపిసోడ్ కు మాములు రెస్పాన్స్ రాలేదు. వీటికి యుట్యూబ్ లోనూ మిలియన్ల వ్యూస్ తో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

ఇక సమంతా విషయానికి వస్తే ఆహా యాప్ కోసం ప్రత్యేకంగా సామ్ నడిపిస్తున్న ఇంటర్వ్యూ టాక్ షోలు మెల్లగా ఆదరణ పెంచుకుంటున్నాయి. ఫస్ట్ చేసిన విజయ్ దేవరకొండ ఎపిసోడ్ కు మిక్స్డ్ రిపోర్ట్ రావడంతో వెంటనే అలెర్ట్ అయిపోయిన దర్శకురాలు నందిని రెడ్డి తర్వాత ఫార్మట్ ని మార్చడం మంచి ఫలితాలను ఇస్తోంది. నాగ అశ్విన్, రానా, తమన్నా ఇలా ఒక్కొక్కరు వచ్చి సామ్ షోలో పాలు పంచుకుని సక్సెస్ లో భాగం అవుతున్నారు. చిరంజీవిది ఏదైనా స్పెషల్ డే స్ట్రీమింగ్ చేయడం కోసం ఎదురు చూస్తున్నారు. త్వరలో నాగ చైతన్యతో కూడా ఒక ఎపిసోడ్ ఉంటుందట. మొత్తానికి అక్కడ ఆలీ ఇక్కడ సామ్ ఇంటర్ వ్యూ ఎంటర్టైన్ మెంట్ తో గట్టిగానే నెట్టుకొస్తున్నారు.