iDreamPost
iDreamPost
వైరస్ కు మూల కారణంగా పేర్కొంటూ ప్రపంచమంతా దుమ్మెత్తి పోసిన చైనా ఇప్పుడు నిశ్చింతగా ఉంది. కేసులు దాదాపుగా కొలిక్కి వచ్చేశాయి. జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది. ఇటీవలే అక్కడ సినిమా థియేటర్లు కూడా తెరిచేశారు. అయితే వాటి నిర్వహణ విషయంలో అమలు చేస్తున్న నిబంధనలు మాత్రం నిర్మాతలకు టెన్షన్ పుట్టించేలా ఉన్నాయి. వాటికి మనకూ ఏం సంబంధం అనుకోకండి. అలాంటి మోడల్ నే ఇక్కడా అమలు పరిచే ఆలోచన ఎప్పటి నుంచో జరుగుతోంది కాబట్టి దాని మీద ఓ లుక్ వేయడం అవసరం. చైనాలో ఏ స్క్రీన్ అయినా సరే హాజరు శాతం 30 శాతం మించకూడదు. అంటే ప్రతి వంద సీట్లకు కేవలం ముప్పై ప్రేక్షకులనే అనుమతించాలి.
రోజు నాలుగైదు షోలు వేస్తామంటే కుదరదు. రెండు లేదా మహా అయితే మూడు అంతే. ప్రతి షోకు మధ్య కనీసం గంట గ్యాప్ ఇచ్చి శానిటైజేషన్ చేయించాలి. అదంతా వీడియో రూపంలో తీయించి ప్రభుత్వం కోరినప్పుడు అందజేయాలి. ఎలాంటి ఆహార పానీయాలు థియేటర్ ప్రాంగణంలో అమ్మరాదు. ప్రేక్షకులు తమ ఇంటి నుంచి తెచ్చుకోవచ్చు. హాల్ లోకి అడుగు పెట్టే ప్రతి ప్రేక్షకుడికి థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి. అతి దగ్గరలో ఒక డాక్టర్ అందుబాటులో ఉండాలి. వాష్ రూమ్ నిర్వహణ చాలా కఠినంగా సాగాలి. సిబ్బందికి రెగ్యులర్ గా టెస్టులు చేయించాలి. చూశారుగా ఎన్నేసి ఉన్నాయో. ఇక్కడ ముఖ్యమైనవి మాత్రమే చెప్పడం జరిగింది. ఇక్కడా అలాగే చేస్తారని కాదు కానీ కొంతకాలం ఇంచుమించు ఇదే పద్ధతిని మనమూ ఫాలో కాక తప్పని పరిస్థితి రావొచ్చు.
అయితే కొత్త సినిమాలకు ఈ రకమైన కండిషన్లతో రెవిన్యూ రావడం కష్టం. ప్రేక్షకులు వస్తారు కానీ హౌస్ ఫుల్ అయ్యే ఛాన్స్ ఉండదు కాబట్టి రాబడి బాగా తగ్గిపోతుంది. మనదగ్గర 60 శాతం అనుమతిచ్చినా మరో 40 శాతం నష్టపోవాల్సి ఉంటుంది. చిన్న బడ్జెట్ సినిమాలకు ఇదేమంత సమస్య కాదు కానీ పాతిక కోట్ల దాకా మార్కెట్ ఉన్న హీరోల నిర్మాతలకు మాత్రం పెను సవాలే. అందుకే మన ప్రభుత్వాలు థియేటర్ల విషయంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేకపోతున్నాయి. కేసులు దేశవ్యాప్తంగా ఎక్కడా తగ్గడం లేదు. అంతగా ప్రభావం లేని చోట తెరిచీ లాభం లేదు. పివిఆర్ ఇటీవలే తాము తీసుకోబోయే జగ్రత్తల గురించి ఓ వీడియో రిలీజ్ చేసింది. అయినా కూడా కేంద్రం నుంచి నో రెస్పాన్స్. మరోవైపు అన్ని బాషల్లోనూ నిర్మాతలు తమ సినిమాలను థియేటర్లలో వదలడం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. దీనికి ఎప్పుడు తెరపడుతుందో ఎవరూ చెప్పలేని నిస్సహాయ స్థితి ఇది.