iDreamPost
iDreamPost
ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఎల్లుండి నుంచి థియేటర్లు తెరవబోతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఆ సూచనలు కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి ఎగ్జిబిటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్త కంటెంట్ సిద్ధంగా లేదు. పండగ టైంలో ఆడి వెళ్ళిపోయిన వాటిని కరోనా నిబంధనల ఖర్చు అదనంగా భరించి వేసుకుంటే వచ్చే సొమ్ముల కన్నా మూసి ఉంచితే మిగిలే డబ్బులే ఎక్కువ. అందుకే సింగల్ స్క్రీన్లు ఈ డేట్ పట్ల అంత సుముఖంగా లేవు. ఇప్పటికే కొన్ని జిల్లాల డిస్ట్రిబ్యూటర్లు దీపావళి నుంచి ఓపెన్ చేద్దామని నిర్ణయించుకుని ఆ మేరకు ప్రకటనలు కూడా ఇచ్చేశారు. సో వెండితెర వినోదం కొన్ని మల్టీప్లెక్సులకు మినహా మిగిలినవాటిలో వచ్చే అవకాశాలు లేనట్టే.
ఇన్ని రోజులు థియేటర్లు తెరవలేదే అని బాధపడిన మూవీ లవర్స్ కు ఇప్పుడు ఎందుకు తెరవరో అర్థమయ్యాక అయోమయంలో పడ్డారు. ఈ శనివారం నిర్మాతల సమాఖ్య ఓ కీలకమైన సమావేశం జరపబోతోంది. అందులో ఎప్పుడు ఎవరి సినిమాలు ముందుగా విడుదల కావాలనే కొన్ని కీలకమైన అంశాల మీద నిర్ణయాలు తీసుకోబోతున్నారని ఫిలిం నగర్ టాక్. అది అయ్యాక ప్రెస్ కు అధికారికంగా కొంత సమాచారం రావొచ్చు. కనిష్టంగా ఇంకో నెల రోజుల దాకా ఇదే పరిస్థితి కొనసాగక తప్పేలా లేదు. ఆన్ లైన్ బుకింగ్స్ కూడా ఏ యాప్ లోనూ ఇంకా ప్రారంభించలేదు. సోషల్ మీడియాలో మాత్రం అక్టోబర్ 15 నుంచని పివిఆర్, కార్నివాల్ తదితర సంస్థలు అప్పుడే ప్రమోషన్ కూడా మొదలుపెట్టాయి.
ఇప్పటికే ఏడు నెలల కాలం హారతి కర్పూరమైపోయిన నేపథ్యంలో ఈ పరిణామాలు ఇంకా సాగదీసుకోవడం విచారకరమే. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టుగా తెరుచుకోండి అని చెబుతున్నా కూడా ధైర్యంగా ముందడుగు వేయలేని దైన్య స్థితి నెలకొంది. బాలీవుడ్ కూడా డిసెంబర్ నుంచే పెద్ద సినిమా రిలీజులు ప్లాన్ చేసుకుంటోంది. అంతకు ముందు ఒకటి రెండు బడ్జెట్ మూవీస్ తప్ప స్టార్లు ఉన్నవి వచ్చే ఛాన్స్ లేనట్టే. మరోవైపు ఓటిటి లో విడుదలైన సినిమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ మల్టీ ప్లెక్సుల్లో వేసే సమస్యే లేదని కొన్ని సంస్థలు ఇప్పటికే అల్టిమేటం ఇచ్చినట్టుగా సమాచారం. చూస్తుంటే థియేటర్లు తెరుచుకుని వాటి తాలూకు ఫోటోలు బయటికి వస్తే కానీ ఏదీ నమ్మలేని వింత పరిష్టితి నెలకొంది