iDreamPost
android-app
ios-app

థియేటర్ల భవిష్యత్తు ముంబై చేతిలో

  • Published May 30, 2020 | 7:22 AM Updated Updated May 30, 2020 | 7:22 AM
థియేటర్ల భవిష్యత్తు ముంబై చేతిలో

ఇంకో వారం పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో షూటింగులు మొదలుకాబోతున్నాయి. థియేటర్లు తెరుచుకోవడం పట్ల మాత్రం ప్రభుత్వాలకు సైతం స్పష్టత లేదు. అది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని ఇటీవలే చూచాయగా కొందరు మంత్రులు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే దీనికి ముంబైకి లింక్ ఏమిటని ఆశ్చర్యపోతున్నారా. అక్కడే ఉంది కిటుకు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒకేసారి సినిమా హాళ్ళకు అనుమతి ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. అయితే ముంబై కేంద్రంగా కరోనా వైరస్ విజృంభణ తీవ్రంగా ఉంది. బాలీవుడ్ కు సంబంధించి ముంబై కీలకమైన వాణిజ్య నగరం. సినిమాలకు సంబంధించిన లావాదేవీలు, వ్యాపారాలు, రెవిన్యూ అంతా అక్కడి నుంచే వస్తుంది.

ఢిల్లీ రాజధానిగా పేరే కానీ మొత్తం బాలీవుడ్ ముంబైలోనే కొలువు తీరి ఉంది. ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవాలంటే హిందీ సినిమాలకు లైన్ క్లియర్ కావాలి. ముంబైని కాదని రిలీజ్ చేసే ఛాన్స్ లేదు. అదే జరిగితే ఎంత లేదన్నా 20 శాతం దాకా ఆదాయం కోల్పోవాలి. వందల కోట్ల పెట్టుబడులు పెట్టిన భారీ ప్రాజెక్టులకు ఇది చిన్న మొత్తం కాదు. సో ముంబైలో పరిస్థితి సద్దుమణిగితేనే థియేటర్ల తలుపులు తెరుచుకోవడం గురించి ఆలోచించవద్దు . ఇది ముందు గానే గుర్తించే అమితాబ్ బచ్చన్ – ఆయుష్మాన్ ఖురానా నటించిన గులాబో సితాబోని డైరెక్ట్ గా ఓటిటి రిలీజ్ చేస్తున్నారు. మరికొన్ని కూడా ఇదే బాటలో ఉన్నాయి. అక్షయ్ కుమార్ లక్స్మీ బాంబ్ కూడా ఇదే తరహాలో రావొచ్చని ఇప్పటికే టాక్ ఉంది.

తెలుగు సినిమాలకు ముంబై మార్కెట్ అంత ముఖ్యం కాదు కాని ఓవర్సీస్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అక్కడా పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. డిస్ట్రిబ్యూటర్లు గతంలోలా గుడ్డిగా పెట్టుబడులు పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఇదంతా ఒకదానికి మరొకటి ముడిపడిన వ్యవహారం. కొన్ని ప్రాంతాలు లేదా రాష్ట్రాలు మినహాయించి థియేటర్లు తెరుచుకోవడానికి పర్మిషన్ ఇచ్చినా ఉపయోగం ఉండదు. పోనీ కొన్నిరోజులు పాత సినిమాలతో ఫీడింగ్ ఇచ్చి నడుపుదామా అంటే జనం వచ్చేంత సీన్ అసలే ఉండదు. సో కరోనా దాదాపుగా ఇండియా వైడ్ జీరో అయితే తప్ప థియేటర్ల గేట్ల మీద ఆశలు పెట్టుకోవడానికి లేదు. ఈలోగా ఎన్ని ఓటిటి బాంబులు పేలుతాయో చూడాలి మరి. అందుకే ఆచితూచి వ్యవహరిస్తున్న నిర్మాతలు సైతం భవిష్యత్తుని అంచనా వేయలేక సతమతమవుతున్నారు.