iDreamPost
android-app
ios-app

త్రిశంకు స్వర్గంలో సినిమా థియేటర్లు

  • Published Oct 08, 2020 | 11:01 AM Updated Updated Oct 08, 2020 | 11:01 AM
త్రిశంకు స్వర్గంలో సినిమా థియేటర్లు

అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరవబోతున్నారని చెప్పుకోవడానికైతే బాగుంది కానీ నిజానికి గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో ప్రధాన సినిమా హాళ్లు, మల్టీ ప్లెక్సులు తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాయి కానీ చాలా చోట్ల సింగల్ స్క్రీన్లు మాత్రం తీయాలా వద్దా అనే అయోమయంలో కొనసాగుతున్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో పంపిణీదారులు. ఎగ్జిబిటర్లు కలిసి నవంబర్ లో వచ్చే దీపావళి దాకా థియేటర్లను తెరవకూడదని నిర్ణయం తీసుకోవడం కొత్త చర్చకు దారి తీస్తోంది. దేశవ్యాప్తంగా అసలు ఎన్ని రాష్ట్రాల్లో సినిమా హాళ్లు తెరుచుకుంటాయో ఇప్పటికీ క్లారిటీ లేదు.

ప్రభుత్వం చెప్పిన 24 మార్గదర్శకాలను పాటిస్తూ 50 శాతం సీటింగ్ కెపాసిటీతో కొత్త చిత్రాలు లేకుండా మొక్కుబడిగా పాతవాటితో నడపటం కన్నా ఇంకొంత కాలం మూసి ఉంచడమే బెటర్ అంటున్న వాళ్ళు లేకపోలేదు. తెలుగు రాష్ట్రాల్లో మల్టీ ప్లెక్సులు, కొన్ని పేరున్న సుప్రసిద్ధ థియేటర్లు తప్ప మిగిలినవాళ్ల నుంచి 15వ తేదీ గురించి అంత ఉత్సాహం ఏమి కనిపించడం లేదు. పైగా మూడు నుంచి ఆరు దాకా స్క్రీన్లు ఉన్న కాంప్లెక్స్ లలో అన్నేసి సినిమాలు తేవడం కూడా ఇప్పుడు పెద్ద సవాలే. షో టైమింగులు మార్చినా, కుదించినా ఇప్పుడు సరైన కంటెంట్ చాలా అవసరం. అది చేతిలో లేదు. పోనీ నిర్మాతలు ఏమైనా తమ కొత్త సినిమాల విడుదల తేదీలు ప్రకటించి ప్రోత్సహిస్తున్నారా అంటే అదీ లేదు. ఇప్పటిదాకా ఓటిటిలో డైరెక్ట్ రిలీజైనవన్నీ అయితే యావరేజ్ లు లేదా డిజాస్టర్లు.

ఒక్కటంటే ఒక్కటి బ్లాక్ బస్టర్ లేదు. కొద్దోగొప్పో బాగున్నాయనిపించినవి టీవీలో వచ్చేశాయి. వాటిని వేసుకుంటే జనం వచ్చేస్తారని అనుకోవడం అత్యాశే. అటు హిందీలోనూ ఏ సినిమాలు రెడీగా లేవు. ఇంగ్లీష్ లో ఒక్క టెనెట్ మాత్రమే రావడానికి సిద్ధంగా ఉంది. నోలన్ సినిమా కాబట్టి బిసి సెంటర్స్ లో కలెక్షన్లు రావడం కష్టమే. అందుకే ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. చూస్తుంటే రోజుకు రెండు మహా అయితే మూడు షోలు వేయడమే గగనంగా కనిపిస్తోంది. కరోనా ఉదృతి గతంతో పోలిస్తే బాగా తగ్గినప్పటికీ ప్రభుత్వం మాత్రం థియేటర్లకు ఇంకా ఆంక్షలు కొనసాగిస్తూనే ఉంది. దీపావళి దాకా ఈ గందరగోళం తప్పదు. అప్పటికైనా వంద శాతం ఆక్యుపెన్సీకి పర్మిషన్లు వస్తే రెడ్, క్రాక్, ఉప్పెన లాంటి సినిమాలతో హాళ్లు మునుపటి కళను సంతరించుకుంటాయి. లేదా జనవరి దాకా ఎవరూ ఏమి చేయలేని నిస్సహాయత నెలకొంటుంది. అందుకే ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉన్న పెద్ద సినిమాల నిర్మాతలు సంక్రాంతి మీదే కన్నేశారు