iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి గురించి హఠాత్తుగా కొందరికి ప్రేమ పుట్టుకొచ్చింది. తాను గద్దె దిగుతూ రూ. 60వేల కోట్ల పెండింగు బిల్లులు పెట్టేసి కేవలం రూ. 100 కోట్లతో ఖజానా అప్పగించిన చంద్రబాబు వైఫల్యాన్ని ఇప్పటి ప్రభుత్వం మీద నెట్టేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. 2019 జూన్ నెల వేతనాలు చెల్లించాలనే విషయంలో కూడా స్పష్టత లేని దశలో జగన్ గద్దనెక్కిన విషయాన్ని మరుగున పరచాలని చూస్తున్నారు. ఆ క్రమంలోనే ఏపీలో అప్పులు గురించి అనేకనేక కథలు ప్రచారం చేస్తున్నారు. ఆ క్రమంలో జగన్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను తప్పుబట్టేందుకు కూడా వెనుకాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
సహజంగా ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలకు తిలోదకాలిస్తున్నాయని, అర్హులకు అందించడం లేదని, పథకాల మాటున అక్రమాలు జరుగుతున్నాయని ఇలాంటి విమర్శలు వస్తూ ఉంటాయి. విపక్షాలు వాటి మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏపీలో భిన్నమైన పరిస్థితి. అర్హులందరికీ, అవినీతికి తావు లేకుండా అన్ని పథకాలు అందుతున్నాయి. దాంతో సామాన్యులకి అది ఊరటగా కనిపిస్తోంది. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ఎంతో చేదోడుగా ఉంటోంది. అయితే అది టీడీపీ నేతలకు రుచించడం లేదు. అప్పులకు, సంక్షేమ పథకాలకు ముడిపెట్టి ప్రభుత్వాన్ని విమర్శించేందుకు చూస్తోంది.
ఆ క్రమంలోనే తాజాగా అభయహస్తం పథకానికి సంబంధించిన కార్పస్ ఫండ్ చుట్టూ వివాదం రాజేయాలని టీడీపీ కుయుక్తులు పన్నుతోంది. నిజానికి అభయహస్తం పథకం అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. డ్వాక్రా మహిళలు రోజుకి రూపాయి చొప్పున పొదుపు చేస్తే 60 ఏళ్ల తర్వాత వారికి రూ. 2వేల వరకూ పెన్షన్ వచ్చేలా ఈ పథకం రూపొందించారు. అయితే ప్రస్తుతం సామాజిక పెన్షన్లే రూ. 2250గా ఉంది. త్వరలో మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. అలాంటిది కేవలం అభయహస్తం కింద రూ. 2వేల పెన్షన్ మాత్రమే వస్తుందంటే చాలామంది మొగ్గుచూపడం లేదు. దానిని గమనంలో ఉంచుకున్న ప్రభుత్వం అభయహస్తం నుంచి విరమించుకోవాలని ఆర్డినెన్స్ జారీ చేసింది.
అభయహస్తం కోసం ఎల్ఐసీలో డ్వాక్రా మహిళలు జమచేసిన సుమారు 2వేల కోట్లను ఏపీ ప్రభుత్వం తన అకౌంట్ లోకి మళ్లించింది. ఈ అంశంలో ప్రభుత్వమే తొలుత ఆర్డినెన్స్ జారీ చేసింది. దాంతో ఎల్ఐసీలో కార్పస్ ఫండ్ విత్ డ్రా చేసుకున్న తరుణంలో ఆ సంస్థ అధికారికంగా ప్రకటన ఇచ్చింది. దానికి తోడు అభయహస్తం మాదిరిగానే అర్హులందరికీ పెన్షన్ల విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తుందని అధికారులు చెబుతున్నారు. 2019లో కేవలం 48 లక్షల మందికి పెన్షన్లు ఉండగా, ప్రస్తుతం అవి దాదాపుగా 60లక్షలకు చేరాయి. దాంతో అర్హులందరికీ పెన్షన్లు అందుతున్న క్రమంలో అభయహస్తం వంటి వాటి వల్ల అదనపు ప్రయోజనం లేనందునే దానిని ఉపసంహరించుకున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
ఇదేదో నేరం అన్నట్టుగా, కొంపలు మునిగిపోయినట్టుగా టీడీపీ చిత్రీకరించ చూస్తోంది. కానీ నిజానికి సాధారణ పెన్షన్ ఎక్కువ వస్తున్నప్పుడు అభయహస్తం వల్ల ఉపయోగం ఏముంటుందన్నదే ప్రధాన ప్రశ్న. అదే సమయంలో ఉపయోగం లేని సమయంలో అభయహస్తం పేరుతో ఎల్ ఐ సీలో ఉంచిన రూ 2100 కోట్లకు ఆ సంస్థ కేవలం 3 శాతం వడ్డీ చెల్లిస్తోంది. కానీ ఎల్ ఐ సీ అప్పులపై 6 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. దాంతో ఎల్ఐసీలో డిపాజిట్ల విషయంలో ప్రభుత్వ పునరాలోచన చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. అయితే దానిని కూడా రాజకీయంగా వివాదం చేసే ఉద్దేశంతో విపక్షాలు చేస్తున్న యత్నాలు విశేషంగా కనిపిస్తున్నాయి. ఏపీ ఆర్థిక పరిస్థితిని గమనంలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయం పట్ల విపక్ష రాజకీయాలు సామాన్యులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి.
Also Read : Jagananna Vidya Deevena – విద్యార్థులకు శుభవార్త .. నేడు విద్యాదీవెన సొమ్ము జమ