iDreamPost
iDreamPost
దమ్మాలపాటి శ్రీనివాస్. మాజీ అడ్వొకేట్ జనరల్. ఇప్పటికే అమరావతి భూకుంభకోణంలో ఆయన పాత్రమీద ఏసీబీ కేసు నమోదు చేసింది. విచారణకు సిద్ధమయ్యింది. ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదయ్యింది. అయితే ఆ కేసులో విచారణ వద్దంటూ ఏపీ హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. తదుపరి చర్యలు నిలుపుదల చేస్తే తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చింది.
అంతేగాకుండా ఎఫ్ఐఆర్ లో వివరాలు వెల్లడించకూడదంటూ గ్యాగ్ ఆర్డర్ కూడా ఇచ్చింది. ఇది దేశమంతా పెద్ద చర్చకు దారితీసింది.
ఆ వెంటనే దమ్మలపాటి శ్రీనివాస్ చేతిలో మోసపోయిన మరో బాధితుడు ముందుకొచ్చారు. రిటైర్డ్ లెక్చరర్ రాజ రామ్మోహన్ రావు ఫిర్యాదు చేశారు. మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. దమ్మాలపాటి శ్రీనివాస్ , ఆయన భార్య నాగరాణి, బావమరిది నన్నపనేని సీతారామరాజుపై విచారణ ప్రారంభించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. రెండు ఫ్లాటులు, ఒక ఇంటి స్థలం అమ్మేందుకు భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని కేవలం ఒక ఫ్లాట్ మాత్రమే తీసుకని మోసం చేశారంటూ వచ్చిన ఫిర్యాదుతో చర్యలు తీసుకోవాల్సి ఉంది.
ఈలోగానే ఏపీ హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వారిపై నమోదయిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ రెండు వారాల పాటు వాయిదా వేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 13న చేపట్టాలని హైకోర్ట్ నిర్ణయించింది. మంగళగిరి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ దమ్మాలపాటి బావమరిది నన్నపనేని సీతారామరాజు వేసిన పిటీషన్ పై కోర్ట్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.
అదే సమయంలో దమ్మాలపాటి అవినీతి వ్యవహారంపై ఫిర్యాదు చేసిన తనకు ప్రాణహాని ఉందని అమరావతి కేసులో ఫిర్యాదు దారుడు శ్రీనివాస్ వాపోతున్నారు. ఆమేరకు ఆయన ప్రకాశం జిల్లా పోలీసులను ఆశ్రయించారు. తనను బెదిరించేందుకు దమ్మాలపాటి అనుచరులు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. అమరావతి కుంభకోణంలో దమ్మాలపాటి గుట్టురట్టు చేసినందుకు తనపై కక్షగట్టారని, కేసు ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారంటూ బాధితుడు చెబుతున్నారు.