Idream media
Idream media
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజూకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఒకటి, రెండు రోజుల్లోనే 30,000కు చేరువయ్యేలా ఉన్నాయి. ఇప్పటికే 27000కు పైగా కేసులు నమోదు అయ్యాయి. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపరీతంగా నమోదవుతున్నాయి. నిత్యం 1500కు పైగా కేసులు నమోదవుతూ రికార్డులు సృష్టిస్తుంది. పేద, ధనిక.. సామాన్యుడు, ఉద్యోగి అన్న తేడా లేకుండా కరోనా మహమ్మారి అందరినీ కలవరపెడుతోంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కరోనా వైరస్ తాలూకూ భయాందోళనలో నెలకొన్నాయి. తాజాగా తెలంగాణ హైకోర్టు సైతం కరోనా వైరస్ తాకడంతో కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి తెలంగాణ హైకోర్టును మూసివేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు తెలంగాణ హైకోర్టులో 25 మంది ఉద్యోగులకు కరోనా వైరస్ పాజిటివ్ సోకినట్టు అధికారులు నిర్ధారించారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గురువారం నుంచి హైకోర్టు మూతపడనుంది.
వీడియో కాన్ఫరెన్స్ విషయంలో..
ఈ నేపథ్యంలో హైకోర్టును పూర్తిగా శానిటైజేషన్ చేయాలంటూ న్యాయమూర్తులు ఆదేశించారు. అందుకు సంబంధించి హైకోర్టులోని ఫైల్స్ అన్నింటినీ జ్యూడీషియల్ అకాడమీకి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కేవలం ప్రధాన కేసులను మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేసే కేసుల విషయంలో ఎలాంటి మార్పు లూ ఉండబోవని హైకోర్టు పేర్కొంది. వైరస్ ఉధృతి నేపధ్యంలో ప్రభుత్వం సైతం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ – ఆఫీస్ పాలన దిశగా అడుగులు పడుతున్నాయి.