iDreamPost
iDreamPost
దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందా.. కొత్త సమస్యలు తప్పవా.. తీవ్ర మాంధ్యం ముంచబోతోందా.. చాలాకాలం తర్వాత చిక్కులు వస్తున్నాయా.. ఇవే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 2000-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి త్రైమాసికం లెక్కల్లో తిరోగమనం దానికి సూచికగా భావిస్తున్నారు. ఏకంగా మైనస్ 23 శాతం వృద్ధి రేటు నమోదుకావడం తీవ్రంగా కలవరపెడుతోంది. గతంలో ఎన్నడూ ఇంత తక్కువ స్థాయిలో వృద్ఢి రేటు లేదనే లెక్కలు మరింత ఆందోళనకు మూలమవుతున్నాయి.
ఓవైపు ఆర్థిక పరిస్థితి దిగజారుతున్నట్టు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తుండగా మరోవైపు చైనాతో సరిహద్దు తగాదాలు కూడా ముసురుకుంటున్నాయి. సోమవారం స్టాక్ మార్కెట్ కుప్పకూలడానికి అదే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. దేశంలో అన్ని రంగాల్లో వృద్ధి కుంటుపడినా కేవలం స్టాక్ మార్కెట్ పరుగులతో సంతృప్తి పడుతున్న సెక్షన్ కి ఇదో పెద్ద సవాల్ కాబోతోంది. ఎందుకిలా రివర్స్ లో ఉంది అనే విషయం చాలామంది గుర్తించడం లేదు. తయారీరంగంలో 39.3 శాతం, నిర్మాణరంగంలో 50.3 శాతం మైనస్ వృద్ది రేటు నమోదయ్యింది. అంటే కీలక రంగాల్లో వ్యవస్థ కుదేలయ్యింది. కానీ షేర్ మార్కెట్ లో రిలయెన్స్, టీసీఎస్ లాంటి కొన్ని సంస్థల మూలంగా పరుగులు పెడుతున్నట్టు కనిపిస్తూ వాస్తవ వృద్దికి, స్టాక్ మార్కెట్ వృద్ధికి మధ్య చాలా వైరుధ్యం ఉందనే విషయాన్ని చాటుతోంది.
దేశీయ లెక్కలకు అతీతంగా పెరుగుతున్న షేర్ మార్కెట్ లో స్థిరత్వం మీద సందేహాలు కూడా చుట్టుముడుతున్నాయి. అదే సమయంలో కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు మరింత ముంచేలా ఉన్నాయి. దేశంలో వార్షిక వృద్ధి రేటు ఇప్పటి వరకూ కేవలం 5 సార్లు మాత్రమే మైనస్ లో నమోదయ్యింది. ఈసారి అది తప్పదనే అభిప్రాయం ఉంది. ఇప్పటికే గడిచిన 40 ఏళ్ళలోనే స్వల్ప వృద్ధి కనిపిస్తోంది. చాలామంది భావిస్తున్నట్టు కేవలం కరోనా కారణంగానే ఇలాంటి పరిస్థితి అనేది కూడా ఆర్థిక వేత్తలు అంగీకరించడం లేదు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా తిరోగమనంలో ఉందనే విషయాన్ని చెబుతున్నారు. వరుసగా ఐదు క్వార్టర్ల లెక్కలను సాక్ష్యాలుగా చూపిస్తున్నారు. అదే సమయంలో ప్రపంచంలో కరోనా కారణంగా కుదేలయిన జీ7 దేశాలతో పోల్చినా ఇండియాలో అత్యంత దయనీయంగా ఉందనే విషయాన్ని ముందుకు తెస్తున్నారు. దేశంలో ఫైనాన్స్, రియల్టీ, సర్వీస్ సెక్టార్ లో కూడా 5.3 శాతం మైనస్ వృద్ధి రేటు పెనుముప్పుని సూచిస్తుందని, ఇది అత్యంత ప్రమాదకర పరిస్థితికి సంకేతంగా అంచనా వేస్తున్నారు.
వరుసగా మూడు త్రైమాసికాల్లో మైనస్ కనిపిస్తే అది మాంధ్యానికి నిదర్శనంగా భావిస్తారు. ఇలాంటి పరిస్థితి 1958,67,68,73,80 సంవత్సరాలలో ఎదురయ్యింది. అప్పట్లో వర్షాభావం కూడా వృద్ధిరేటుని ప్రభావితం చేయగా, ఈసారి ఆశాజనకంగా వర్షాలున్నప్పటికీ మైనింగ్ లో కూడా 23 శాతం లోటు నమోదయినట్టు చెబుతున్నారు. హోటల్స్, రవాణా వంటి సేవల్లో కూడా 47 శాతం మైనస్ అనూహ్యంగానే చెబుతున్నారు. లాక్ డౌన్ తో పాటుగా దేశీయ ఆర్థిక వ్యవస్థలో లోపాలకు ఇది అద్దంపడుతుందని అభిప్రాయపడుతున్నారు. తక్షణ ఈ స్థితిని సరిదిద్దకపోతే తీవ్ర ముప్పు పొంచి ఉందనే చెబుతున్నారు. త్వరగా కోలుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదని పలువురు భావిస్తున్నారు. మోడీ ప్రభుత్వం మాత్రం దిగజారుతున్న ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుని చక్కదిద్దే చర్యల విషయంలో చొరవ చూపలేకపోతుందన్నది అనేకమంది ఆర్థికవేత్తల అభిప్రాయం.