iDreamPost
android-app
ios-app

తుది అంకంలో బీజేపీ దిగాలు

  • Published Apr 14, 2021 | 11:45 AM Updated Updated Apr 14, 2021 | 11:45 AM
తుది అంకంలో  బీజేపీ దిగాలు

ఏమంత పట్టు లేకపోయినా ఎంతో ఆర్భాటం చేసిన బీజేపీ చివరికొచ్చేసరికి చతికిల పడింది. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో బాగా వెనుకబడిపోయింది. ఈ ఎన్నిక ద్వారా రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి తానే ప్రత్యామ్నాయమని చాటి చెప్పుకోవాలని తెగ ఆరాటపడిన ఆ పార్టీ ఎన్నికలకు చాలా ముందు నుంచే హడావుడి చేసి రాజకీయాలను వేడెక్కించింది. తీరా ప్రచారం చివరి దశకు వచ్చిన వేళ నమ్ముకున్న జనసేన కలిసిరాక, జనాన్ని ఆకర్షించే నేతలు లేక, బూత్ స్థాయిలో పనిచేసే క్యాడర్ లేక కళ్ళు తేలేస్తోంది.

ఆరు నెలల ముందే హడావుడి

తెలంగాణలోని హైదరాబాద్, దుబ్బాక ఎన్నికల్లో లభించిన అనూహ్య ఫలితాలతో బీజేపీ నేతల భుజాలు గజాలయ్యాయి. అదే ఊపు ఆంధ్రలోనూ కొనసాగించి అధికార వైఎస్సార్సీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని రాష్ట్ర బీజేపీ నేతలు కలలు కన్నారు. కానీ వాస్తవాలు మరచి నేల విడిచి సాము చేశారు. ఏడూ అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం చేయడమే పెద్ద ప్రయాస. గ్రామస్థాయిలో నెట్వర్క్, నేతలు ఉన్న పార్టీలే చాలా కష్టపడాల్సిన పరిస్థితి. అటువంటిది ఎటువంటి కార్యకర్తల బేస్ గానీ, ఓట్ బ్యాంక్ గానీ లేని తమలాంటి పార్టీలకు అది దుస్సాధ్యమన్న వాస్తవాన్ని కమలం నేతలు విస్మరించారు. కేవలం పవన్ కళ్యాణ్, ఆయన పార్టీని నమ్ముకొని తొడలుగొట్టి సవాళ్లు చేశారు. తిరుపతిలో గెలుపు తమదేనంటూ ఐదు నెలల ముందు నుంచే శోభయాత్రలు, సమావేశాలంటూ హంగామా సృష్టించారు. కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయంలో జెనసేనానిని ఒప్పించడం, అభ్యర్థిని ఎంపిక చేయడంలోనే నానా పాట్లు పడ్డారు. నామినేషన్ల చివరి క్షణం వరకు మల్లగుల్లాలు పడ్డారు.

Also Read : అసమర్థులెవరో..? ప్రజలకు తెలుసు సోముజీ..!

కలిసిరాని జనసేన

వాస్తవానికి తిరుపతిలో సామాజికవర్గ పరంగా కొంత పట్టున్న పవన్ కల్యాణ్ తన పార్టీ జనసేనను అక్కడ బరిలో దించాలని భావించారు. పార్ట్ క్యాడర్ కూడా దాని కోసమే ఎదురుచూశారు. అయితే తిరుపతి నుంచి తాము పోటీ చేయడం చారిత్రక అవసరమన్నంత బిల్డప్ ఇచ్చిన రాష్ట్ర బీజేపీ నేతలు పవన్ పై ఒత్తిడి తెచ్చి ఒప్పించారు. పైకి అంగీకరించినా బీజేపీ తీరుపై పవన్ తోపాటు జనసేన శ్రేణులు కూడా గుర్రుగానే ఉన్నాయి. అదే అసంతృప్తితో ప్రచారం మొదటి దశలో జనసైనికులెవరూ పాల్గొనలేదు. జనసేనపైనే పూర్తిగా ఆధారపడిన కమలదళం ఈ పరిణామాలతో కళవెళ పడింది. పవన్ ను ప్రాధేయపడటంతో పది రోజుల క్రితం ఆయన వచ్చి ఒక పూట ప్రచారం చేసి వెళ్లారు.

అధినేత రావడంతో జనసేన శ్రేణులు కూడా కొంత చల్లబడి ప్రచారంలో పాల్గొనసాగారు. దీంతో కుదుటపడిన బీజేపీ నేతలు.. అదే ఉత్సాహంతో నాయుడుపేటలో విజయయాత్ర పేరుతో పవన్, జేపీ నడ్డా నేతృత్వంలో భారీ బహిరంగ సభ తలపెట్టారు. దానికి కొన్ని రోజుల ముందే కరోనా అనుమానంతో జనసేనాని క్వారెంటైన్ లోకి వెళ్లిపోయారు. ఈ పరిణామం బీజేపీ ఆశలపై నీళ్లు చల్లింది. ఆయన రాకపోయినా వీడియో ద్వారా ప్రసంగిస్తారని ఆశపడ్డారు. అయితే అవేవీ జరగలేదు. జనసేన కార్యకర్తలు కూడా ఆ సభ వైపు తొంగి చూడలేదు. అటు జనసమీకరణలో బీజేపీ విఫలం కావడంతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పాల్గొన్న ఆ సభ తుస్సుమంది. ప్రచారానికి ఇంకొక్క రోజే గదువున్న పరిస్థితుల్లో పవన్ రాక, ఆయన కార్యకర్తల సహకారం ఇక లేనట్లే.

కమలం సొంత చరిష్మా అంతంతే

తిరుపతిలో గత ఎన్నికల్లో బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. కార్యకర్తల బలం గానీ, పేరున్న నేతలు గానీ లేరు. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు ప్రచారం చేస్తున్నా వారెవరికీ జనసమూహాలను ఆకట్టుకునే శక్తి లేదు. అందువల్లే జేపీ నడ్డా, సునీల్ దేవధర్ వంటి నేతల ప్రచారం ప్రయోజనం చేకూర్చలేదు. ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ ఉక్కు, పోలవరం వంటివాటి విషయంలో కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయంపై సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో బీజేపీ క్రమంగా ప్రచారంలో వెనుకబడిపోయింది.

Also Read : జేడీ లక్ష్మీనారాయణ.. బ్యాక్‌ టూ పెవిలియన్‌