iDreamPost
android-app
ios-app

సీరియస్ సబ్జెక్టు అయినా మార్చాల్సిందే

  • Published Mar 18, 2021 | 5:20 AM Updated Updated Mar 18, 2021 | 5:20 AM
సీరియస్ సబ్జెక్టు అయినా మార్చాల్సిందే

వచ్చే నెల 9న విడుదల కాబోతున్న వకీల్ సాబ్ ప్రమోషన్ మెల్లగా ఊపందుకుంటోంది. ఆశించినంత వేగంగా నిర్మాణ సంస్థ పబ్లిసిటీ చేయడం లేదని పవన్ ఫ్యాన్స్ కొంత కినుక వహించినప్పటికీ మితిమీరిన అంచనాలు రేపకుండా దిల్ రాజు టీమ్ చాలా ప్లాన్డ్ గా మంచి పనే చేస్తోంది. ఇప్పటిదాకా ఒక చిన్న టీజర్, మూడు లిరికల్ వీడియోలు వచ్చేశాయి. నిన్న విడుదలైన కంటిపాప కంటిపాప పాట కూడా మంచి స్పందన దక్కించుకుంది. తమన్ తన మీద పెట్టుకున్న అంచనాలు నెరవేర్చేలాగే కనిపిస్తున్నాడు. రీ రికార్డింగ్ లోనూ తనదైన ముద్రవేసే ఛాన్స్ పుష్కలంగా ఉంది. అందులోనూ మొదటిసారి పవర్ స్టార్ కు ఇచ్చిన మ్యూజిక్ ఇది.

వీటి సంగతలా ఉంచితే పింక్ రీమేక్ గా రూపొందిన వకీల్ సాబ్ లో లేనిపోని కమర్షియల్ అంశాలు ఎక్కువగా జోడించి దాన్నో మసాలా సినిమాగా మార్చారని, అసలు ఉద్దేశం పక్కకు వెళ్తోందని ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఒరిజినల్ వెర్షన్ లో అమితాబ్ చేసిన క్యారెక్టర్ ని ఇక్కడ పవన్ ఇమేజ్ కు తగ్గట్టు వయసులో ప్లస్ గెటప్ లోనూ చాలా మార్పులు తీసుకొచ్చారు. అందులో లేని ఫైట్లను కూడా జొప్పించారు. మహిళలు తమ హక్కుల కోసం పోరాడే కాన్సెప్ట్ తో రూపొందుతున్న సినిమాలో ఇవన్నీ ఎందుకని ఓ వర్గం చేస్తున్న కంప్లయింట్. ఇక్కడే కొన్ని వాస్తవాలు తరచి చూడాలి.

పవన్ కళ్యాణ్ లాంటి మార్కెట్ ఉన్న హీరోతో వంద కోట్ల బిజినెస్ చేస్తూ సినిమా ప్లాన్ చేసుకున్నప్పుడు ఉట్టి సందేశాలు చెబితే వర్కౌట్ కాదు. చిరంజీవి ఠాగూర్ లో కథాంశం ఎంత సీరియస్ గా ఉన్నా శ్రేయతో డ్యూయెట్లు పాడక తప్పలేదు. ఫైట్లు చేయక మానలేదు. కమల్ హాసన్ భారతీయుడులో ఊర్మిళాతో కలిసి అదిరేటి డ్రెస్సు మేమేస్తే పాటలో డాన్సులు చేయడం మర్చిపోతే ఎలా. అపరిచితుడులోనూ అంతే జెంటిల్ మెన్ లోనూ అంతే. స్టార్ హీరోల ఇమేజ్ కు తగ్గట్టు సబ్జెక్టులో ఇలాంటి మాస్ అంశాలు జోడించక తప్పదు. అంతే కానీ పింక్ ని యథాతథంగా తీస్తే నిజంగానే దిల్ రాజుకు షాక్ తగిలే రిజల్ట్ వస్తుంది. అందుకే ఈ మార్పులు చేర్పులు