iDreamPost
android-app
ios-app

బ్రదర్ అనీల్ తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ!

  • Published Aug 09, 2021 | 2:38 AM Updated Updated Aug 09, 2021 | 2:38 AM
బ్రదర్ అనీల్ తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ!

తెలంగాణలో మరో సంచలన భేటీ జరిగింది. అధికార టీఆర్ఎస్ పార్టీ నేత, వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. బ్రదర్ అనీల్ తో భేటీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు వెళ్లి అనీల్ ను కలిశారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి రాజయ్య అభిమాని. దీంతో అనీల్ తో ఆయన భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. టీఆర్ఎస్ లో ముందు నుంచీ అసంతృప్తితో ఉన్న రాజయ్య.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ వైపు చూస్తున్నారనే ఊహాగానాలకు తెరతీసింది. ఇందుకోసమే ఆయన భేటీ అయ్యారనే చర్చకు తావిచ్చింది.

గతంలోనే షర్మిలతో సమావేశం?

ఆదివారం బ్రదర్ అనీల్ తో సమావేశమైన తాటికొండ రాజయ్య.. గతంలో వైఎస్ షర్మిలతో పలు మార్లు భేటీ అయినట్లు వైఎస్సార్ తెలంగాణ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు కూడా షర్మిల అందుబాటులో లేకపోవడంతోనే అనీల్ తో భేటీ అయినట్లు అంటున్నాయి. తాజాగా జరిగిన భేటీ వ్యక్తిగతమేనని ఇరు వర్గాలు చెబుతున్నాయి. కానీ ముందు ఇలా మొదలయ్యే సమావేశాలే.. రాజకీయ మార్పులకు కారణమవుతాయని నేతలు అంటున్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల భర్త అయిన అనీల్.. పార్టీ వ్యవహారాలను ముందుండి చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి సమావేశం భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారి తీస్తాయోననే చర్చ మొదలైంది. నిజానికి అనీల్ తో రాజయ్య భేటీ అయినట్లు ముందుగా వార్తలు రాలేదు. సాయంత్రం తర్వాత లేటుగా మీడియాకు సమాచారమిచ్చారు. దీంతో ఏదో రాజకీయ కోణముందనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.

రాజయ్య.. టీఆర్ఎస్ లో ఉండలేక..

డాక్టర్ అయిన రాజయ్య.. 1997లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1999 ఎన్నికల్లో స్టేషన్‌ ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తెరాస పొత్తులో భాగంగా స్టేషన్‌ ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి తెరాస తరుపున విజయరామ రావ్ పోటీచేయగా రాజయ్య రెబల్ అభ్యర్థిగా పోటీచేసి నామమాత్రంపు ఓట్లు సాధించాడు.

2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2012లో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. 2012లో ఉప ఎన్నికలో, 2014 ఎన్నికల్లో గెలిచారు. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ కొన్నాళ్లకే అవినీతి ఆరోపణలతో మంత్రి పదవిని కోల్పోయారు రాజయ్య. ఇదే సమయంలో తన రాజకీయ ప్రత్యర్థి అయిన కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిని చేశారు కేసీఆర్. దీంతో రాజయ్య లోలోన రగిలిపోయారు. టీఆర్ఎస్ లో ఉండలేక, ఇంకో పార్టీలోకి వెళ్లలేక అలానే కొనసాగుతున్నారు.

2018 ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ నుంచి తెరాస తరుపున మరోసారి గెలిచినా.. మంత్రిపదవి దక్కలేదు. మరోవైపు కొన్నేళ్లుగా కడియం శ్రీహరి, రాజయ్య మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఒకరిపై ఇంకొకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్రదర్ అనీల్ తో రాజయ్య భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.