iDreamPost
iDreamPost
వరసగా రెండు సంవత్సరాలు కరోనా వల్ల తీవ్రంగా దెబ్బ తిన్న టాలీవుడ్ ఇప్పుడు ప్రభుత్వాల నుంచి వెసులుబాట్లు ఆశిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో నిషేధించిన పార్కింగ్ ఫీజులు, ఆస్తి పన్ను కొంత కాలం రద్దు చేయడం, థియేటర్లు మూసివేసిన కాలానికి విద్యుత్ బిల్లుల మాఫీ లాంటి కొన్ని విన్నపాలను ఇటీవలే నేరుగా సిఎస్ ని కలిసి విన్నవించింది. అటు ఏపిలోనూ కర్ఫ్యూ పూర్తిగా ఎత్తివేయడంతో పాటు వంద శాతం ఆక్యుపెన్సీ కోసం ఎదురు చూస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఈ పరిణామాల నేపధ్యంలోనే ఇంకా థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. రెండు రాష్ట్రాల్లో పట్టుమని ఓయాభై కూడా ఓపెన్ కాలేదంటే ఆశ్చర్యం లేదు.
నిజానికి దీనివల్ల బడా హీరోలకు జరిగిన నష్టం కానీ కలిగిన ఇబ్బంది కానీ ఏమి లేదు. కాల్ షీట్లు వృధా కావడం తప్పించి ఇంట్లోనే సంపూర్ణ ఆరోగ్యంతో రెస్టు తీసుకున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న నిర్మాతలు కూడా విడుదల వాయిదా వల్ల వడ్డీల భారం మోశారు తప్పించి ఇప్పటికిప్పుడు దివాలా తీసే సీన్ ఎవరికీ లేదు. ఎటొచ్చి చితికిపోతున్నది చిన్న ప్రొడ్యూసర్లు, సింగల్ స్క్రీన్ యజమానులు, వాటి మీద ఆధారపడ్డ సిబ్బంది. అందుకే ఏవైనా ఉపశమన చర్యలు చేపడితే ముందుగా దృష్టిలో పెట్టుకోవాల్సింది వీళ్ళనే. నెలల తరబడి జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారి ఎన్ని ఇబ్బందులు పడ్డారో వాళ్లకు ఆ దేవుడికే తెలియాలి.
కరోనా థర్డ్ వేవ్ ప్రచారం నిజమైనా కాకపోయినా ఓ స్థిరమైన పరిష్కారం దిశగా పరిశ్రమ అడుగులు వేయడం చాలా అవసరం. ఒక సినిమాను ఓటిటికి ఇవ్వడం వల్ల దాని వల్ల కలిగే ప్రయోజనం పూర్తిగా నిర్మాత ఒక్కడికే దక్కుతోంది.ఆ సినిమాను వేసుకుని ఆదాయం చేసుకుందామని ఎదురు చూసిన ఎగ్జిబిషన్ రంగంకు ఒక్క రూపాయి రాదు. అలా అని వాళ్లకు షేర్ ఇవ్వాలని కాదు. ఏదైనా ప్రత్యాన్మయం దొరికే విధంగా ప్రణాళికలు వేసుకోవాలి. వర్తమానాన్ని కాదు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఇకపై చర్చలు జరగాలి. మరోసారి ఇలాంటి పరిస్థితే వస్తే ఏం చేయాలనే దాని గురించి ముందు చూపు ఉండాలి. అది సాధ్యమేనా అంటే కాలమే సమాధానం చెప్పాలి.