iDreamPost
android-app
ios-app

న్యూజిలాండ్‌ యూత్ ఎంపీగా తెలుగమ్మాయి

న్యూజిలాండ్‌ యూత్ ఎంపీగా తెలుగమ్మాయి

న్యూజిలాండ్‌లో ఓ తెలుగు అమ్మాయికి అరుదైన గౌరవం దక్కింది. ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘన(18) న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైంది. తాజాగా న్యూజిలాండ్ నామినేటెడ్‌ ఎంపీ పదవుల ఎంపిక జరిగింది. ఆ క్రమంలో ‘సేవా కార్యక్రమాలు, యువత’ విభాగానికి ప్రాతినిథ్యం వహించే పార్లమెంట్‌ సభ్యురాలిగా మేఘన ఎంపికైంది. మేఘన వాల్‌కోట్టో ప్రాంతం నుండి దేశ నామినీ ఎంపీగా ఎన్నికయ్యారు. తెలుగువారైనా మేఘన తల్లిదండ్రులు న్యూజిలాండ్‌లో స్థిర పడ్డారు. ఆమె తండ్రి గడ్డం రవికుమార్ ఉపాధి నిమిత్తం 2001లో న్యూజిలాండ్ వెళ్లారు. అప్పటి నుంచి భార్యతో కలిసి న్యూజిలాండ్ లోనే స్థిరపడ్డాడు.

అక్కడే పుట్టి పెరిగిన మేఘన కేంబ్రిడ్జిలోని సెయింట్‌ పీటర్స్‌ హైస్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. విద్యార్థిగా ఉన్న నాటి నుంచే మేఘన అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుండే వారు. దేశంలో శరణార్థులకు చేయూతనివ్వడంలో మేఘన ఎంతో కృషి చేశారు. ఈ అంశంలో ఆమె కనబర్చుతున్న సేవా దృక్పథమే యూత్ పార్లమెంటు సభ్యత్వం దక్కడానికి కారణమైందని తెలుస్తోంది. తన స్నేహితులతో కలిసి విరాళాలు సేకరించి అనాథ శరణాలయాలకు అందచేసేవారు.

అంతేకాకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన శరణార్థులకు విద్య, వసతి, ఇతర సౌకర్యాలు కల్పించడంలో మేఘన ముఖ్య పాత్ర పోషించింది. గత ఏడాది డిసెంబర్ 16న జరిగిన ఈ పార్లమెంటు సభ్యుల ఎన్నికలో మేఘనా ఎంపిక కావడంతో ఫిబ్రవరిలో మేఘన ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ పదవిలో ఆమె ఆరు నెలలు కొనసాగనున్నారు. ప్రపంచ దేశాల్లో నిర్వహించే యూత్ పార్లమెంట్లలో అత్యంత శక్తిమంతమైనదిగా పేరుపొందింది న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్. ఇక తెలుగు అమ్మాయి ఈ ఘనత సాధించడంతో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆమెకు అభినందనలు చెబుతున్నారు.

Also Read : ఎన్టీఆర్ వెన్నుపోటుకు 26 ఏళ్లు ! రేపు వర్థంతి