Idream media
Idream media
మన ఇండియాలో మొట్టమొదటి న్యూస్ పేపర్ బెంగాల్ గజెట్ పేరుతో 1780 లో మొదలనప్పటికీ దాని విస్తృతి 19 వ శతాబ్దములో మొదలై పెరుగుతూ 20 వ శతాబ్దములో స్వతంత్ర పోరాటంలో ఎంతగానో ఉపయోగపడింది, ఇది అప్పటికి అక్షరాస్యత తక్కువ ఉండటంవల్ల ప్రజలందరికీ చేరకపోయినప్పటికీ నాయకులకు, చదువుకున్న కొంతమంది మనోవికాసానికీ ఉపయోగపడితే వారి ద్వారా పామర జనాలకు చేరి సమాజ ఉన్నతికి ఉపయోగపడింది.
స్వాతంత్య్రం వచ్చిన తరువాత మన రాజ్యాంగం నెలకొల్పుకొనేటప్పడు మీడియా హక్కులు, రక్షణలు అమెరికా, ఇంగ్లాండ్ దేశాలలో లాగ కల్పిస్తామనుకున్నపుడు అంబెడ్కర్ గారు ప్రజలకు వాక్ స్వతంత్రం 19 (1 ) (a ) కల్పిస్తున్నపుడు అవే హక్కులు, రక్షణలు వీరికి కూడా వర్తిస్తాయి మీడియా వాళ్ళు కూడా ఈదేశం పౌరులే కదా, వాళ్ళ కంటే ఎక్కువ హక్కులు ఎవరికి అవసరం లేదు అని మన రాజ్యంగములో మీడియాకు ప్రత్యేక స్వేచ్ఛ/ హక్కులు ఎక్కడ ప్రత్యేకంగా కల్పించలేదు.
ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి మీడియా స్వేచ్ఛ అవసరమని, ఆ స్వేచ్ఛకు ప్రభుత్వాలనుండి ముప్పు ఎదురైన సందర్భాలలో రక్షణగా మన న్యాయవ్యవస్థ మీడియాకు దన్నుగా నిలిచింది.
ఇదిలా ఉండగా ప్రజా అభిప్రాయాన్ని మలచటములో మీడియా పాత్ర అక్షరాస్యత పెరిగిన తరువాత వచ్చిన తరానికి అంటే 35 -40 ఏళ్ల పైబడిన వారికి బాగా తెలుసు. వారందరూ మీడియా వల్లనే తమ వృత్తిపరమైన విజ్ఞానముతో పాటు సమాజం, దేశం, ప్రపంచం, నాయకులు, రాజకీయాల గురుంచిన విజ్ఞానాన్ని మీడియా ద్వారా పొంది తమ తమ అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు. ఆవిధంగా ప్రజాస్వామ్యములో మీడియాది చాలా ప్రముఖ మైన పాత్ర.
అంతటి ప్రాముఖ్యగల పాత్ర కాబట్టే ప్రజాస్వామ్యానికి మీడియాను నాలుగో మూల స్థంభం అంటారు. ప్రభుత్వాలు చేసే తప్పిదాలను ఎత్తి చూపి ప్రజలకు మేలు చేస్తూ, అన్ని రకాల సమాచారాన్ని, చేరవేస్తూ ప్రజల ఉన్నతికి, సమాజపు బాగుకు తోడ్పడేదిగా ఉండటం దాని ప్రధాన నిర్ధేశయింపబడిన, ఆశిస్తున్న విధి. అంతటి గురుతర బాధ్యతలు అది మోస్తోందని నమ్మబట్టే స్వతంత్రం తరువాత 3 -4 దశాబ్దాలు దాని గౌరవ, ప్రతిష్టలు చాలా ఉన్నత స్థాయిలో ఉండేవి.
అన్ని వ్యవస్థలో స్వార్థపరులు ప్రవేశించినట్లే మీడియాలోకి కూడా ప్రవేశించడం మొదలై, ప్రస్తుతం పూర్తిగా స్వార్థపరుల చేతిలో చిక్కి దాని గౌరవ ప్రతిష్టలు పాతాళానికి జారుకున్నాయి.
ఇది మన రాష్ట్రములో ఈనాడుతో మొదలై దాదాపు అన్ని మీడియా వ్యవస్థలకు పాకిపోయింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రములో పచ్చ మీడియాగా పిలువబడుతున్న మీడియా తన వర్గపు వ్యక్తులు మాత్రమే అధికారంలో ఉండాలి, వేరే ఇతరులెవ్వరినైనా అధికార పీఠములో కుదురుకోనివ్వం, అధికారానికి రానివ్వం అని బుసలు కొడుతున్నాయి. ఇది ఉమ్మడి రాష్ట్రములో కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా వైస్సార్, తరువాత చిరంజీవి, దాసరి నారాయణ రావు, రాష్ట్రం విడిపోయిన తరువాత కెసిఆర్, జగన్ లు లక్ష్యంగా వారి దాడి కొనసాగింది, కొనసాగుతోంది. చివరికి వీరి దాడులను ఎదుర్కొనేందుకు ఏకంగా రాజకీయనాయకులే మీడియా సంస్థలను ( సాక్షి, నమస్తే తెలంగాణ మొ ..) ఏర్పాటుచేసుకున్నారు ఆవిధంగా అచ్చమైన ప్రజా పక్షం వహించే ప్రభావవంతమైన మీడియానే తెలుగు వారికి లేకుండా పోయింది. దీని వల్ల కలిగే అనర్థాలు ఎన్నో!
ఆంధ్ర రాష్ట్రములో అలా దిగజారిన మీడియా…, సమాజ ఉన్నతికి పని చేస్తున్నాం అనే ముసుగులో ప్రజా ద్రోహానికి పాల్పడుతూ… ప్రజలకు తీరని నష్టం కలిగిస్తోంది. సోషల్ మీడియా విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చిన తరువాత పచ్చ మీడియా ప్రభావం నూతన తరములో పెద్దగా లేక పోయినప్పటికీ, సోషల్ మీడియాకు దూరంగా ఉన్నవారు, కొన్ని దశాబ్దాలుగా ఈనాడు, కొన్ని సంవత్సరాలుగా ఇతర పచ్చమీడియా చేసిన థాట్ పోలీసింగుతో ఇప్పటికీ దాని ప్రభావానికి లోనౌతున్నవారున్నారు.
పచ్చ మీడియా ప్రజా ద్రోహపు పైత్యం ఏ స్థాయికి వెళ్లిందంటే…, జగన్ ప్రభుత్వం అధిక విద్యుత్ PPA ధరల వల్ల ప్రభుత్వ విద్యుత్ సరఫరా సంస్థలు నష్టాల్లో కూరుకు పోతున్నాయని, దాని వల్ల ప్రజలపై భారీగా విద్యుత్ చార్జీలను పెంచ వలసి వస్తుందని ప్రైవేటు విద్య్త్ సంస్థలతో PPA ల ధరలు తగ్గించాలని బేరమాడుతుంటే…., వాళ్ళు కోర్టుకెళ్తే అక్కడ సాంకేతిక కారణాలతో ప్రభుత్వానికి ( ప్రజలకు ) వ్యతిరేకంగా తీర్పువస్తే దానికి పచ్చ మీడియా చెప్పే భాష్యం…., జగన్కు షాకు, జగన్ సర్కారుకు షాకు, ఇదీ దాని వరుస. ఇక్కడ జగన్కు పోయేదేమీ ఉంది , నిజంగా నష్టపోయేది ఎవరు ? ప్రజలా ,? జగనా ? లేక జగన్ ప్రభుత్వమా ? కానీ ఈ విషయములో అసాధారణ రీతిలో అధిక ధరలకు ఒప్పుకొని ప్రజాద్రోహానికి కారణమైన బాబును వదిలి, ఆ నష్ట నివారణకు ప్రయత్నించినా సరే జగన్ దే ఆతప్పుగా చిత్రీకరించాలనుకోవటం ఏ మీడియా నీతి కిందకు వస్తుంది..? అప్పుడు మన పెద్దలు ఆశించిన, నమ్మకం పెట్టిన ప్రజాస్వామ్యపు నాలుగో మూలస్తంభం లక్షణాలు ఈ మీడియాలో ఎక్కడ గోచరిస్తాయి..?
ఇదే కాదు ఈమధ్య మెడికల్ విద్యార్థులు ప్రైవేటు కాలేజీలకు చెల్లిస్తున్న అధిక ఫీజు తగ్గించాలని ప్రభుత్వం ప్రజల తరుపున ప్రయత్నిస్తే ఒక వర్గపు ఆదాయానికి గండి కొట్టి, వారిని అణిచి వేశే కుట్రని మరో కపట ప్రచారం.
TV 5 యాంకర్ సాంబ జగనుకు హిందూమతము పేరుతో కూడిన అమరావతి రాజధాని నచ్చటం లేదు, కావాలంటే ఆయనకు నచ్చిన ఇతర పేరుతో ఆ రాజధానిని అక్కడే పట్టమనండి అని అంటారు. ఇది ఏవిధమైన జర్నలిజం కిందకు వస్తుంది, అసలు జగన్ ప్రభుత్వం హిందూ మత ఉద్ధరణకు TDP కంటే కూడా ఎక్కువ మంచి నిర్ణయాలే తీసుకుంది, ప్రజలలో అసలు ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వమనే భావనే ఎక్కడా లేదు, జగన్ మతమే కీలకమైతే ప్రజలు అంతగా అక్కున చేర్చుకొని 151 సీట్లు కట్టబెట్టారు కదా. హిందూ వాది అయినా…, సుబ్రహ్మణ్యం స్వామి కూడా జగన్ ను ఈ విషయంలో సమర్థించారు. ఐయినా సరే ప్రజల మనసులలో అనుమానపు విషాన్ని నింపి తమ వర్గపు వాడు మళ్ళీ పీఠమెక్కే బాట వీళ్ళు వేయాలని ఒక ఆరాటం.
ఇలా చెప్పుకుంటూ పోతే గడచినా సంవత్సరకాలంగా ఈ పచ్చ మీడియా పాల్పడుతున్న దుర్మార్గాలు ఎన్నో, అవన్నీ అతి నీతి బాహ్యం పనులే. ఇవన్నీ కూడా ప్రజలు వీటిని నమ్మి, ఆ ప్రజల వల్ల కలిగే ఆదాయముతో ఎదుగుతూ, మళ్ళీ వాళ్ళ నాశనానికి పనిచేసే అతి జుగుప్సాకరమైన పనులకిందకే వస్తాయి. ఆంద్ర ప్రజల పాలిట విషసర్పములా తయారైందీ ఈ పచ్చమీడియా.
పచ్చమీడియా ఒక సాధారణ మీడియా నెరవేర్చవలసిన బాధ్యతలను నెరవేరుస్తుందన్న ఆశ ఎక్కువ మందిలో కలుగదు, ఎందుకంటే ప్రజా ధనము, ప్రజావనరుల దోపిడీలో,దీని పాత్ర తక్కువేమీ కాదు, అంతేకాకుండా ఎక్కడా లేని కులగజ్జితో అధికారం, ప్రజా వనరులు, సంపద మా వర్గం వారి దగ్గరే ఉండాలన్న ఒక దుర్మార్గపు సిద్ధాంతానికి పుట్టిల్లే ఈ పచ్చమీడియా, అలాంటి సిద్ధాంతం వెలుగొందే యజ్ఞానికి నిత్యమూ ఆజ్యం పొసే ఈ పచ్చ మీడియా మారుతుందనుకోవటం, మారి ప్రజా పక్షం వహిస్తుందనుకోవటం వారి అమాయకత్వమే అవుతుంది. అందుకే ఆంద్ర రాష్ట్ర ప్రజలకు ఈ ప్రజా కంటక పచ్చమీడియాను ఉంచవలసిన చోటే ఉంచటం తమ బాగును తాము చేసుకోవటం లాంటిది.
మరి పచ్చమీడియా సంగతి పక్కన బెడితే సాక్షి సంగతి ఏమిటి అని ప్రశ్నించుకుంటే దానిని ఒక రాజకీయ పార్టీ పత్రికగానే పరిగణించవలసిఉంటుంది, పచ్చ మీడియా అంతటి దారుణంగా ప్రవర్తించదని అక్కడ పనిచేసి బయటకు వచ్చిన జర్నలిస్టులు చెబుతున్నప్పటికీ దానిని రాజకీయ పత్రికగానే చూడాలి.రాజకీయాలవరకు ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు దానిని అనుసరిస్తారేమో కానీ తటస్థ ప్రజలకు అది ఒక రాజకీయ పార్టీ మీడియానే అనే స్పృహ ఉండటం కొంత మేలుచేసేదే.
ఇంతగా దారి తప్పిన మీడియాను నియంత్రించి సన్మార్గములో ప్రవేశపెట్టేది ఎలా అని ప్రశ్నించుకుంటే.., మీడియా నియంత్రణకు, దాని స్వీయ రక్షణకు ప్రెస్ కౌన్సిల్ అఫ్ ఇండియా (PCI ) 1966 లో నెలకొల్పినపినప్పటికీ, అది ప్రెస్ కౌన్సిల్ ఆక్ట్ గా వచ్చింది 1978 లో. ఇది మీడియా పెడదారి పడితే గాడిన పెట్టె నియంత్రణ సంస్థగాను, మీడియాకు ముప్పు ఎదురైతే రక్షణ కల్పించే సంస్థగాను నెలకొల్పారు. ఇది చట్టబద్ధమైన, దాదాపు (QUASI ) జ్యూడిషరీతో సమానమైన సంస్థ. దీనికి మీడియా బాధితులుగాని, మీడియాలో బాధితులు గాని ఫిర్యాదుచేసి రక్షణ పొందవచ్చు. అయితే ఈ సంస్థ హక్కులు, అధికారాలు, విధులు కేవలం ప్రింటుమీడియా వరకే పరిమితమని ఇటీవలే చెప్పారు. మీడియా స్వేచ్ఛపేరుతో నిత్యమూ స్వార్థ ప్రయోగాజనాలకోసం రాసే విషపు రాతలను నియత్రించటంలో ఈ సంస్థ కూడా విఫలమైందని మన రాష్ట్ర మీడియానే కళ్ళకు కడుతోంది.
ఇక ఎలక్ట్రానిక్ మీడియాను, డిజిటల్ మీడియాను, సోషియల్ మీడియాను నియత్రించే ప్రత్యేక సంస్థే మన దేశములో ఇప్పటికీ నెలకొల్పలేకపోవటం చాలా ఆశ్చర్యకరం. కొన్ని రాష్ట్రాలు సైబర్ క్రైం చట్టాలను తెచ్చినప్పటికీ అవి మీడియాలను ఉద్దేశించిన ప్రత్యేకమైనవి కావు.
ఏదేమైనా అన్ని సందర్భాలలో ప్రజా పక్షం వహించే బలమైన మీడియా ఆంధ్ర రాష్ట్రాన లేకపోవుట ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం. నానా రకాల చెత్త ఉన్నప్పటికీ, ప్రజల గొంతుకను, ప్రజా కాంక్షను బలంగా వినిపించేది, ప్రజాహితాన్ని కోరే వేదిక ప్రస్తుతం సోషల్ మీడియానే.
ముగింపుగా చెప్పాలంటే అన్ని వ్యవస్థల మాదిరే లేదా అంత కంటే కూడా ఎక్కువగా మీడియా చెడిపోయింది, దానిని చూసి అది మనకోసం పనిచేస్తుంది అనే భ్రమలనుండి బయట పడితే, మన అవిశ్వాసాన్ని వారిపై మోపితే అదే వాళ్లు చేస్తున్న తప్పుకు ప్రజలు విధించే అసలైన శిక్ష.
…Written By Gopal.L